‘‘ఉన్నది ఒకటే జిందగీ బాస్‌’’ 

Youth Says Achieving Happiness By Helping Others - Sakshi

పనిలోనే ఆనందం వెతుక్కుంటున్న యువత

ఎదుటి వారికి సాయం చెయ్యడంలోనూ సంతృప్తే 

జాయ్‌.. ఎంజాయ్‌ అంటున్న యూత్‌

పసిపాప బోసి నవ్వు తల్లికి ఆనందం.. అమ్మాయి ఓర చూపు అబ్బాయికి ఆనందం... ఉద్యోగం దొరికితే నిరుద్యోగికి ఆనందం... పదవొస్తే రాజకీయ నాయకుడికి పట్టలేని ఆనందం.. ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్కరికీ ఆనందాన్ని పంచుతుంది. అయితే ప్రస్తుత యువత ఇంకాస్తా ముందడుగు వేసి.. ఇదిగో ఇలా ఎంజాయ్‌ చెయ్యడంలోనే అసలైన ఆనందం ఉందనీ.. ఎందుకంటే  ‘‘ఉన్నది ఒకటే జిందగీ బాస్‌’’ అంటున్నారు.

విశాఖ సిటీ:  ఉరకలేసే ఉత్సాహం, కాలంతో పరిగెత్తే వేగాన్ని అందిపుచ్చుకున్న నేటి యువతరం ఆనందమనేది మనం సంపాదించుకునేది. అది ఏ రూపంలోనైనా పొందవచ్చని చెబుతున్నారు. జీవితమంటే ఓ సాహసయాత్రలాంటిది. కష్టాలు ఎదురవుతుంటాయి. వాటిని సంతోషంగా స్వీకరిస్తేనే ఆనందయాత్ర ముందుకు సాగుతుందనే వేదాంతం మాట్లాడేస్తున్నారు. వారి మాటల్లో నిజమే ఉంది. చిన్న కష్టం వస్తే అసంతృప్తి బాట పడుతూ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు కొంతమంది. ఈ తరహా వైఖరిని వీడనాడాలని యువత సూచిస్తోంది.

ఆనందపు వసంతం రావాలంటే.? 
అసంతృప్తే అన్ని అనర్థాలకు మూలం. సంతృప్తి అనేది లేకపోతే బతుకు దుర్భరమవుతుందని అన్నారు గోరాశాస్త్రి. కొంతమంది జీవితం సాఫీగా సాగిపోతున్నా.. సంతృప్తి చెందకుండా ఏదో మూలన బాధపడుతూ కాలం గడుపుతుంటారు. నగర జీవనంలో 35 ఏళ్లు పైబడిన వారిలో ఈ తరహా అసంతృప్తి ఇటీవల ఎక్కువైపోతోంది. ఈ విధానం నుంచి దూరమైపోతూ తమ సొంత ఆలోచనలతోనే ఆనందపుటంచుల్ని తాకుతోంది నేటి యువతరం. అసలు సంతోషం, ఆనందం అనేది 50 శాతం జన్యుపరంగానూ 40 శాతం మనిషి అంతర్గత ఆలోచనలు, 10 శాతం జీవన పరిస్థితుల పరంగా ఆధారపడి ఉంటుంది. 

సేవలోనే సంతృప్తి..
తాము ఆనందంగా ఉండటమే కాదు.. ఎదుటి వారి కళ్లల్లో ఆనందం చూస్తేనే తమకు నిజమైన సంతృప్తి అని అంటున్నారు కొందరు యువతీ యువకులు. అందుకే.. అభాగ్యులకు ఆసరాగా నిలుస్తూ వారి జీవితాల్లో నింపుతున్న వెలుగుల్లోనే ఆనందం వెతుక్కుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుస్తకాలు కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతూ నిస్సహాయ స్థితిలో విద్యకు మధ్యలోనే దూరమైపోతున్న వారికి చేయూతనిస్తున్నారు. 

వైజాగ్‌ స్మైల్స్, వేదిక్‌ సైన్స్‌ క్లబ్, కెన్‌ ఫౌండేషన్‌.. మొదలైన సంస్థలు స్థాపించి ఉచితంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక విద్యార్థిగా.. తోటి విద్యార్థికి సహాయం చేస్తే.. అందులో దొరికే ఆనందం చెప్పలేనిదనీ.. వీరంతా గర్వంగా చెబుతున్నారు. నగరంలో చైల్డ్‌ బెగ్గింగ్‌ని నిర్మూలించేందుకు జనరేషన్‌ యువ పేరుతో సంస్థను స్థాపించి కొంతమంది యువకులు ఆనందం వెతుక్కుంటున్నారు. యాచకవృత్తిలో ఉన్న బాలబాలికలకు ఉత్తమ జీవితాన్నందిస్తూ వారికీ ఆనందం పంచిపెడుతున్నారు. 

స్ట్రీట్‌ స్వచ్ఛంద సంస్థ పేరుతో 200 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు వృథా ఆహారాన్ని సేకరిస్తూ నగరంలోని  రోడ్లపై, ఫుట్‌ పాత్‌లపై ఎవరూ లేని అనాథల్లా.. ఆకలితో అలమటిస్తున్న వారికి అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. కడుపు నిండిన తర్వాత వారి ఆశీర్వాదంలోనే ఆనందం వెతుక్కుంటున్నారు. ఇలా.. ఆనందం కోసం యువతరం ఒక్కోదారిలో అన్వేషణ సాగిస్తున్నారు. 

ఆనందాన్ని ఎవరు కోరుకోరు..? 
ఆనందంగా ఉండాలని అనుకుంటే పనిలో మునిగిపోండంటున్నాయి కొన్ని అధ్యయన సంస్థలు. ఖాళీగా కూర్చొని పగటి కలలు కనేవారితో పోలిస్తే చేతినిండా పని ఉన్న వారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఆనందంగా ఉండడంపై యువత అభిప్రాయమేంటని తరచి చూస్తే.. ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. నగరంలో కొంతమంది యువతీ యువకుల్ని వారి ఆనందం విషయంపై మాట్లాడమంటే గలగలా కబుర్లు చెప్పేస్తున్నారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ.. ఎంత ఎక్కువ ఆనందం ఎందులో లభిస్తుందో.. దానివైపే మేము మొగ్గు చూపుతామంటూ ‘‘ఆనందం’’కొద్దీ చెప్పేస్తున్నారు.

రోజులో ఎన్ని గంటలు ఆనందంగా ఉంటారు.?

  • రోజంతా ఆనందంగా ఉంటాం
  • టీవీలో కార్యక్రమాలు చూస్తున్న సమయంలో
  • అప్పుడప్పుడూ ఆనందంగా ఉన్నామనిపిస్తుంది

ఆనందాన్ని ఎందులో వెతుక్కుంటారు.?

  • ఎదుటివారికి సహాయం చెయ్యడంలో
  • చేస్తున్న ఉద్యోగంలో
  • ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చెయ్యడంలో
  • సినిమాలు, టీవీషోలు చూడటంలో 

ఎవరితో ఉంటే ఆనందంగా ఉంటారు.?
 

  • కుటుంబంతో ఉన్నప్పుడు
  • ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు
  • బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు

ఆనందమంటే..?

  • ఉద్యోగం దొరకడం
  • సొంతూరిలో ఉపాధి దొరకడం
  • మంచి మనసున్న తోడు దొరకడం    
  • ఎదుటి వారికి సాయం చెయ్యడం

ఆనందం కోసం ఎక్కడ అన్వేషిస్తున్నారని కొంతమంది యువతను అడిగితే.. వారు చెప్పిన మాటలివీ...

అభాగ్యుల ఆకలి తీర్చినప్పుడు ఆనందం
విశాఖ వీధుల్లో దయనీయంగా కనిపిస్తున్న వారు అభాగ్యులు కాదు. వారికి స్ట్రీట్‌ ఫ్రెండ్స్‌ తోడుగా ఉన్నారు. వారి ఆకలిని తీర్చినప్పుడే అసలైన ఆనందం దొరుకుతుంటుంది.
                 –గాయత్రి రాచర్ల, స్ట్రీట్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు

ఫ్రెండ్స్‌ పలకరింపుతో ఖుషీ
ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాం. ఆ సమయంలో మేమున్నామంటూ అమ్మ ప్రేమను అందించే ఫ్రెండ్స్‌ పలకరింపులోనే ఆనందం దొరుకుతోంది.
      –మోనిక, ఏయూ ఎంటెక్‌ విద్యార్థి, ఒంగోలు

పని చేస్తుంటేనే సంతోషం

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బ్యాకెండ్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. పని చేస్తున్నప్పుడు పై అధికారులనుంచి ప్రశంసలు పొందినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది.
   –యామిని, సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌

అమ్మ నాన్నలతో ఉంటేనే..
మాది శ్రీకాకుళం జిల్లా. ఉద్యోగం కోసం విశాఖ వచ్చేశాను. ఫ్రెండ్స్‌ చుట్టూ ఉన్నా.. అమ్మా నాన్నతో గడిపిన క్షణాలే ఎంతో ఆనందాన్నిస్తాయి.
   – బి. ఆదిత్య, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

చదువులోనే..
చిన్నప్పటి నుంచి చదువుకోవడమంటే ఇష్టం.  ఉత్తమ ప్రతిభ కనబరిచినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. 
   –వి. భార్గవి, బిట్స్‌ పిలానీ విద్యార్థిని, మద్దిలపాలెం

ఫ్రెండ్స్‌తో గడుపుతుంటే ఆనందం 
చదువు, ఉద్యోగంతో జీవితం బిజీ బిజీగా గడిచిపోతుంటుంది. ఖాళీ సమయంలో ఫ్రెండ్స్‌తో గడుపుతున్నప్పుడు లెక్కకు మించిన ఆనందం నా సొంతమవుతుంది.
   – స్రవంతి, పీహెచ్‌పీ డెవలపర్, సీతంపేట 

ఆనందానికి ఐరాస ఆరు కొలమానాలు..

1. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు
2. తలసరి ఆదాయం
3. స్వేచ్ఛ
4. దాతృత్వం
5. సామాజిక భద్రత
6. అవినీతి రహితంగా జీవించడం.

చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చిరునవ్వులొలికిస్తూ ఆనందంగా గడిపేస్తుంటారు చాలా మంది. సంపద ఎంత ఉన్నా ఆనంద లేమితో జీవిస్తుంటారు మరికొంతమంది. ఏమిటీ వ్యత్యాసం? అంటే.. సంపదే సమస్తం కాదు. అది ఉంటే సౌకర్యాలతో సుఖంగా ఉండొచ్చేమో కానీ.. ఆనందంగా ఉండలేమంటున్నారు నగర యువత. ఆనందమనేది హృదయానికి సంబం«ధించినది. అది అంతర్గతమైన అనుభూతి. సామాజిక పునాదులు బలంగా ఉంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారని ఐరాస చెబుతోంది. అందుకే.. ఐక్యరాజ్యసమితి ఆనందానికి ఆరు కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకుంటోంది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top