మెతుకు సీమలో రైతన్న పరిస్థితి దైన్యం గా మారింది. జిల్లాలో జల వనరులు పుష్కలంగా ఉన్నా సాగుకు నీరందక రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమలో రైతన్న పరిస్థితి దైన్యం గా మారింది. జిల్లాలో జల వనరులు పుష్కలంగా ఉన్నా సాగుకు నీరందక రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. సిం గూరు ప్రాజెక్టు కేవలం హైదరాబాద్‌కు తాగునీరు అందించే వనరుగానే మారింది. వేలాది చె రువులు, కుంటలున్నా నిర్వహణ లోపం, వర్షాభావ పరిస్థితులు ఆయకట్టు రైతులకు శాపంగా పరిణమించాయి. ఘణపురం, నల్లవాగు వంటి మధ్య తరహా ప్రాజెక్టులున్నా కాలువల ఆధునికీకరణ లేక సాగు విస్తీర్ణం తగ్గుతోంది. 5.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు కాగితాల్లో కూడా కనిపించడం లేదు.
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో ఆ శాఖ అధికారుల లెక్కల ప్రకా రం 4.72 లక్షల హెక్టార్లు మాత్రమే సాగుకు యోగ్యమైనది. జిల్లా విస్తీర్ణంలో సుమారు 49 శాతం మేర సాగవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఘణపురం, నల్లవాగు ప్రాజెక్టుల కింద 11,058 హెక్టార్ల రిజిస్టర్డు ఆయకట్టు ఉండగా ఏనాడూ ఎనిమిది వేల హెక్టార్లకు మించి సాగైన దాఖలా లేదు. ప్రాజెక్టులు, కాలువల ఆధునికీకరణ జరగకపోవడంతో ఈ రెండు ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం క్రమంగా పడిపోతోంది. కుంటలు, చెరువుల కింద 71,595 హెక్టార్లకు సాగు వసతి ఉన్నట్లు నీటి పారుదల శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. బావులు, గొట్టపు బావుల కింద సాగవుతున్న 1.38 లక్షల హెక్టార్లను కూడా కలిపితే జిల్లాలో మొత్తంగా 2.20 లక్షల హెక్టార్లకు మాత్రమే సాగు నీటి వసతి ఉన్నట్లుగా భావించవచ్చు. మరో 2.51 లక్షల హెక్టార్లు కేవలం వర్షాధారంగానే సాగుతోంది. ఇదిలావుంటే ఏటా ఎదురవుతోన్న వర్షాభావం, అడుగంటుతున్న భూగర్భ జలాలు, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్వహణ లోపం, పెరుగుతున్న పారిశ్రామికీకరణ వంటి కారణాలతో సాగు విస్తీర్ణం వేగంగా పడిపోతోంది. అయితే వ్యవసాయ శాఖ మాత్రం ఇ ప్పటికే 4.60 లక్షల హెక్టార్లలో పంటలు సాగైనట్లు లెక్కలు చెప్తోంది.
నత్తనడకన సింగూరు కాలువల పనులు..
హైదరాబాద్ నగరానికి తాగు నీటిని సరఫరా చేస్తోన్న సింగూరు ప్రాజెక్టు నుంచి 40 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కాలువల తవ్వ కం, లిఫ్ట్ పనులు మొదలు పెట్టారు. జూన్ 2012 నాటికి 12 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాల్సి ఉన్నా పనులు పూర్తి కావడం లేదు.
నిధులు లేక నీరసించిన ప్రాణహిత..
జిల్లాలో 5.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాణహిత- చేవెళ్ల పనులకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో శంకుస్థాపన చేశారు. నిధుల కేటాయింపు తీరు చూస్తే మరో రెండు దశాబ్దాలైనా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఘణపురం ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణకు జపాన్ ఆర్థిక సంస్థ (జైకా) రూ.25 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. 2014లోపు పనులు పూర్తి కావాల్సి ఉన్నా జిల్లాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నేత బంధువు ఒత్తిడితో పనులు నిలిచి పోయాయి.
నల్లవాగుకు నాసిరకం పనులు..
నల్లవాగు కాలువ ఆధునికీకరణ కోసం రూ.14.19 కోట్లు వెచ్చించినా నాసిరకం పనులతో కేవలం రెండేళ్లలో శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్ననీటి వనరుల నిర్వహణ, మరమ్మతుకు రూ.100 కోట్లు ఇస్తామంటూ సీఎం కిరణ్ చేసిన ప్రకటనలు హామీలకే పరిమితమయ్యాయి. మొత్తంగా అరకొరగా వచ్చి చేరుతున్న నీటిని కూడా సద్వినియోగం చేసుకునే దిశలో పాలకులు, అధికారులు దృష్టి సారించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనైనా నీటి వనరుల్లో జలకళ ఉట్టిపడేలా పాలకులు శ్రద్ధ చూపుతారేమోననే ఆశ రైతాంగంలో కనిపిస్తోంది.
జిల్లాలోని సాగు భూములు ఇలా...
వివరాలు సాగువిస్తీర్ణం
హెక్టార్లలో
సాగుకు అనువైన భూమి : 4,72,225
ఘణపురం ఆయకట్టు : 8650
నల్లవాగు ఆయకట్టు :2408
5,005 కుంటల కింద : 15,268
637 చెరువుల కింద : 56,327
బావులు, బోరుబావుల ద్వారా : 1.38,308
వర్షాధారం : 2,51,264