రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది.
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. బస్సు రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండలంలోని పెద్దషాపూర్‌తండా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, క్షతగాత్రుల కథనం ప్రకారం.. పెద్దషాపూర్ తండా నుంచి వచ్చిన ఓ ట్రాక్టరు తండా చౌరస్తా దగ్గర బెంగళూరు జాతీయ రహదారిని దాటుతోంది. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ నుంచి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తోంది. ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేయబోయిన సూపర్ లగ్జరీ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొంది.
ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. పొలంలోని కడీలను ఢీకొట్టుకుంటూ దూసుకుపోయింది. ఈక్రమంలో ఓ కడి విరిగి బస్సు ముందు భాగం నుంచి లోపలకి వచ్చింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయూబ్(50)తో పాటు ఆయన పక్కన కూర్చున్న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎస్‌ఐ తిరుపతి(40), ట్రాక్టర్‌పై కూర్చున్న గచ్చుబాయి తండాకు చెందిన రాము(32)కు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ట్రాలీ రోడ్డుపై బోల్తా పడడంతో రహదారిపై సుమారు అరగంట సేపు వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బస్సులోని మరికొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మరో బస్సులో ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.