ఎందరొస్తారో..! | united agitation become severe in YSR district | Sakshi
Sakshi News home page

ఎందరొస్తారో..!

Feb 21 2014 3:07 AM | Updated on Jul 29 2019 5:31 PM

రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రాణసంకటంగా మారింది. చివరి నిమిషంలోనైనా విభజనను ముఖ్యమంత్రి కిరణ్ అడ్డుకుంటారనే ఆశలు అడియాశలయ్యాయి.

సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రాణసంకటంగా మారింది.  చివరి నిమిషంలోనైనా విభజనను ముఖ్యమంత్రి కిరణ్ అడ్డుకుంటారనే ఆశలు అడియాశలయ్యాయి. మరోవైపు ఆదిలోనే హంసపాదులా  కొత్త పార్టీ వ్యవహారం తయారైంది. అధికారంలో ఉన్నన్నాళ్లు  చుట్టూ ఉన్న నేతలు పదవి కోల్పోగానే కనుమరగవుతున్నారు. దీంతో  కలిసొచ్చే నేతలకోసం  కిరణ్ అనుకూల వర్గ నాయకులు ఆరాటపడుతున్నారు.
 
 మూడేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్ జిల్లా నేతలు ముఖ్య అనుచరులుగా మెలిగారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయనతో సన్నిహితంగా మెలిగారు. జిల్లాకు చెందిన మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మాత్రమే వైరి వర్గంగా వ్యవహరించారు.  
 
 రాష్ట్ర విభజన అంశం ఊహించని పరిణామాలకు దారి తీసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి   పదవికి ఎసరు తెచ్చింది.   రాష్ట్ర విభజనకు లోపాయికారీగా సహకరించారని అపవాదు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే మూటగట్టుకున్నారు.ఈ నేపధ్యంలో సమైక్యానికి తాను సైతం అన్పించుకునేందుకు పదవిని వదులుకున్నారు. వైఎస్సార్ జిల్లాలోని  పది నియోజకవర్గాలలో అవసరమైతే తన జట్టు అభ్యర్థులుగా బరిలో ఉండగలరని ఆశించిన కిరణ్‌కు ప్రస్తుత పరిస్థితులు  మింగుడు పడటం లేదు.  కమలాపురం, బద్వేలు, రాయచోటి, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు నియోజకవర్గ నేతలు మాత్రమే కిరణ్ పార్టీ గురించి ఆలోచనలు చేస్తున్నారు.
 
 మంతనాల్లో  నేతలు
 కెప్టెన్‌గా భావిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో  జిల్లాలో జట్టుకోసం నేతలు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇరువురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కిరణ్ జట్టులో  క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ ఒకరు అండగా నిలుస్తున్నారు.  ఎంత మంది నాయకులు కలసివస్తారోననే ఆలోచనలు ఒక వైపు, ప్రజానీకం తమను  ఏ మాత్రం ఆదరిస్తారోనన్న ఆనుమానం  మరోవైపు వీరిలో వ్యక్తమవుతోంది.
 
 త్రిముఖ పోటీలో కనుమరుగు అయ్యే పరిస్థితి కంటే అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరో పార్టీలో చేరితే రాజకీయ ప్రయోజనం ఉంటుందా అనే దిశగా చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. నిన్న మొన్నటివరకు పది నియోజకవర్గాల్లో పోటీ చేయగలమన్న ఆశల్లో ఉన్న నేతలు ఒకటి, రెండు రోజులకే  డీలా పడినట్లు  సమాచారం. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఆశించిన పోటీ ఇవ్వగలమని, మిగతా ప్రాంతాల్లో ఆ స్థాయిలో ఉండకపోవచ్చని  జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.  దీంతో  కిరణ్ విధేయ వర్గం తీవ్రమైన అయోమయంలో ఉన్నట్లు   సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement