భారత్‌ బాండ్‌.. ఇన్వెస్ట్‌ చేస్తున్నారా?

Bharat Bond ETF NFO open until December 20 - Sakshi

రిస్క్‌ వద్దనుకునే వారికి సురక్షిత సాధనం

6.5–7.5 శాతం మధ్య రాబడులు

మూడేళ్లు, పదేళ్ల కాల వ్యవధులు

స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో కూడా ట్రేడింగ్‌

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌.. నూతన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 12న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రిస్క్‌ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఇష్యూను పరిశీలించొచ్చు. ఈ ఇష్యూ ద్వారా కనీసం రూ.7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రణాళిక. దేశంలో తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ ఇదే అవుతుంది. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే, అప్పుడు ఇన్వెస్ట్‌ చేయవచ్చా? లేదా? అన్నది ఇన్వెస్టర్లు సులభంగా నిర్ణయించుకోగలరు. ఆ వివరాలు అందించే ‘ప్రాఫిట్‌’ కథనమే ఇది.
  ∙
భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను కేంద్రం తీసుకురావడం వెనుక లక్ష్యాలను పరిశీలిస్తే.. దేశీయ డెట్‌ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్‌ ఈటీఎఫ్‌ను అందించడం.. ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి.

ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)లు ప్యాసివ్‌ (క్రియాశీలకం కాని) పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్‌ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్‌కు అనుగుణంగానే ఉంటాయి. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సంబంధించి భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌– ఏప్రిల్‌ 2023, భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ – ఏప్రిల్‌ 2030 సూచీలను ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఈటీఎఫ్‌లకు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు మధ్య వ్యత్యాసం.. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూడి ఉండడమే. మిగతాదంతా ఇతర ఈటీఎఫ్‌ల్లో మాదిరే ఉంటుంది.

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మూడేళ్లు (ఏప్రిల్‌ 2023), పదేళ్లు (ఏప్రిల్‌ 2030) కాల వ్యవధితో రెండు రకాలుగా ఉంటుంది. కాల వ్యవధి తీరిన తర్వాత అసలు పెట్టుబడి, ఆ మొత్తంపై వడ్డీ రాబడి చెల్లిస్తారు. ఇందులో కేవలం గ్రోత్‌ ఆప్షన్‌ మాత్రమే ఉంది. రాబడులను ఎప్పటికప్పుడు చెల్లించే డివిడెండ్‌ ఆప్షన్‌ లేదు. ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ ఈ ఈటీఎఫ్‌ నిర్వహణను చూస్తోంది. ఇది ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ కనుక ఇష్యూ ఈ నెల 20న ముగిసినప్పటికీ.. తర్వాత స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడవుతుంటాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ చేయనున్నారు.

లిస్ట్‌ అయిన తర్వాత యూనిట్ల రూపంలో కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. కనుక ట్రేడింగ్, డీమ్యాట్‌ అకౌంట్‌ ఉన్న వారు లావాదేవీలకు అర్హులు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక యూనిట్‌ (రూ.1,000) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ‘భారత్‌బాండ్‌ డాట్‌ ఇన్‌’ పోర్టల్‌కు వెళ్లి ఎన్‌ఎఫ్‌వో ఆఫర్‌ పత్రాన్ని పొందొచ్చు. దీనిని సమీపంలోని ఎడెల్‌వీజ్‌ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.   

ఇష్యూ సైజు
మూడేళ్ల ఈటీఎఫ్‌ రూపంలో కనీసం రూ.3,000 కోట్లు, స్పందనను బట్టి అదనంగా మరో రూ.2,000 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, పదేళ్ల ఈటీఎఫ్‌ ద్వారా కనీసం రూ.4,000 కోట్లు, స్పందన అధికంగా ఉంటే మరో రూ.2,000 కోట్ల వరకు సమీకరించనున్నారు.  

భద్రత ఎక్కువే...
భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ కచ్చితంగా ఏఏఏ రేటింగ్‌ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీల డెట్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా ఉండదు. ఏఏఏ రేటింగ్‌ తిరిగి చెల్లింపుల విషయంలో అధిక భద్రతను సూచిస్తుంది. అంటే క్రెడిట్‌ రిస్క్‌ చాలా చాలా తక్కువ. పైగా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక పెట్టుబడులకు ఎటువంటి రిస్క్‌ ఉండదు.

