వారి నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలి..

Two Women Died With Power Shock In East Godavari - Sakshi

విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళల మృతి

కుళాయి వద్ద తాగునీరు పడుతుండగా ఘటన

బుధవారం ఉదయం ఏడుగంటలు.. మలికిపురం పద్మజా థియేటర్‌ వద్ద పంచాయతీ కుళాయి వద్దకు ఇద్దరు మహిళలు వచ్చి నీటిని పట్టుకుంటున్నారు. ఆ కుళాయికి సమీపంలోనే ఫెన్సింగ్, దానిపై నుంచే హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వెళుతున్నాయి. ఆ ఫెన్సింగ్, వైర్లపై గడ్డిపాదులు పెరిగాయి. దీంతో విద్యుత్‌ ప్రవాహం ఫెన్సింగ్‌కు పాకింది. ఈ నేపథ్యంలో నీళ్లుపట్టుకుంటున్న ఆ మహిళలిద్దరూ షాక్‌కు గురయ్యారు. 15 నిమిషాల పాటు గిలగిలాకొట్టుకుంటూ ప్రాణాలు విడిచారు. విద్యుత్‌శాఖాధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..

మలికిపురం (రాజోలు): విద్యుదాఘాతంతో మలికిపురంలో బుధవారం ఇద్దరు మహిళల మృతి చెందారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నల్లి వరలక్ష్మి(50), నల్లి పైడి కుమారి(22) అక్కడికక్కడే మృతి చెందారు. వరుసకు వీరిద్దరూ అత్తా కోడళ్లు. మలికిపురం పద్మజా థియేటర్‌ ఎదుట పంచాయతీ కుళాయి వద్ద ఉదయమే ఏడు గంటల సమయంలో తాగునీరు పడుతుండగా ఈ సంఘటన జరిగింది. కుళాయి పక్కన ఫెన్సింగ్‌ ఉంది. దాని పైనే హెచ్‌టీ విద్యుత్‌ లైన్‌ ఉంది. ఫెన్సింగ్, విద్యుత్‌ లైన్‌లను కలుపుతూ గడ్డి పాదులు పెరిగాయి.

దీంతో విద్యుత్‌ ప్రవాహం ఫెన్సింగ్‌కు పాకింది. తాగునీటిని పడుతున్న సమయంలో ఇద్దరు మహిళలకు విద్యుత్‌ ప్రవహిస్తున్న ఫెన్సింగ్‌ తగిలి విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. సుమారు 15 నిమిషాల వరకూ అలాగే కొట్టుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేదని, అధికారులు స్పందించి వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తే ప్రాణాలు దక్కేవని స్థానికులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామస్తులు మృత దేహాలను సబ్‌ స్టేషన్‌కు తరలించారు. విద్యుత్‌ లైన్లపై గడ్డి, డొంకలను తొలగించడం లేదని,  విద్యుత్‌ లైన్లు ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు చేరుకుని ఆందోళన కారులతో చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

భర్త చని పోయిన చోటే భార్య వరలక్ష్మి మృతి
ప్రమాదంలో మృతి చెందిన నల్లి వరలక్ష్మి మృతి చెందిన చోటే గతంలో ఆమె భర్త పెద్దిరాజు మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం పెద్దిరాజు కూడా ఇలానే ఉదయమే నిద్ర లేచిన తరువాత రోడ్డుపై నడిచి వెళుతుండగా లారీ ఢీకొని మృతి చెందారు.  ప్రస్తుతం అదే చోట వరలక్ష్మి తాగునీటిని పడుతూ విద్యుత్‌ ఘాతానికి గురైంది. దీంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరో మృతురాలు నల్లి పైడి కుమారికి ఏంజిల్‌(7), పుష్ప శ్రీ(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త సుధాకర్‌ ఉపాధి నిమిత్తం  ఇటీవల విదేశాలకు వెళ్లారు.

అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం
విధి నిర్వహణలో విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. మలికిపురంలో విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మహిళలు షాక్‌కు గురై చనిపోయారన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top