భగభగ మండే ఎండ. ఆపై రోహిణీకార్తె ప్రభావం. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం భయపడిపోయే పరిస్థితి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :భగభగ మండే ఎండ. ఆపై రోహిణీకార్తె ప్రభావం. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం భయపడిపోయే పరిస్థితి. కానీ.. మంగళవారం మిట్టమధ్యాహ్నం వేళ ఏలూరులో కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాకు జనం పోటెత్తారు. మండేఎండను సైతం లెక్కచేయక వేలాదిగా తరలివచ్చి ప్రజావ్యతిరేక చంద్రబాబు సర్కారుపై నిప్పులు కక్కారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఏకబిగిన సాగిన ధర్నాను చూసి బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా జిల్లా నలుమూలల నుంచి అంచనాలకు మించి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సర్కారు దగాకోరు హామీలతో మోసపోయిన తమకు ప్రచండ భానుడి చండ్ర నిప్పుల సెగ లెక్కేం కాదని నిరూపించారు. చంద్రబాబు రుణ వంచనపై రైతన్న తిరగబడగా, నారా వారి నయామోసంపై మహిళా లోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులుకదం తొక్కారు. అధికారం దన్నుతో టీడీపీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. వెరసి ఏడాది పాలనలో సర్కారు వైఫల్యాలను ఎండగడ్తూ చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది.
ఏకబిగిన సాగిన ధర్నా
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 10గంటల తర్వాత ధర్నా మొదలుపెట్టి మధ్యాహ్నం 12గంటల్లోపు ముగించాలని తొలుత భావించారు. ఆ ప్రకారమే కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రారంభించగా, మధ్యాహ్నం 3 గంటలవరకు ప్రజాందోళన ఏకబిగిన కొనసాగింది. కార్యక్రమం ప్రారంభానికి ముందే చుట్టుపక్కల ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురం నుంచి ఏలూరు తరలివచ్చిన వందలాది మంది ఫైర్ స్టేషన్ సెంటర్‌లో మహానేత వైఎస్ విగ్రహం నుంచి బయలుదేరి ధర్నాస్థలి వరకు జగన్నినాదాలు చేస్తూ నడుచుకుంటూ వచ్చారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.పార్థసారధి, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు సర్కారు తీరును ఎండగట్టినప్పుడు ప్రజలు పెద్దపెట్టున చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు.
నాయకులతోపాటు ధర్నాకు హాజరైన రైతులు, మహిళలు, యువకులతో కొత్తపల్లి మాట్లాడించగా, ఆయా వర్గాలవారు చంద్రబాబు నయవంచన వాగ్దానాలతో తాము ఎలా మోసపోయామో వివరించారు. అంచనాలకు మించి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలను చూసి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సర్కారుపై ప్రజాగ్రహం.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై నమ్మకం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలనూ వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందన్న నమ్మకం స్పష్టమవుతోందన్నారు. కొత్తపల్లి స్పందిస్తూ.. ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న అసంతృప్తికి ఈ ధర్నానే నిదర్శనమన్నారు.
ప్రజాపోరాటాలే ఊపిరిగా..
తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా కన్వీనర్లతో సమావేశమయ్యారు. ప్రజా పోరాటాలే ఊపిరిగా పార్టీని మరింతగా జనంలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.