సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా పన్నెండు గంటల వ్యవధిలోనే ఇద్దరు యువ నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా పన్నెండు గంటల వ్యవధిలోనే ఇద్దరు యువ నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నిత్యం పనిచేసే సాంచాల నడుమ నూలుపోగులనే ఊరితాళ్లుగా చేసుకొని ఊపిరివిడిచారు. ప్రపంచ చేనేత దినోత్సవమైన బుధవారం రాత్రి వెంగల చక్రధర్(30) ఆత్మహత్య చేసుకోగా, గురువారం తెల్లవారుజామున నెహ్రూనగర్‌కు చెందిన గుండేటి రంజిత్‌కుమార్(23) అనే యువ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలతో సిరిసిల్ల నేతన్నల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
సంక్షోభంపై స్పందిచని సర్కారు
సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉండగా, సుమారు 25 వేల మంది కార్మికులు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పతనం కావడంతో వస్త్రోత్పత్తికి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగగాయి. వస్త్రం ధర మాత్రం నిలకడగా ఉండడంతో వస్త్రవ్యాపారం గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు వస్త్రోత్పత్తిదారులకు ముడిసరకులు ఇవ్వడం లేదు. దీంతో సిరిసిల్లలోని సుమారు 14వేల మరమగ్గాలపై గత పదిరోజులుగా వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. వీటిపై ఆధారపడిన దాదాపు పదివేల మంది వస్త్రోత్పత్తిదారులు (ఆసాములు), కార్మికులకు ఉపాధి కరువైంది.
ప్రతి రోజు రాత్రి పగలు సాంచాలు నడిచినా శ్రమకు తగ్గ ఫలితం లేక ఆసాములు, కార్మికులు కుటుంబ పోషణ కోసం అప్పులు చేసేవారు. ప్రస్తుతం పది రోజులుగా వస్త్రోత్పత్తి నిలిచిపోవడం వల్ల వీరి చేతిలో చిల్లిగవ్వకుండా లేకుండా పోయింది. నిత్యం పూటగడిచేందుకే ఇబ్బందులు పడుతున్న తరుణంలో గతంలో చేసిన అప్పులు నేతన్నలకు గుడిబండగా మారాయి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన కార్మికులు బలవన్మరణాల బలిపీఠమెక్కుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు ఏడు నెలల వ్యవధిలో సుమారు 14 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
‘అంతిమ’ సాయమూ అందని ద్రాక్షే..
సిరిసిల్లలో నేత కార్మికుల వరుస ఆత్మహత్యలపై అధికారులు కేవలం వివరాల సేకరణకే పరిమితమయ్యారు. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయంగా ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకంలో రూ.5వేలను రెవెన్యూ అధికారులు అందించేవారు
. కార్మికుల అంతిమ సం స్కారాలకు సొమ్ము ఉపయోగపడేది. ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌బీఎస్ సాయం అందించే బాధ్యతను మున్సిపల్ అధికారులకు అప్పటించారు. దీంతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతేనే ఆ మాత్రం సాయాన్ని కూడా నిదానంగా అందిస్తామంటున్నారు. సిరిసిల్లలో వరుస ఆత్మహత్యలపై అధికారులు ఇప్పటికైనా స్పందించి వస్త్రపరిశ్రమ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.