కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు.
నెల్లూరు(రెవెన్యూ): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. పెద్దసంఖ్యలో కార్మికులు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట జైల్‌భరో కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు సుబ్బరామమ్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ.15 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో పని చేస్తున్న వారిని గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించడం హేయమైన చర్యన్నారు. బహుళజాతి కంపెనీలకు అనుకులంగా కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు చేపట్టడం తగదన్నారు. కార్మిక చట్టాల్లో అనేక సవరణలు చేసిందని పేర్కొన్నారు.
బొగ్గు రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. రైతుల ఆమోదం లేకుండా భూ సమీకరణ చట్టం అమలుజేయడం దుర్మార్గమైన చర్యని ధ్వజమెత్తారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన సీఐటీయూ, ఏఐటీయుసీ, ఐఎఫ్‌టీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నాయకులు, పోలీసులకు మధ్య స్వల్ప తొపులాట జరిగింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దామ అంకయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.