ప్రజాస్వామ్యమా..గూండాస్వామ్యమా? | ys jagan mohan reddy fire on zp elections counting | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యమా..గూండాస్వామ్యమా?

Jul 6 2014 4:23 AM | Updated on Jul 28 2018 6:33 PM

ప్రజాస్వామ్యమా..గూండాస్వామ్యమా? - Sakshi

ప్రజాస్వామ్యమా..గూండాస్వామ్యమా?

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీ ఎన్నికల నిర్వహణ తీరు చూస్తూంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక గుండాస్వామ్యమా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ‘స్థానిక’ అక్రమాలపై మండిపడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
* ఈరోజు ప్రజాస్వామ్యానికే బ్లాక్ డే
* చంద్రబాబూ.. ఎన్నికల తీరుపై మీరు గర్వపడుతున్నారా?.. ప్రజాస్వామికవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు
* సోమవారం గవర్నర్‌ను కలసి టీడీపీ ఘోరాలపై విచార ణ జరపాలని కోరతాం

 
సాక్షి, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీ ఎన్నికల నిర్వహణ తీరు చూస్తూంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక గుండాస్వామ్యమా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఎన్నికలను నిర్వహించిన తీరు చూసి గర్వపడుతున్నారా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజానీకమే కాకుండా దేశంలోని మొత్తం ప్రజాస్వామికవాదులంతా ఈ ఎన్నికలు జరిగిన తీరును చూసి సిగ్గుతో తల దించుకుంటున్నారని చెప్పారు. మున్సిపల్, మండల పరిషత్‌లతో పాటు జెడ్పీ అధ్యక్ష ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడటంపై జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
‘‘మునిసిపల్ చైర్మన్లు, ఎంపీపీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు పరాకాష్టగానే శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరిగాయి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో మా పార్టీకి స్పష్టమైన మెజారిటీ కనిపిస్తున్నా.. ఈ ఎన్నికలను గందరగోళ పరచడానికి టీడీపీ అధ్యక్షుడు మొత్తంగా అన్ని వ్యవస్థలను ఎలా దుర్మార్గంగా ఉపయోగించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సభ్యులందరినీ ప్రలోభపెట్టో, బెదిరించో లొంగదీసుకునేందుకు టీడీపీ గత నెలా 15 రోజులుగా అన్ని ప్రయత్నాలూ చేసింది. అదీ చాలదన్నట్లు ఇప్పుడు ఎన్నిక జరుగుతుండగా నేరుగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మా పార్టీకి నాలుగు జెడ్పీల్లో సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ, కడప మినహా మిగతా మూడు చోట్ల భయభ్రాంతులు సృష్టించి, అధికార దుర్వినియోగంతో చంద్రబాబు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు’’ అని జగన్ అన్నారు.
 
‘‘ఇనుప కంచెలు వేసి, వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తు మీద ఎన్నికైన అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి చేతులు, చొక్కాలు పట్టుకుని టీడీపీ వారు లాక్కుపోతున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలంతా టీవీల ద్వారా గమనించి నెవ్వెరపోయారు. వెంకటగిరి ఎమ్మెల్యే నెల్లూరులో వేదిక ఎక్కి వీరంగం చేశారన్నా, ఈ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని కరణం బలరాం వంటి నాయకులు ఒంగోలులో మందీమార్బలంతో నేరుగా ఎన్నికల శిబిరం మీద దాడి చేశారన్నా.. ఇలాంటి దుర్మార్గాలకు బాబు ఎంతగా అండదండలు అందిస్తున్నారో అర్థమవుతోంది’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి పోలీసులే రంగంలోకి దిగి, కలెక్టర్ల సాక్షిగా జెడ్పీ అధ్యక్ష పదవులకు, ఎంపీపీలకు జరిగిన ఎన్నికల్లో అధికారికంగా రిగ్గింగులో సహకరిస్తున్నారంటే ఇంతకు మించిన దారుణం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం కళ్లప్పగించి చూడటమో, లేక ఈ ప్రజాస్వామ్య హననంలో సహకరించటమో చేశారని  అన్నారు.
 
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చే సత్తా లేదని అర్థమైన మీదట ఎంపీటీసీలకు కూడా నేరుగా ఫోన్ చేసి ప్రలోభపెట్టో, బెదిరించో పబ్బం గడుపుకునే స్థాయికి చంద్రబాబునాయుడు దిగజారారన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటంలో ఉన్న అనుభవం ప్రజల మనసులను గెల్చుకోవడంలో లేదని, వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో ఉన్న అనుభవం చట్టాలను పాటించటంలో లేదని చెప్పారు. ఈరోజు ప్రజాస్వామ్యానికే బ్లాక్‌డే అని చెప్పారు. తాము సోమవారం గవర్నర్‌ను కలసి, చంద్రబాబు, టీడీపీ ఘోరాల మీద విచారణ జరిపి చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement