మాట్లాడుతున్న ప్రసాదరాజు, చిత్రంలో రంగరాజు, కారుమూరి, మోషేన్‌రాజు, శేషుబాబు, సర్రాజు, పీవీఎల్
పశ్చిమగోదావరి, పెనుగొండ: ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబులో వణుకు మొదలైందని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానేమోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారని, అందుకే దిగజారిపోయి వైఎస్సార్ సీపీ పథకాలను కాపీకొడుతున్నారని ఆ పార్టీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. ఆదివారం పోడూరు మండలం తూర్పు పాలెంలోని ఆచంట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. పది రోజులుగా నియోజకవర్గాల్లో చంద్రబాబు మోసాలను వివరిస్తూ నిర్వహిస్తున్న ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ముదునూరి పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా విఫలమైన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాయిలాలతో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఐదు తొలిసంతకాలు చేసిన బాబు ఇప్పటివరకూ వాటిని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు రుణమాíఫీ చేయకుండా మొండిచేయి చూపారని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో మహిళా మంత్రి పరిటాల సునీత స్వయంగా ప్రకటించారని పేర్కొన్నారు.
జగన్ పథకాల కాపీ
ప్రజల కష్టాలు గుర్తించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రకటించారని ముదునూరి పేర్కొన్నారు. అయితే వీటిని బాబు కాపీ కొడతారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితమే గుర్తించారని, ఆ విషయాన్ని ప్రజలకూ చెప్పారని గుర్తుచేశారు. నవరత్నాలు అమలు సాధ్యం కాదంటూ అప్పట్లో మంత్రుల చేత, టీడీపీ నాయకుల చేత ప్రకటనలు చేయిస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటినే కాపీ కొడుతున్నారని ఎద్దేవాచేశారు. మోసకారి బాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
జన్మభూమి కమిటీల దోపిడీ
గ్రామాలలో రైతులకు, పేదలకు ఇచ్చే సబ్సిడీలను జన్మభూమి కమిటీ సభ్యులు దోచుకుతింటున్నారని వైఎస్సార్ సీపీ ఆచంట నియోజకవర్గ కన్వీనర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. మాముడూరులో ఓ పేద రైతుకు వచ్చిన ట్రాక్టరు సబ్సిడీని టీడీపీ నేతలు దోచుకోవడమే కాకుండా, మంజూరైన ట్రాక్టరును సైతం వెనక్కి తీసుకు వెళ్లారని విమర్శించారు. సంక్షేమ పథకాలు పొందాలంటే బలవంతంగా టీడీపీ సభ్యత్వం అంటగడుతున్నారని ధ్వజమెత్తారు.
616 వాగ్దానాలు గాలికి..
2014 ఎన్నికలలో టీడీపీ 616 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైఎస్సార్ సీపీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. బాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళలు, రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల తాయిలాలు ఇస్తున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదాకు వెన్నుపోటు
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీయే ముద్దని అప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి.. హోదా కోసం పోరాడిన వారిని జైల్లో పెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని హోదా కోసం తానే పోరాడుతున్నట్టు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తొలి నుంచి హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి వచ్చి ఉంటే ఆనాడే హోదా వచ్చేదని మేకాపేర్కొన్నారు.
మహిళల సంతోషం కోసం జగన్ కృషి
రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలు ప్రకటించారని, వాటిని హేళన చేసిన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు కాపీ కొట్టడం సిగ్గుచేటని నరసాపురం పార్లమెంటరీ జిల్లా మహిళా కన్వీనర్ గూడూరి ఉమాబాల పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నాయని, నాలుగున్నరేళ్లుగా లేని పథకాలను ఇప్పుడు అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని విమర్శించారు. సమావేశంలో ఉండి నియోజకవర్గ సమన్వయ కర్త పీవీఎల్ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, నర్సాపురం పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్ర వర్మ, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కడలి రామనాగ గోవిందరాజు, గాదెరాజు సుబ్బరాజు, విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య పాల్గొన్నారు.
జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గుపడాలి
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీని ప్రజలు గెలిపించారని, అయినా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారని, దీనికి వారు సిగ్గుపడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషెన్ రాజు విమర్శించారు. ఆచంట నియోజకవర్గ కన్వీనర్ శ్రీరంగనాథరాజు సొంత ఖర్చులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నవరత్నాలు కాపీ కొడుతూ బాబు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మోషెన్ రాజు ఎద్దేవా చేశారు.


