మీనం.. రైతు దీనం | West Godavari Fish Ban in Bihar | Sakshi
Sakshi News home page

మీనం.. రైతు దీనం

Jan 30 2019 7:10 AM | Updated on Jan 30 2019 7:10 AM

West Godavari Fish Ban in Bihar - Sakshi

దెందులూరు మండలం కేదవరంలో చేపలను పరిశీలిస్తున్న బిహార్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ విజయలక్ష్మి, అధికారులు

పశ్చిమగోదావరి, దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సాగు చేస్తున్న చేపల దిగుమతులపై బిహార్, అసోం రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నిషేధం విధించాయి. జిల్లాలో సాగవుతున్న చేపలపై ఫార్మాలిన్‌ పూత రాస్తున్నారనే సాకుతో నిషేధించారు. జిల్లాలో సుమారు 1.60 లక్షల ఎకరాల్లో సుమారు 15 వేల మంది రైతులు చేపలు సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి బిహార్, బెంగాల్, అసోం, ఈశాన్య రాష్ట్రాలకు చేపలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అయితే బిహార్, అసోం రాష్ట్రాలు మన చేపల దిగుమతికి అంగీకరించకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తనిఖీలకు ఆహ్వానించింది. జిల్లాలో ఎక్కడైనా తనిఖీలు చేసుకోవచ్చని చెప్పడంతో మూడు రోజులుగా జిల్లాలోని భీమవరం, గణపవరం, నారాయణపురం, కొవ్వలి, పోతునూరు, కేదవరం పలు ప్రాంతాల్లో చేపల చెరువులు, చేపల సాగు విధానాన్ని బిహార్, అసోం రాష్ట్రాల నిపుణుల బృందం పరిశీలించింది. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికా రులు, రైతుల సమక్షంలో చేపలకు ఫార్మాలిన్‌ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఎక్కడా ఫార్మాలిన్‌ వాడినట్టు నిర్ధారణ కాలేదు. అయితే పశ్చిమ చేప ల ఉత్పత్తులను అడ్డుకునేందుకే అక్కడి వ్యాపారులు ఫార్మాలిన్‌ సాకు చూపుతున్నారని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.

అసోంలో ఉత్పత్తి పెరగడమే కారణమా..!
జిల్లాలో ఉత్పత్తి అవుతున్న టన్ను చేపలు సైజును బట్టి రూ.95 వేల నుంచి రూ.1.10 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ఈ ధర కంటే తక్కువగా అసోంలో చేపలు ఉత్పత్తి అవుతుండటంతో పది రోజుల క్రితం బిహార్‌లో పశ్చిమ చేపలను నిషే ధించారని జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ రైతులు సాగు చేసిన రోహూ, కట్ల, శీలావతి, ఫంగస్, రూప్‌చంద్‌ చేపలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మేఘాలయ, బిహార్, అసోం వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.  ప్రస్తుతం బిహార్‌ రాష్ట్రంలో దిగుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఫార్మాలిన్‌ వినియోగం లేదు
చేపల సాగులో ఫార్మాలిన్‌ వినియోగం లేదని బిహార్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.విజయలక్ష్మి అన్నా రు. మంగళవారం మండలంలోని పోతునూరు పంచాయతీ కేదవరం శివారులో చలసాని భాస్కరరావు చేపల చెరువులో చేపలను పరిశీలించి ఫార్మాలిన్‌ కిట్‌తో పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఫార్మాలిన్‌ వాడకం లేదని నిర్ధారణ అయ్యింది. ఆమె వెంట బిహార్‌ డిస్ట్రిక్ట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ బిపిన్, బిహార్‌ పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారి అజయ్, ఆంధ్రప్రదేశ్‌ మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌ నా యక్, జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ అంజలి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పైడిబాబు, ఎఫ్‌డీఓలు అనిల్, రమణ, చేపల రైతులు ఉన్నారు.

చేపల ఉత్పత్తిని అడ్డుకునేందుకే..
బిహార్, అసోం రాష్ట్రాల్లో పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎగుమతి అవుతున్న వివిధ రకాల చేపలను నిలుపుదల చేసేందుకు ఫార్మాలిన్‌ కలుపుతున్నారన్న సాకు చూపించారు. చేపల సాగుపై ఆధారపడి జీవిస్తున్న పశ్చిమ రైతులను దెబ్బతీసుకునేందుకే ఇలా చేశారు. ఈ విధానం సరైంది కాదు.– చలసాని భాస్కరరావు, చేపల సాగు రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement