బాబూ..లేఖ వెనక్కు తీసుకోండి | Ysr congress party open letter to tdp president chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబూ..లేఖ వెనక్కు తీసుకోండి

Aug 26 2013 1:45 AM | Updated on Sep 27 2018 5:56 PM

బాబూ..లేఖ వెనక్కు తీసుకోండి - Sakshi

బాబూ..లేఖ వెనక్కు తీసుకోండి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తే కోట్లాది మంది తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్ఘాటించింది.

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తే కోట్లాది మంది తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్ఘాటించింది. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడం పట్ల నమ్మకం లేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించింది. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకునే వరకు చోద్యం చూసి.. కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ రాజీనామా చేయకుండా ఊరుకుని, ఇప్పుడు ప్రజల్లోకి వస్తే వెంటాడి బుద్ధి చెప్పటం ఖాయమని తెలిపింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సంయుక్తంగా ఆదివారం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘‘గత 26 రోజులుగా సీమాంధ్ర అంతా విభజన అంశంపై అతలాకుతలమవుతున్నా ఇప్పటికీ మీ వైఖరిలో మార్పు రాలేదు. కోట్ల సంఖ్యలో ఉన్న ప్రజల గురించి మీరు ఆలోచన చేయటం లేదు.
 
 ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసే ఆలోచనతోనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు బ్లాంక్‌చెక్‌లా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కు తీసుకోవడమో, మీకు మీరుగా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమో, మీ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించడమో వంటి ఆలోచనలు చేయకుండా సమస్యను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. జగన్ ఫోన్, జగన్ జైలు, సీబీఐ కేసులు... అంటూ రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి మీ పార్టీ తరఫున మాట్లాడుతున్న మాటల్ని, మీరు చేస్తున్న మోసపూరితమైన చేష్టల్ని చూస్తున్న ఎవరికైనా మీలాంటి చిత్తశుద్ధి లేని నాయకులు ఉండబట్టే మన రాష్ట్రానికి ఈ గతి పట్టిందని అనిపిస్తుంది’’ అంటూ వారు దుయ్యబట్టారు. లేఖ పూర్తి పాఠం ఇదీ..
 
 సమస్యలు కనిపించడం లేదా..?
 ‘‘చంద్రబాబూ.. మీ కళ్ల ఎదుటే రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే.. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాతగానీ, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కృష్ణా నీరు కిందకు వదలని పరిస్థితి ఉంది. ఇలాంటి వాతావరణంలో, మధ్యలో ఇంకో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయి? ఆ తర్వాత నాగార్జునసాగర్‌కు ఎలా వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రం నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడున్నాయి? కృష్ణా ఆయకట్టులో రైతులు రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? పోలవరానికి జాతీయ హోదా అంటున్నారు. కానీ రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్లు ఎక్కడ్నుంచి ఇస్తారు? 60 ఏళ్లుగా కలిసి కట్టుకున్న హైదరాబాద్‌ను వదిలి వేరే రాజధాని నిర్మించుకుని వెళ్లిపొమ్మంటున్నారు.
 
 రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం నిధులు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తున్న పరిస్థితుల్లో ఈ నిధులే రాకపోతే ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వగలరు? వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అనేక ఇతర సామాజిక వర్గాలకు సంక్షేమ పింఛన్లు ఎలా ఇవ్వగలరు? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయి? ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలకు నిధులు ఎలా వస్తాయి? ఈ హైదరాబాద్ అందరి రాజధాని కాకపోతే చదువుకున్న ప్రతీ పిల్లవాడు ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి? హైదరాబాద్‌లోని సీమాంధ్రులు, ఇప్పటికే ఇక్కడ స్థిరపడిన ప్రజల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? ఇవన్నీ అన్యాయంగా కనిపిస్తూ ఉన్నా ఓట్లు, సీట్లు, క్రెడిట్ దక్కవేమోనని ఆరాటపడుతున్న మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి?
 