పన్ను ఎంతో తక్కువ
మూడేళ్లకు పైగా పెట్టుబడులను కొనసాగిస్తే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే పన్ను ఎంతో తక్కువ. ఇన్వెస్టర్ల రిస్క్‌ ప్రొఫైల్‌కు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. కన్జర్వేటివ్‌ (రిస్క్‌ తీసుకోని) ఇన్వెస్టర్లు 20–22 శాతం పెట్టుబడులను భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు కేటాయించుకోవచ్చు. ఏఏఏ రేటింగ్‌ రాబడులు, రిస్క్‌ లేని సాధనం.
– పవన్‌ అగర్వాల్, ప్రైవేటు వెల్త్‌ (ఇండియా నివేష్‌) ఎండీ  

అన్ని విధాలా అనుకూలం
అత్యంత చౌక బాండ్‌ ఫండ్‌ ఇది. çఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే బయటకు వచ్చేందుకు మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫండ్‌ విషయంలో ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీగా లిక్విడిటీ ఉంటుంది. రాబడులు, పన్ను, లిక్విడిటీ ఇలా అన్ని అంశాల్లోనూ సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్‌తో పోలిస్తే దీనికి ఎక్కువ మార్క్‌లు పడతాయి.
– నితిన్‌ జైన్, ఎడెల్‌వీజ్‌ అసెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సీఈవో

రాబడులు/చార్జీలు
ఈటీఎఫ్‌లకు నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లుగా నిర్ణయించారు. కనుక వీటిల్లో రాబడులను సుమారుగా ఊహించొచ్చు. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఎన్‌ఎఫ్‌వో డాక్యుమెంట్‌ ప్రకారం.. ఎన్‌ఎఫ్‌వో సమయంలో ఇన్వెస్ట్‌ చేసి కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఈటీఎఫ్‌లో కొనసాగితే అప్పుడు.. 2023 ఈటీఎఫ్‌లో వార్షిక రాబడులు 6.59 శాతం, 2030 ఈటీఎఫ్‌లో వార్షిక రాబడులు 7.52 శాతం వరకు ఉంటాయి. ఈ రాబడులు గ్యారంటీ కావు. కేవలం సూచనీయమైనవి. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో రాబడులకు ఎప్పుడూ హామీ ఉండదు. సూచిత రాబడులను రోజువారీగా ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.

ఇందులో ఎక్స్‌పెన్స్‌ రేషియో (పెట్టుబడులపై వసూలు చేసే నిర్వహణ చార్జీ) కేవలం 0.0005 శాతమే. దేశంలో అత్యంత చౌక మ్యూచువల్‌ ఫండ్‌ ఇది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చౌక చార్జీలతో కూడిన డెట్‌ ఫండ్‌ కూడా అవుతుంది. డెట్‌ ఫండ్స్‌లో రాబడులు తక్కువగా ఉంటాయి కనుక ఎక్స్‌పెన్స్‌ రేషియో చాలా కీలక పాత్రే పోషిస్తుంది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ చార్జీల పరంగా ఎంతో చౌక కనుక నికర రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఈటీఎఫ్‌లపై రాబడులు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవే కాల పరిమితుల డిపాజిట్లపై ఆఫర్‌ చేస్తున్న రేట్ల స్థాయిలోనే ఉంటాయని భావించొచ్చు. ఇక ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత 30 రోజుల్లోపు వైదొలిగితే అప్పుడు 0.10 శాతం ఎగ్జిట్‌లోడ్‌ చెల్లించాల్సి ఉంటుంది.  

లిక్విడిటీ...
ఒక సాధనంలో పెట్టుబడి, రాబడులతోపాటు అవసరమైన సందర్భాల్లో వేగంగా వాటిని నగదుగా మార్చుకునే సౌలభ్యం (లిక్విడిటీ) ఉండాలి. అప్పుడే అది ఇన్వెస్టర్లకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి గల ప్రధాన కారణాల్లో లిక్విడిటీ కూడా ఒకటి. మన దేశంలో చాలా వరకు డెట్‌ ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్‌ స్వల్పంగానే ఉంటోంది. అయితే, పెద్ద సైజు ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్‌ యాక్టివిటీ చురుగ్గానే ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ రూ.7,000 కోట్లకుపైనే సమీకరించనున్న దృష్ట్యా లిక్విడిటీ తగినంత ఉంటుందని ఆశించొ చ్చు.

పైగా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లలో తగినంత లిక్విడిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ చెబుతోంది. ఇందు కోసం పలువురు మార్కెట్‌ మేకర్లను నియమించనున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. వీరు తగినంత లిక్విడిటీతోపాటు ధర సహేతుకంగా ఉండేలా చూస్తారు. మార్కెట్‌ మేకర్ల కోసం రూ.20 కోట్లను వెచ్చించేందుకు ఏఎంసీలకు అనుమతి ఉంది. పైగా ఇందులో రూ.1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇది చిన్న మొత్తం కావడంతో లిక్విడిటీ మెరుగ్గానే ఉంటుందని అంచనా.

