వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్నారు. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు లింగపాలెం మండలం ధర్మాజీగుడెంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విజయసాయిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 11గంటలకు చింతలపూడి చేరుకోనున్న విజయసాయిరెడ్డి తొలుత చింతలపూడిలో అధునాతన సౌకర్యాలతో పునర్‌నిర్మించిన ఓ సినిమా థియేటర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత పార్టీ చింతలపూడి మండల కన్వీనర్ జగ్గవరపు జానకీరెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం ధర్మాజీగూడెంలో నెలకొల్పిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబుతో పాటు జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ కార్యక్రమాలకు హాజరుకానున్నారని పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి తెలిపారు.