 కుమ్మక్కు అయ్యిందెవరు?
 మీరు మా పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఎవరితోనో కుమ్మక్కు అయ్యాం అంటున్నారు. చంద్రబాబూ.. గత నాలుగేళ్లలో మీరు-కాంగ్రెస్ పార్టీ, పాలు-నీళ్లలా ఎలా కలిసిపోయారో అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఓట్ల కోసం, సీట్లు, క్రెడిట్ కోసం కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా.. ఇప్పటికీ స్పందించని మీ వైఖరే మీరు కాంగ్రెస్‌తో ఎంతగా కుమ్మక్కయ్యారో మరో నిదర్శనం. మీరు ఇప్పటికైనా రాజీనామా చేయండి. మీ ఎమ్మెల్యేలతో, మీ ఎంపీలతో రాజీనామాలు చేయించండి. మీరు బ్లాంక్ చెక్‌లా ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన లెటర్‌ను వెనక్కు తీసుకోండి. మొన్న మేం ప్రధానమంత్రికి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాం. అందరికీ న్యాయం చేయలేకపోతే విభజించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవటం తప్పని తెలియజేశాం. బాబూ.. మీరలాంటి లేఖ ఎందుకు రాయడం లేదు? అడ్డగోలు విభజనతో వచ్చే సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని ఎందుకు భావించటంలేదు?
 
 ప్రధానికి లేఖ రాయండి..
 ‘‘రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు .. వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం ఈ మూడు కూడా ఒకే మాట చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విభజించటాన్ని వ్యతిరేకిస్తున్నాయి. యథాతథంగా కలిపే ఉంచండని అంటున్నాయి. నిజానికి ఈ రాష్ట్రంలో ఐదు పార్టీలు- కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలు రాష్ట్రాన్ని విభజించటానికి ఒప్పుకున్నాయి. ఓట్లు, సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తుంటే.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, తనకు రావాల్సిన క్రెడిట్ కూడా రాకుండా పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరుగుతున్న అన్యాయంపై స్పందించకుండా ఉంటే... ఇక ఈ రాష్ట్రంలో కోట్ల ప్రజల గోడు ఎవరికి చెప్పుకోవాలి?’’ అంటూ ఆగస్టు 14న మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. చంద్రబాబూ.. మీకు సీమాంధ్రలోని కోట్ల ప్రజానీకం మీద ఏ కొంచెం ప్రేమ ఉన్నా, మీరు కూడా ప్రధానికి మా తరహాలో లేఖ రాయండి. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేలా ఉత్తరం అయినా ఇవ్వండి. లేదా విభజనకు బ్లాంక్ చెక్‌గా మీరు ఇచ్చిన లేఖ అయినా వెనక్కు తీసుకోండి. ఇప్పటికైనా మీరు లేఖను వెనక్కు తీసుకుని మీ ఎమ్మెల్యేలందరి చేత, ఎంపీలందరి చేత రాజీనామా చేయించి మీరూ రాజీనామా చేస్తే విభజన ఆగుతుంది.
 
 మా నాయకుడిని చూసి గర్విస్తున్నాం
 మా నాయకుడిని చూసి మేం గర్వపడుతున్నాం. కష్టాల్లో ఉన్నా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ తొణకకుండా, బెణకకుండా, బెదరకుండా.. తాను అక్రమ కేసులను ఎదుర్కొంటూ 15 నెలలుగా జైల్లో ఉన్నా, అనుక్షణం స్ఫూర్తినిస్తూ ప్రజల కోసమే ఆలోచిస్తూ, ఇప్పుడు జైల్లోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి మా నాయకుడు అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. చంద్రబాబూ... మీరు ఇప్పటికైనా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తే కోట్ల మంది తెలుగువారికి అన్యాయాన్ని ఆపగలం. మీకు అలాంటి రాజకీయాలు చేయటం మీద నమ్మకం లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. భావి తరాలు మిమ్మల్ని క్షమించవు. విభజన చేసే వరకు చోద్యం చూసి, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాల ద్వారా రాజీనామా చేయకుండా ఊరుకుని, ఆ తర్వాత మీరు ప్రజల్లోకి వస్తే వారు మిమ్మల్ని వెంటాడి బుద్ధి చెప్పటం ఖాయం’’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement