ప్రజాస్వామ్యానికి మరణశాసనం రాశారు | Wrote democracy maranasasanam | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి మరణశాసనం రాశారు

Mar 20 2015 3:21 AM | Updated on Aug 18 2018 8:54 PM

ప్రజల పక్షాన ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న విపక్ష సభ్యులను శాసనసభ నుంచి సస్పెండ్ చేసి సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రజాస్వామ్యానికి మరణ శాసనం రాశారని వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు ఆరోపించారు.

  • స్పీకర్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆరోపణ
  • ఏకపక్షంగా వ్యవహరిస్తూ విపక్షం గొంతునొక్కుతున్నారు
  • టీడీపీ వ్యక్తిగా వ్యవహరించడం సిగ్గుచేటు
  • చంద్రబాబు చేతిలో స్పీకర్ కీలుబొమ్మ..
  • స్పీకర్ వైఖరికి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తామని వెల్లడి

  • సాక్షి,హైదరాబాద్: ప్రజల పక్షాన ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న విపక్ష సభ్యులను శాసనసభ నుంచి సస్పెండ్ చేసి సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రజాస్వామ్యానికి మరణ శాసనం రాశారని వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలు వై.ఐజయ్య, దేశాయ్ తిప్పారెడ్డి, వంతుల రాజేశ్వరి, నారాయణస్వామి, రాజన్నదొర, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, ఆర్‌కే రోజా, జి.శ్రీనివాస్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, వి.కళావతి, పుష్పశ్రీవాణి, కె.జోగులు, చింతల రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీవీఎస్ రాజు గురువారం మీడియాపాయింట్‌లో మాట్లాడారు.

    చంద్రబాబు, బోండా ఉమాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పడు సభాపతి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. ‘మీ కథ తేలుస్తా.. మీ అంతు తేలుస్తా.. పిచ్చిపిచ్చి కథలు చేస్తున్నారంటూ’ వేలు చూపుతూ బెదిరించిన చంద్రబాబు, ‘పాతేస్తా.. ఏంట్రా.. ఆరేయ్.. ’అంటూ రౌడీయిజం చేసిన బోండా ఉమా, అసెంబ్లీ నియమాలకు విరుద్ధంగా టేప్ దృశ్యాలను బయటకి విడుదల చేసిన చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులును కూడా సస్పెండ్ చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. గూండాలు, రౌడీలు పరిపాలన చేస్తే ఏరకంగా ఉంటుందో ఇవాల్టి సభ అద్దం పట్టిందని సర్వేశ్వరరావు అన్నారు.

    పాలకపక్షం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నందుకు గిరిజన ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నానని రాజన్నదొర అన్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని రాజేశ్వరి విమర్శించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడిగితే వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని నారాయణస్వామి అన్నారు. నిష్పక్షపాతంగా, హుందాగా ఉండాల్సిన స్పీకర్ టీడీపీ వ్యక్తిగా వ్యవహరించడం సిగ్గుచేటని చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు.

    ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా దూషించడం.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై నిందలు వేయడం దారుణమని కళావతి, పుష్ప శ్రీవాణిలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు స్పీకర్‌ను ఫ్యాక్షనిస్టు, పక్షపాతి అంటూ టీడీపీవారు విమర్శలు చేయలేదా? అని శివప్రసాద్‌రెడ్డి, తిప్పారెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ వైఖరికి నిరసనగా 67 మంది ఎమ్మెల్యేలు కలసి శాంతియుత ఆందోళనకు దిగుతామని చెప్పారు.

