సాక్షి ప్రతినిధి, కర్నూలు: పింఛన్ల మొత్తాన్ని పెంచి.. ఆనందాన్ని ఐదింతలు చేశామని ప్రభుత్వం ఊదర గొడుతున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పింఛన్ల మొత్తాన్ని పెంచి.. ఆనందాన్ని ఐదింతలు చేశామని ప్రభుత్వం ఊదర గొడుతున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఇష్టానుసారంగా పింఛన్లు తొలగిస్తుండడంతో అర్హులైన వారు మండిపడుతున్నారు. ఏదిక్కూ లేని వారమని, ఉన్న ఆసరాను తీసేస్తే ఎలా బతకాలని అధికారులను నిలదీస్తున్నారు. మనోవేదనకు గురై మరికొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు.
గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన పింజరి నబీసాహెబ్ (71) బుధవారం ఇలాగే చనిపోయారు. మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన వికలాంగుడు సాల్మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వస్తున్న పింఛన్ నిలిపివేశారని తెలిసి.. పంచాయతీ కార్యదర్శి పెద్దిరెడ్డిపై గొడ్డలితో దాడి చేశాడు. జిల్లాలో ఈ రెండు సంఘటనలు బుధవారం సంచలనం రేపాయి. అధికార వర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. ఎన్నికల సమయంలో వృద్ధుల పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000కి పెంచుతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని అమలు చేసేందుకు పింఛన్ల ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రకరకాల నిబంధనల పేరుతో అనేక మంది లబ్ధిదారులను తొలగించారు. ఈ తొలగింపు ప్రక్రియలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే కీలకంగా వ్యవహరించారు. పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలున్నా.. తమ పార్టీకి ఓటేయలేదనో.. మరో వ్యక్తిగత కారణం చేతో కొందరు లబ్ధిదారులను తమ్ముళ్లు తొలగించారనే ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న అనేక మంది లబ్ధిదారులు.. అధికారులు, స్థానిక నాయకులను నిలదీస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ఆందోళనలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల సభలను బహిష్కరిస్తున్నారు.
వాడవాడలా లబ్దిదారుల ఆందోళన
పింఛన్ల జాబితా నుంచి తొలగిన లబ్ధిదారులంతా ప్రభుత్వతీరుపై మండిపడుతున్నారు. తమ పింఛన్ పునరుద్ధరించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి కొందరు పంచాయతీ కార్యదర్శల నివాసాలకు, పంచాయతీ కార్యాలయావద్ద ఆందోళనకు దిగుతున్నారు. కొందరికి ఐదెకరాల పొలం ఉందని, ఇంకొకరికి ఆదాయం ఎక్కువగా ఉందని, మరొకరికి పెద్ద భవనం ఉందని, వయసు తక్కువ ఉందనే రకరకాలకారణాలతో చాలా మంది లబ్ధిదారులను తొలగించారు. వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే.. సెంటు భూమి లేని వారిని, రేషన్ కార్డుల్లో తప్పుగా వయస్సు ధ్రువీకరించిన వారిని తొలగించారు. అర్హులైన వారికి అన్యాయం చేయవద్దనే డిమాండ్ జిల్లా వ్యాప్తంగా ఊపందుకుంటోంది.