ప్లీడరు కాబోయిలీడరయ్యా..

ప్లీడరు కాబోయిలీడరయ్యా.. - Sakshi

  •      విశాఖ నా పుట్టిల్లులాంటిది

  •      ఎంతో ప్రభావితం చేసిన నగరమిది

  •      బీజేపీ సన్మాన సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

  • విశాఖపట్నం: ‘అమ్మ ఇంటికి వచ్చినట్టుంది. విశాఖకు ఎప్పుడు వచ్చినా ఇదే ఫీలింగ్. ఈ ఊరే నాదనిపిస్తోంది. ఇప్పటికీ మా అసలూరు వెళ్లలేదు. కానీ నా కూతురు మా నాన్న అప్పుడప్పుడూ మా ఇంటికొస్తాడంటోంది. ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడి నుంచే వకీలు అవ్వాలనుకున్నాను. విశాఖ నన్నూ నా ఆలోచనలనూ మార్చేసింది. ఆ రోజు ఇక్కడ జైలుకు వెళ్లకపోతే రాజకీయాల్లోకి వెళ్లాలనే కసి వుండేది కాదు. ఆ కసి అప్పుడు లేకపోతే ఇప్పుడు మంత్రిని అయ్యేవాడినే కాదు.



    వకీలు కావాలనుకున్న నేను రాజకీయాల వకల్తా పుచ్చుకున్నాను ఈ నగరంలోనే. ఇదో అందమైన నగరం. ఇక్కడ కొత్తగా సొబగులు చేపట్టకపోయినా ఫర్వాలేదు కానీ ఉన్న అందాలను మాత్రం చెడగొట్టవద్దు .. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఈ మాటలన్నారు. విశాఖపై తనకున్న ప్రేమను ఇలా వ్యక్తీకరించారు.



    కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా వచ్చిన సందర్భంగా బీజేపీ నగర శాఖ శనివారం విశాఖ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికింది. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా జాతీయ రహదారి మీదుగా అక్కయ్యపాలెం పోర్టు కళావాణి ఆడిటోరియం వరకూ తీసుకొచ్చారు. అనంతరం విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన వెంక్యనాయుడును ఘనంగా సన్మానించారు.



    ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీ య వివక్ష చూపించకుండా అందరినీ కలుపుకుని రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని చెప్పారు. ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. గెలిచిన వారు వినయంగా వుండాలని, ఓడిన వారు మరింత వినయంగా వుండాలని సూచించారు.  



    హైదరాబాద్ అనుభవం పునరావృతం కాబోదని అంతా అభివృద్ది జరుగుతుందన్నారు. సవాళ్లు చాలా వున్నాయని వాటన్నింటినీ అధిగమించి అభివృద్ది చేయాల న్నారు. రాత్రికి రాత్రే రాజధాని నిర్మాణం జరిగిపోదు.. 8 నుంచి 10 ఏళ్ల కాలం పడుతుందన్నారు. అప్పటి వరకూ ఓ పిగ్గా వుండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.



    విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, విశాఖ ఎంపీ హరిబాబు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, లలితకుమారి, గున్నా లక్ష్మీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు పివి చలపతిరావు, నగర అధ్యక్షుడు పివి నారాయణ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్‌రావు, రాష్ట్ర సభ్యులు చెరువు రామకోటయ్య, ఫృధ్వీరాజ్  పాల్గొన్నారు.

     

    వెనక ఎవరినీ నిలబడనీయొద్దు..!

     

    పార్టీ నేతలంతా తమ వెనక ఎవరినీ నిలబడనీయకండి. 1984లో ఎన్టీఆర్ వెనక నాదెండ్ల భాస్కరరావు ఎలా నిలబడ్డాడో తెలుసుకోండి. ఆ తర్వాత నాదెండ్ల ఏం చేసాడో గుర్తుకు తెచ్చుకోండి. వెనక నిలబడే వారు చాలా డేంజర్. ప్రజల్లోకి వెళ్లమనండి. కటౌట్లు కట్టి మనల్నే ఔట్ చేస్తారని సభలో నవ్వుల విసుర్లు వదిలారు వెంకయ్యనాయుడు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top