ఉద్యమకారులు కదంతొక్కుతున్నారు. సమైక్య నినాదంతో మంగళవారం జిల్లా మార్మ్రోగింది. నిరసనలు.. ర్యాలీలు.. వంటావార్పుతో విభజన సెగ ఎగిసిపడింది. కర్నూలులో విద్యార్థులు ఉప్పెనలా కదలివచ్చారు. రాజ్‌విహార్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు రహదారి జనసంద్రమైంది.
సాక్షి, కర్నూలు: ఉద్యమకారులు కదంతొక్కుతున్నారు. సమైక్య నినాదంతో మంగళవారం జిల్లా మార్మ్రోగింది. నిరసనలు.. ర్యాలీలు.. వంటావార్పుతో విభజన సెగ ఎగిసిపడింది. కర్నూలులో విద్యార్థులు ఉప్పెనలా కదలివచ్చారు. రాజ్‌విహార్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు రహదారి జనసంద్రమైంది. ఎన్జీవోలు, వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ.. తదితర అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతు ఉద్యమ బాధ్యత నెరవేర్చాయి. సిబ్బంది మొత్తం రోడ్డెక్కడంతో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో పాలన స్తంభించింది. కుల సంఘాలు తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నాయి.
న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. గత 20 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులు ప్రతి రోజూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ ఆధ్యర్యంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రిలే నిరాహరదీక్షలో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్‌లు జేఏసీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ చేపట్టి నాలుగు రోడ్ల కూడలిలో మానవహరంగా ఏర్పడ్డారు. ఆదోని పట్టణంలో సమైక్యాంద్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల దిగ్భందం విజయవంతమైంది.
ఐదు ప్రధాన రోడ్లులో ఉద్యమకారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. బనగానపల్లెలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా, ర్యాలీ నిర్వహించారు. పాణ్యంలో సమైక్యాంధ్ర కోసం విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్భందించారు. కోడుమూరులో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు కోట్ల సర్కిల్‌లో రోడ్డుపైనే పరీక్ష రాసి వినూత్న నిరసన చేపట్టారు. నాయీ బ్రాహ్మణులు రోడ్డుపైనే క్షవరాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు క్లరికల్ సిబ్బంది సమ్మెలో భాగస్వాములైయ్యారు. ఉదయం కోర్టు ఫైల్స్‌ను బీరువాల్లో భద్రపర్చి బీగాలను జూనియర్ సివిల్ జడ్జికి అందజేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎన్‌జీవోస్ సమ్మెలో పాల్గొన్నారు.