వాస్తవంగా లిక్విడిటీ ఏ మేరకు అన్నది ఈటీఎఫ్‌ లిస్ట్‌ అయిన తర్వాతే తెలుస్తుంది. ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌) రకాన్ని కూడా తీసుకురానుంది. ఇది భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేసే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. ఈ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లిక్విడిటీ పరంగా ఇబ్బందేమీ ఉండదు. ఇతర డెట్‌ ఫండ్‌ పథకాల మాదిరే అవసరమైనప్పుడు విక్రయించి పెట్టుబడులు వెనక్కి తీసేసుకోవచ్చు. డీమ్యాట్‌ అకౌంట్‌ లేని వారు ఈ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

అనుకూలమేనా..?
డెట్‌ ఫండ్‌ విభాగంలో సంక్షోభాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో అధిక క్వాలిటీ పోర్ట్‌ఫోలియోతో, ఊహించతగ్గ రాబడులతో, తక్కువ ఖర్చుతో కూడిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ అనుకూలమే. నిర్ణీత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు పరిశీలించొచ్చు. మూడేళ్లతో పోలిస్తే పదేళ్ల ఈటీఎఫ్‌లో తొలినాళ్లలో రేట్ల పరంగా అస్థిరత కొంత ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పదేళ్ల కాలంలో వడ్డీ రేట్ల పరంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించే వారు ఆందోళన చెందక్కర్లేదు. తక్కువ క్రెడిట్‌ రిస్క్, అతి తక్కువ నిర్వహణ చార్జీలతో కూడిన కార్పొరేట్‌ డెట్‌ మార్కెట్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది.

కొనుగోలు చేసి పూర్తి కాలం పాటు కొనసాగితే వడ్డీ రేట్ల రిస్క్‌ కూడా ఉండదు. రిస్క్‌ తీసుకోని ఇన్వెస్టర్లు, పదవీ విరమణ చేసిన వారు, భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ల కాల వ్యవధి వరకు కొనసాగేవారు పెట్టుబడులను పరిశీలించొచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఇది ఉపకరిస్తుంది. పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఒకే విభాగంలో (ఈక్విటీ లేదా రియల్టీ) ఇన్వెస్ట్‌ చేయడం రిస్క్‌ కోణంలో సూచనీయం కాదు. డెట్‌లోనూ కొంత ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకో వాలన్నది నిపుణుల మాట. అందుకోసం భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను పరిశీలించొచ్చు. తమ పెట్టుబడుల్లో 10–20 శాతం మేర భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

పన్ను ప్రయోజనాలు
డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి మూడేళ్ల పాటు కొనసాగితే, ద్రవ్యోల్బణ ప్రభావ మినహాయింపు (ఇండెక్సేషన్‌)ను పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్లపైన మూలధన రాబడులపై 20 శాతం పన్ను అమలవుతుంది. అంటే మూలధన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాతే 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రాబడి వ్యక్తిగత ఆదాయంలో కలసి, నిర్ణీత శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రాబడి ఎఫ్‌డీల స్థాయిలో ఉన్నా కానీ, పన్ను ఆదా పరంగా బాండ్‌ ఈటీఎఫ్‌ అదనపు ప్రయోజనం. ప్రారంభంలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి మూడేళ్ల ఈటీఎఫ్‌పై నాలుగేళ్ల ఇండెక్సేషన్‌ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. దీంతో పన్ను అనంతర రాబడులు అధికంగా ఉంటాయని ఆశించొచ్చు. మూడేళ్ల బాండ్‌ ఈటీఎఫ్‌లో పన్ను అనంతరం రాబడులు 6.3%, పదేళ్ల ఈటీఎఫ్‌లో పన్ను అనంతర రాబడులు 7 శాతంగా ఉంటాయని అంచనా.

పారదర్శకత
రోజువారీగా పోర్ట్‌ఫోలియో, ఇండికేటివ్‌ రిటర్నులు (సూచిత రాబడులు) ఎంత మేర అన్న వివరాలను ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించనుంది. అదే సంప్రదాయ డెట్‌ ఫండ్స్‌ నెలకోసారి మాత్రమే పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పోలిస్తే భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో పారదర్శకత ఎక్కువే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top