    ప్రజాస్వామ్యపద్ధతిలోనే సస్పెన్షన్: టీడీపీ సభ్యులు

    వైఎస్సార్‌సీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను నిష్పక్షపాతంగా.. ప్రజాస్వామ్యపద్ధతిలో సభాపతి కోడెల శివప్రసాదరావు సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర సభ్యులు పేర్కొన్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి, జయనాగేశ్వరరెడ్డిలతో కలసి గద్దె మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు స్పీకర్ డౌన్ డౌన్.. స్పీకర్ జోకర్ అంటూ నినాదాలు చేస్తూ పోడియాన్ని గుద్దడం దురదృష్టకరమని, ఈ వైఖరిని తీవ్రంంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇందుకు మనస్తాపం చెందిన స్పీకర్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతూ స్పీకర్ వైపు దూసుకుపోవడం దుర్మార్గమని విప్ యామినిబాల అన్నారు. పాలకపక్ష సభ్యులు ఏం మాట్లాడబోయినా తగుదునమ్మా అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా కల్పించుకుంటున్నారని విమర్శించారు.
     
    స్పీకర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: చెవిరెడ్డి

    ప్రతిపక్షానికి నీతులు చెబుతున్న స్పీకర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘‘నిన్నటి సంఘటనకు అంతా చింతిస్తున్నాం.. సభలో హుందాగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం.. కానీ పాలకపక్షం తరఫున స్పీకర్ జోక్యం చేసుకోవడం సబబా..’’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఒకవైపు అర్థవంతమైన చర్చ జరగాలంటూనే.. ‘మీకు మైక్ కట్ చేస్తుంటాం.. నిరసనగా వెల్‌లోకి వస్తే.. పాలకపక్షానికి మైక్ ఇచ్చి తిట్టిపిస్తాం’ అన్న ధోరణిలో స్పీకర్ వ్యవహరించడం బాధాకరమన్నారు. గతంలో ఎన్టీఆర్‌కు మైక్ ఇవ్వని ఘనత యనమల రామకృష్ణుడుకు ఉందని, ‘ఎన్టీఆర్‌ని చంపిన పాపాత్ముడు చంద్రబాబు’ అని గతంలో బహిరంగంగా ప్రకటించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇప్పుడు ఆయన పక్కనే చేరి నీతులు చెపుతున్నారంటూ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విమర్శించారు. విపక్ష నేత జగన్‌పై సభలో వ్యక్తిగత దూషణలు చేసిన మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరిలనూ సస్పెండ్ చేయాలని ఈశ్వరి డిమాండ్‌చేశారు.
     
    సస్పెన్షన్ సీఎం కుట్ర..

    సీఎం చంద్రబాబు కుట్ర వల్లే తమపై సస్పెన్షన్ వేటు పడిందని సస్పెండైన ఎమ్మెల్యేలు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చాంద్‌భాషా తదితరులు ఆరోపించారు. ‘స్పీకర్  సమర్థుడైతే సభను ఆర్డర్‌లో పెట్టి అందరికీ మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్నప్పడు మైక్ కట్ చేయడంతో మైక్ ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు మేం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లాం. అయినా మైక్ ఇవ్వకపోవడంతో స్పీకర్ డౌన్‌డౌన్ అని అన్నాం. చంద్రబాబు చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారడం వల్లే ప్రతిపక్షనేతకు మైక్ ఇవ్వడంలేదు. అందుకే నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఉడత ఊపులకు భయపడేవాళ్లు ఇక్కడెవరూ లేరు’’ అని కొడాలి నాని అన్నారు. ‘‘నీ పార్టీలో ఉన్నప్పుడే నీ మాట వినలా.. ఇప్పుడెందుకు భయపడతా..’ అని చంద్రబాబునుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈలోగా మీడియాపాయింట్ వద్దకు వచ్చిన మార్షల్స్ వచ్చి సస్పెండైన ఎమ్మెల్యేలను బలవంతంగా ఎత్తువెళ్లిపోయారు. మార్షల్ ఓవరాక్షన్ చేసి సస్పెండ్ అయిన సభ్యులతోపాటు సస్పెండ్ కాని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జి.శ్రీనివాసరెడ్డిలనూ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులు అడ్డుపడి వారు సస్పెండ్ కాలేదని చెప్పడంతో మార్షల్స్ వెనక్కుమళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement