
తెలుగును తప్పనిసరి చేయాలి: వెంకయ్య నాయుడు
ఉత్కృష్టమైన తెలుగు భాష, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
* కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
* పెద్ద బాలశిక్ష పాఠ్యాంశంగా ఉండాలి
* విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
సాక్షి, విజయవాడ బ్యూరో: ఉత్కృష్టమైన తెలుగు భాష, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృభాషను కోల్పోతే వారసత్వాన్ని కోల్పోయినట్లేనన్నారు. తెలుగు భాషను నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదనే భావన పిల్లల్లో కలగాలంటే ప్రాథమిక పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాషకు భగవద్గీత లాంటి పెద్ద బాలశిక్షను పాఠ్యాంశంగా చేస్తే మంచిదని సూచించారు.
శనివారం విజయవాడలోని కృష్ణవేణి విద్యాలయంలో ప్రపంచ తెలుగు రచయితల 3వ మహాసభలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలుగు భాషాభివృద్ధికి సాధికారిక సంస్థను వీలైతే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ అన్ని స్థాయిల్లో తెలుగును ప్రోత్సహించాలని కోరారు. తెలుగు భాషను అవమానపరిచే ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష క్రమేపీ వెనుకబడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగులోనే ఆలోచిస్తా..
ప్రభుత్వ కార్యకలాపాలు, న్యాయస్థానాల్లో తీర్పులు, బోర్డులు, సూచికలు, బస్సు మార్గాలు లాంటివన్నీ తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తెలుగు వికాసానికి అన్ని పత్రికలు కృషి చేస్తున్నాయని, ఈ ప్రయత్నం మరింత బాగా జరగాలని సూచించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇప్పటికీ తాను తెలుగులోనే ఆలోచిస్తానని, ఆ తర్వాత దాన్ని తర్జుమా చేసుకుంటానని వివరించారు. ఆంగ్లం కళ్లజోడు లాంటిదని, తెలుగు భాష కళ్లు లాంటిదన్న ఒక మహానుభావుడి మాటలు మాతృభాష గొప్పదనానికి నిదర్శనమన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రముఖ రచయిత, కవి, వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావును వెంకయ్యనాయుడు సన్మానించారు. 100 మంది రచయితల రచనలతో ముద్రించిన తెలుగు భారతి, యువత రచించిన తెలుగు యువత పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. విశిష్ట అతిథులు, విదేశీ ప్రతినిధులను సన్మానించి పద్య పేటికలను బహూకరించారు.
తెలుగు వింధ్య పర్వతాలు దాటడం లేదు
హిందీ భాషలోకి మన రచనలు వెళ్లకపోతే మన గురించి వింధ్య పర్వతాలు దాటిన తర్వాత ఎవరికీ తెలియదు. తెలుగు మహాసభలను పత్రికా సంపాదకులు తమ ఇంట్లో పండుగ మాదిరిగా భావించి సహకారం అందించారు.
- యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కేంద్ర హిందీ సంఘం సభ్యుడు
అంతటా తెలుగు వెలగాలి..
అంతరించిపోయే దశలో ఉన్న 22 ప్రపంచ భాషల్లో తెలుగు ఒకటని యునెస్కో వెల్లడించింది. మానవ జీవనానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ తెలుగు భాష వెలగాలి.
- మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
పని నుంచి పాట పుట్టింది..
పాటల రచయితకు సంగీతం ఉండదు. కథా వస్తువు మాత్రమే ఉంటుంది. అదే బాణీని ఇస్తుంది. మా నాన్న సుద్దాల హనుమంతు ఇదే చెప్పారు. చేస్తున్న పనిలో నుంచే ఆయన అనేక పాటలు రాశారు. సన్నివేశాలకు రచయిత అక్షరాలతో స్పందిస్తాడు.
- సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత
ప్రపంచ పరిణామాలపై రచనలు రావాలి..
సాహిత్యం వల్లే తెలుగు బతికి బట్ట కడుతుందని భావించటం లేదు. ప్రపంచ పరిణామాలపై అవగాహన పెంచుకుని రచనలు చేసినప్పుడు మన గురించి బయట వారికి తెలుస్తుంది. అఫ్ఘానిస్తాన్ యుద్ధంపై ఆంగ్లంలో వేల పుస్తకాలు వెలువడ్డా తెలుగులో ఒక్క రచన కూడా రాలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తన రచనలో భగవద్గీత శ్లోకాలు పొందుపరిచారు.
- జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తెలుగు భాషకు 3 వేల ఏళ్ల చరిత్ర
తెలుగుకు మూడు వేల సంవత్సరాల చరిత్ర, వెయ్యేళ్ల సాహిత్యం ఉంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలుగు నేర్చుకోకుండా ఇక్కడ పట్టభద్రులవుతున్నారు. తెలుగుకు ప్రాచీన హోదా లభించినా నిధులు సరిగా వినియోగం కావటం లేదు. కేంద్రీయ హిందీ అకాడమీ తరహాలో తెలుగుకు కేంద్రీయ సంస్థను ఏర్పాటు చేయాలి.
- మండలి బుద్ధప్రసాద్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్
జీవనోపాధికి తెలుగు అత్యవసరం కావాలి
జీవనోపాధికి తెలుగు భాష ఉపయోగపడితేనే ప్రపంచభాషగా అది గుర్తింపు పొందుతుంది. ప్రపంచంలోని ఇతర భాషల్లో ఉన్న మంచి రచనలన్నీ తెలుగులోకి రావాల్సిన అవసరముంది. తెలుగులోని మంచి రచనలు ఇతర భాషల్లోకి అనువదించాలి. ఆంగ్లంలోకి భారతం, భాగవతం, భగవద్గీత వంటివి తర్జుమా కావడం వల్ల నేటి యువత ఆంగ్లంలోనే వాటిని చదువుతున్నారు.
- గొల్లపూడి మారుతీరావు, నటుడు, రచయిత
తెలుగుకు ఎలాంటి భయమూలేదు
తెలుగుకు వచ్చిన భయం ఏమీ లేదు. చిన్నారులకు ఆంగ్లంతోపాటు తెలుగు మాధుర్యాన్ని అందిస్తే చాలు. జపాన్‌లో పాశ్చాత్య సంస్కృతి కార్యాలయాల వరకే వచ్చింది.ఇళ్లకు రాలేదు. అలాగే మనం కూడా ఆంగ్లాన్ని సూట్‌లా తొడుక్కొని ఇంటికొచ్చాక తెలుగు లుంగీ కట్టుకోవాలి.
- తనికెళ్ల భరణి, నటుడు, రచయిత