పొత్తు లేకుంటే నష్టమేంటి?
కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే అధికారంలోకి వస్తామా లేక రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి నష్టమేమైనా జరుగుతుందా?
-
పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చలు
-
నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ పరిస్థితిపై సమీక్ష
-
సీఎం పదవి దక్కనప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు ఎందుకనే ప్రశ్న
-
సీపీఐ, ఎంఐఎం తదితర పార్టీలతో ఫ్రంట్‌పైనా యోచన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే అధికారంలోకి వస్తామా లేక రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి నష్టమేమైనా జరుగుతుందా? అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్యులను, జిల్లా స్థాయి నేతలను ఆరా తీస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, అభ్యర్థుల పరిస్థితి, బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటివాటిపై విస్తృతంగా చర్చిస్తున్నారు. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలవడానికి ఉన్న అవకాశాలు, అభ్యర్థులు ఎవరున్నారనే అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఒత్తిడి తెస్తోందని, ఒకవేళ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకోవడం కచ్చితంగా సాధ్యం కాదని కేసీఆర్ చెబుతున్నారు.
అటువంటప్పుడు పొత్తులతో పనేముందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరిన పక్షంలో చెరిసగం స్థానాల్లో పోటీచేయాల్సి వస్తుందని, సగం స్థానాల్లో అభ్యర్థులే లేనప్పుడు సొంతంగా అధికారంలోకి వచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటు స్థానాలను ఎక్కువగా తీసుకుని, టీఆర్‌ఎస్ అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా తీసుకునే పక్షంలో పొత్తును పరిశీలించవచ్చునని చెబుతున్నట్టు సమాచారం. అదే సమయంలో ‘తెలంగాణ ఇచ్చిన పార్టీగా సానుకూలత ఉంటుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీగా ముఖ్యమంత్రి పదవి వారికే కావాలని కాంగ్రెస్ అనుకోవడంలోనూ తప్పులేదు.
కానీ తెలంగాణ పునర్నిర్మాణంపై చిత్తశుద్ధి ఉన్న నాయకులు కాంగ్రెస్‌లో ఎవరున్నరు? తెలంగాణ తెచ్చిన పార్టీగా మనకు కూడా ఆదరణ, అభిమానం చాలా పెరిగింది. ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది చూద్దాం..’ అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీపీఐ, ఎంఐఎం, న్యూ డెమోక్రసీతో పాటు తెలంగాణ ఏర్పాటైన తర్వాత సమస్య ఏమీ ఉండకపోతే సీపీఎంతోనూ ఒక ఫ్రంట్‌గా ఏర్పాటయ్యే యోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం. అక స్మాత్తుగా వచ్చిన స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అంతర్గత సమీక్షకు బాగా ఉపయోగపడతాయని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. ఆ ఫలితాలను బట్టి సాధారణ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో నిర్ణరుుంచుకోవచ్చని అనుకుంటున్నారు.
బలహీన స్థానాలపై దృష్టి: తెలంగాణ 10 జిల్లాల్లో పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. అభ్యర్థి స్థానిక బలానికి ఆర్థిక పరిపుష్టి తోడెతైలంగాణ తెచ్చిన సానుకూలతతో గట్టెక్కగలిగే శాసనసభా స్థానాలపై దృష్టిని సారించారు. ఖమ్మం, హైదరాబాద్‌లపై టీఆర్‌ఎస్ దాదాపుగా ఆశలు వదులుకుంది. మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నా ఎక్కువ స్థానాల్లో చాలా బలహీనంగా ఉంది. వీటిపై దృష్టి కేంద్రీకరించారు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా బలమైన అభ్యర్థుల కోసం టీఆర్‌ఎస్ అన్వేషిస్తోంది. ఇదేక్రమంలో టీడీపీ నేతలనూ సంప్రదిస్తున్నారు.
పార్టీలో చేరికలు: మహబూబ్‌నగర్‌కు చెందిన టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పలువురు ఆయా పార్టీలకు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం కేసీఆర్ నివాసానికి వచ్చిన ఆయా పార్టీల నేతలు శివకుమార్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, సుధాకర్ రెడ్డి తదితరులు మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.