
సాక్షి, వైఎస్సార్ కడప : మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయతలు, అనుబంధాలకు సంక్రాంతి పండగ ప్రతీక అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళల సంక్రాంతి పేరు చెబితే అందరికీ గుర్తుకొస్తాయని తన ప్రకటనలో జగన్ తెలిపారు. అన్నపూర్ణగా పేరు గాంచిన తెలుగు నేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారు సుఖ సంతోషాలతో తులతూగాలని తాను కోరుకుంటున్నట్లు తన శుభాకాంక్షల సందేశంలో జగన్ పేర్కొన్నారు.