అక్టోబర్‌ 2 నుంచి ప్రభుత్వ సేవలు మరింత సులభతరం

The Village Ministries Will Come Into Force From October 2 - Sakshi

1,372 పంచాయతీలకు 1,096 గ్రామ సచివాలయాలు

శాఖల వారీగా కసరత్తు ప్రారంభం

నివేదికలు తయారుచేస్తున్న జిల్లా యంత్రాంగం

అక్టోబర్‌ 2 నుంచి అమల్లోకి

ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి.. నేరుగా లబ్ధిదారులకు అందజేసి.. పారదర్శకమైన పాలన అందించాలన్న లక్ష్యంతో నూతన ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌     జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా జిల్లాలో 2వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.  ప్రతి గ్రామ సచివాలయానికి ఎంతమంది ఉద్యోగులను నియమించాలి.. ఏయే శాఖల నుంచి నియమించాలి.. అన్న అంశాలపై పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. అందుకనుగుణంగా  ఓవైపు వలంటీర్ల నియామకాలు చేపడుతూనే.. మరోవైపు కొత్త సచివాలయాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది

జిల్లా సమాచారం
జిల్లా మొత్తం జనాభా - 41.74 లక్షలు
పురుషులు- 20.90 లక్షలు
మహిళలు- 20.84 లక్షలు
గ్రామీణ జనాభా- 29.43 లక్షలు
అర్బన్‌ జనాభా- 12.31 లక్షలు
ఎస్సీ జనాభా- 18.82 లక్షలు

ఎస్టీ జనాభా- 3.81 లక్షలు
రెవెన్యూ గ్రామాలు- 1,540
గ్రామ పంచాయతీలు- 1,372
పట్టణాలు- 14
మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు - 8 

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో 1,372 గ్రామ పంచాయతీలున్నాయి. ఆ పంచాయతీల్లో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం 2వేల మందికి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఆ విధంగా జిల్లా మొత్తం 1,096 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి ఈ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఒక్కో గ్రామ సచివాలయంలో పంచా యతీ కార్యదర్శి ఆధ్వర్యంలో 11 మంది ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండేచోట మరికొంతమందిని నియమించే అవకాశముందని అధికారులు అంటున్నారు.

గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ, బాధ్యతలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పశుసంవర్థక, మహిళా, శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం, వ్యవసాయం, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో నియమించే వారిని పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించనున్నారు. ఉద్యోగంలో నియమించే మొదటి రెండేళ్ల సమయం ప్రొబెషనరీగా ఉంచి గౌరవ వేతనం అందజేస్తారు. కేవలం సంబంధిత శాఖల వ్యవహారాలకే పరిమితం కాకుండా గ్రామ సచివాలయాల పరిధిలో ఏపని అప్పగించినా చేసేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి. గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమిస్తారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం వారికి బాధ్యతలు అప్పజెబుతారు. 

అధునాతన నిర్ణయం
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటును అమలులోకి తీసుకురానున్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని ప్రజలకు సులభంగా అందజేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు ఉన్న పంచాయతీలను ఇప్పుడు కొత్తగా సచివాలయంగా ఏర్పాటుచేస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రజలకు, సామాన్యులకు కచ్చితంగా అందుతాయి.

గ్రామ సచివాలయాల్లో 8 శాఖలు
జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల్లో 8 శాఖలను 11 మంది ఉద్యోగులను నియమించనున్నారు. 1. వ్యవసాయ శాఖ, 2. పశుసంవర్థక శాఖ, 3. రెవెన్యూ శాఖ, 4. వైద్యశాఖ, 5. ఉద్యానవన, 6. మహిళా, శిశు సంక్షేమశాఖ, 7. సంక్షేమ శాఖ, 8. పంచాయతీరాజ్‌ శాఖలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ సచివాలయానికీ అనుసంధానకర్తగా గ్రామ వలంటీర్‌ వ్యవహరిస్తారు. వలంటీర్‌ తనకు కేటాయించిన కుటుం బాల్లో ఉన్న సమస్యలపై సచివాలయంలో ఫిర్యాదు చేస్తారు. ఈ ప్రజా సమస్యలను 72 గంటల్లో గ్రామ సచివాలయాల్లోని ఆయా శాఖల ఉద్యోగులు పరిష్కారించాల్సి ఉంటుంది. జిల్లాలో అక్టోబర్‌ 2 నాటికి గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో చేరేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది.

కసరత్తు ప్రారంభించాం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో గ్రామసచివాలయాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాం. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఉత్తర్వులను అనుసరించి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఆయా మండలాల ఎంపీడీఓలతో రెండు రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ఏయే నియమాలు పాటించాలి అనే అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం.            
    –నారాయణ భరత్‌గుప్త, కలెక్టర్, చిత్తూరు

గ్రామ వలంటీర్‌ విధులు ఇవే..
జిల్లాలో గ్రామాలకు గ్రామ వలంటీర్, నగరాల్లో వార్డులకు వార్డు వలంటీర్లను నియమిస్తారు. వారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను నేరుగా తనకు కేటాయించిన 50 ఇళ్లకు చేరవేయాల్సి ఉంటుంది. వలంటీర్‌ గ్రామ సచివాలయానికి, తనకు కేటాయించిన కుటుంబాల మధ్య వారధిగా పనిచేయాల్సి ఉంటుంది. గౌరవవేతనంగా రూ.5 వేలను ప్రభుత్వం అందజేస్తుంది.
1. వలంటీర్‌ తనకు కేటాయించిన కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు చేరవేయాలి. 
2.    కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలి. 
3. తన పరిధిలోని కుటుంబాల సమస్యలను  ప్రభుత్వానికి తెలియజేయాలి.
4. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలి. 
5. ఉన్నతాధికారులు అప్పగించే ఇతర విధులను నిర్వహించాల్సి ఉంటుంది. 
6.ప్రాథమిక సర్వే నిర్వహించడం, కుటుంబాల సమగ్ర సమాచారాన్ని సేకరించడం, ప్రజల అవసరాలను,  సమస్యలను తెలుసుకోవడం చేయాలి. 
7. ప్రజల ఇళ్ల ముంగిటకే సేవలు అందించాలి.
8. ప్రజా సమస్యలు, వినతుల పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలి.
9. వలంటీర్లు విధులు సరిగ్గా నిర్వహించకున్నా, పనితీరు సంతృప్తికరంగా లేకున్నా విధుల నుంచి తొలగిస్తారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top