అడ్డగోలు దత్తత..!

Women And Child Welfare Negligence on Adoptions in Krishna - Sakshi

అధికారులే సూత్రదారులు  

జోరుగా పిల్లల దత్తత రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిబంధనలు తూచ్‌

చోద్యం చూస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు

చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఫిర్యాదుతో వెలుగులోకి

మచిలీపట్నం: జిల్లాలోని కలిదిండి మండల కేంద్రంలో నిర్వహించిన దత్తత వ్యవహారం రిజిస్ట్రార్‌ శాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల వైఫల్యాన్ని ఎత్తు చూపుతోంది. పిల్లలను పెంచుకోవాలనే ఆసక్తితో ‘దత్తత’ తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి తగిన అవగాహన కల్పించటంలో ఐసీడీఎస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన నిబంధనలు పాటించకుండా దత్తతకు ప్రోత్సహిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలకు తూట్లుపడుతున్నాయి. ఫిర్యాదుల నేపథ్యంలో బాలల సంక్షేమ జిల్లా కమిటీ చైర్మన్‌ బీవీఎస్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పోలీసు, స్థానిక ఐసీడీఎస్‌ అధికారులు సమక్షంలో దత్తత విషయమై విచారణ చేపట్టారు.

అసలేం జరిగిందంటే..
కలిదిండి మండల కేంద్రానికి చెందిన భోగేశ్వరరావు దంపతులు, ఇదే మండలంలోని కొండంగి గ్రామం నుంచి శిశువును దత్తత తీసుకున్నారు. అదే విధంగా కలిదిండికి చెందిన సాంబశివరావు దపంతులు ఒంగోలుకు చెందిన ఓ శిశువును దత్తత తీసుకున్నారు. దత్తతకు సంబంధించి జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపరుపై ఇరువురు అంగీకార పత్రాలను రాయించుకొని, వాటిని స్థానిక రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. అయితే దత్తత స్వీకారంలో సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ ఏజెన్సీ(కారా) నిబంధనలు పాటించలేదు. కానీరిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీటికి చట్టబద్ధతకల్పించటం గమనార్హం. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ తప్పుపడుతోంది. పిల్లల దత్తత విషయంలో కఠినమైన చట్టాలు, పట్టిష్టమైన యంత్రాంగం ఉన్నప్పటకీ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. 

అధికారుల పాత్రపై అనుమానాలు..  
పిల్లలపై ఆసక్తి ఉన్నందున దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన వారిని ఏమాత్రం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ వారిని చైతన్యపరిచి, పద్ధతి ప్రకారం దత్తత తీసుకునేలా చూడాల్సిన స్త్రీ శిశు సంక్షేమశాఖలోని సమగ్ర బాలల పరిరక్షణ విభాగపు (ఐసీపీఎస్‌) అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వలనే సమస్య జఠిలమైంది. దత్తత తీసుకునే వారిని విజయవాడలోని ఐసీపీఎస్‌ విభాగపు అధికారుల వద్దకు పంపించామని స్థానిక ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ లక్ష్మి చెబుతున్నారు. కానీ ఆ తరువాత ఎందుకిలా నిబంధనలను పక్కన పెట్టి దత్తతకు చట్టబద్ధత కల్పించారనేది తేలాల్సి ఉంది. 

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
శిశు గృహాలు, లేదా ఇతరులు ఎవరివద్దనైనా పిల్లలను దత్తతు తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు రాష్ట్ర దత్తత రిసోర్స్‌ ఏజెన్సీ(సారా) నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దారుల వాస్తవికతను తెలుసుకునేందుకు సంబంధిత శాఖ వారు హోమ్‌ స్టడీ రిపోర్ట్‌(హెచ్‌ఆర్‌సీ), దత్తత తీసుకునే వారి ఆరోగ్యపరమైన అంశాలను ప్రస్తావిస్తూ నివేదిక ఇస్తారు. పిల్లలను దత్తత తీసుకున్న తరువాత వారి పోషణకు ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా, ఏదైనా సంక్రమిత వ్యాధులు ఉన్నాయా అనే దానిపై సమగ్ర పరిశీలన చేసిన మీదటనే నివేదిక ఇస్తారు. అన్ని రకాలుగా సంతృప్తి (లీగల్లీ ఫిట్‌ ఫర్‌ అడాప్షన్‌) చెందిన వారికే దత్తత తీసుకునేందుకు అనుమతులిస్తూ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ధ్రువీకరిస్తుంది. పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పెడతారు. పిల్లలు దత్తత తీసుకున్న తరువాత కూడా రెండు నెలల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాతనే పూర్తి స్థాయిలో దత్తత ప్రక్రియను ధ్రువీకరిస్తారు. పిల్లల విక్రయాలు, బాల కార్మికులుగా మారుస్తుండం, హెచ్‌ఐవీ వంటి వ్యాధులను విస్తరింపజేస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం దత్తత విషయంలో నిబంధనలు కఠిన తరం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top