కళాశాలల స్టాఫ్‌పై ట్రాఫిక్‌ నిఘా | Sakshi
Sakshi News home page

కళాశాలల స్టాఫ్‌పై ట్రాఫిక్‌ నిఘా

Published Tue, Dec 4 2018 1:08 PM

Traffic Police Awareness in Colleges - Sakshi

ఒంగోలు: ట్రాఫిక్‌ నిబంధనల అమలు కఠినతరం చేయడం కళాశాలల నుంచే ప్రారంభించాలని పోలీస్‌ శాఖ భావిస్తోంది. మొదట సిబ్బంది, ఆ తర్వాత విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కార్యాలచరణ రూపొందించారు. దీనిలో భాగంగా సోమవారం స్థానిక ఒంగోలు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి అనే కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ వాహనంపై వెళ్లే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, లేని పక్షంలో జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జరుగుతున్న నష్టాలను వివరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగాను ముందుగా కాలేజీల స్థాయి నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. కాలేజీలో పనిచేసే సిబ్బంది అందరూ వారం రోజుల్లో హెల్మెట్‌తో మాత్రమే వాహనాలు నడపాలని, లేని పక్షంలో జరిమానాలు తప్పవన్నారు. కేవలం వాహనం నడిపే వ్యక్తేకాకుండా వెనుక వైపు కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్‌ తప్పనిసరి అన్నారు.

ఏ ఒక్కరికీ హెల్మెట్‌ లేకపోయినా కేసులు నమోదుచేయడం జరుగుతుందన్నారు. ఇక డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్, పీజీ కాలేజీల విద్యార్థుల్లో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా లైసెన్స్‌లు కలిగి ఉండాలన్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలతో కాలేజీకి వచ్చేవారికి కాలేజీల్లోకి అనుమతించవద్దన్నారు. ఈ మేరకు కాలేజీల్లో హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి, హెల్మెట్‌ ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగితే నష్టం ఎలా ఉంటుందనే వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జూనియర్‌ కాలేజీల్లో మైనర్లు ఉంటారని, వారికి లైసెన్స్‌లు ఉండే అవకాశం లేనందున అటువంటి వారు వాహనాలతో కాలేజీకి రానివ్వవద్దన్నారు. అటువంటి వారు ఎవరైనా కేసుల్లో నమోదైతే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదుచేయడం జరుగుతుందన్నారు. కాలేజీ బస్సుల డ్రైవర్లు కూడా క్రమం తప్పకుండా నిర్ణీత లైసెన్స్‌ కలిగి ఉండడంతో పాటు అన్ని బస్సుల ఫిట్‌నెస్‌ కలిగి ఉండేలా చూసుకోవాలని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పక్కాగా ఉండేలా చూసుకోవాలంటూ హెచ్చరికలు చేశారు.

Advertisement
Advertisement