దశాబ్దాల చరిత్ర.. వైఎస్‌ కుటుంబ ఘనత..

Three Decades Kadapa District People Have Been Giviing Power The Mahaneta YS Family - Sakshi

సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌ : కడప జిల్లా రాజకీయ చరిత్రలో కడప లోక్‌సభ స్థానానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మూడు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు మహానేత వైఎస్‌ కుటుంబానికి పట్టం గడుతూ వస్తున్నారు.  1989లో తొలిసారి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించింది మొదలు ఇక వెనుదిరిగి చూడకుండా వరుసగా వైఎస్‌ కుటుంబం ప్రతి ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తూ వస్తోంది. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,671 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట.. కడప లోక్‌సభ స్థానం అనడంలో అతిశయోక్తి లేదు.

కడపను తిరుమలకు తొలిగడపగా పిలుస్తారు. దత్త మండలం ఆవిర్భవించిన 1800లోనే జిల్లా కేంద్రం కడప. లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ థామస్‌మన్రో తొలి కలెక్టర్‌గా పని చేశారు. ఆయన తర్వాత కొన్నేళ్లు జిల్లా కేంద్రం కడప నుంచి సిద్దవటానికి తరలి వెళ్లింది. 1812లో తిరిగి కడపలోనే జిల్లా హెడ్‌ క్వార్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇది రాయలసీమ నడిబొడ్డున ఉంది. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి.

ప్రస్తుత జనాభా 21,47,853 మంది ఉన్నారు. ఇందులో 14,56,623 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులపై విచారణ చేస్తున్నారు. ఇంకా నమోదుకు ఫారం–6 దాఖలు చేయడానికి సమయం ఉంది. కనుక ఓటర్లు మరింత మంది పెరిగే అవకాశం ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి 190323 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆయనకు 6,71,983 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్‌.శ్రీనివాసులురెడ్డికి 4,81,660 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌ పక్షాన పోటీ చేసిన అజయ్‌కుమార్‌వీణాకు 14,319 మాత్రమే ఓట్లు రావడంతో డిపాజిట్‌ కోల్పోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆధిక్యత లభించింది. బద్వేలులో 18099, కడపలో 42508, పులివెందులలో  72483, కమలాపురంలో 11461, జమ్మలమడుగులో 16328, ప్రొద్దుటూరులో 12,516, మైదుకూరులో 15591 ఓట్ల ఆధిక్యత లభించింది.
ఇక గతాన్ని ఓమారు విశ్లేషిస్తే.. కడప లోక్‌సభ నియోజకవర్గంలో సీపీఐ నాలుగు సార్లు విజయబావుటా ఎగురవేసింది. 1989 నుంచి వైఎస్‌ కుటుంబం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వరుసగా నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆయన సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి రెండు సార్లు, వైఎస్సార్‌ కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్సార్‌ దుర్మరణం చెందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జగన్‌కు 5,45,671 ఓట్ల మెజార్టీ లభించింది. ఆ తర్వాత ఆయన పులివెందుల శాసనసభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఈ నియోజకవర్గ ఫలితాల సరళిని పరిశీలిస్తే వైఎస్‌ కుటుంబ ఆధిపత్యం అప్రతిహతంగా సాగుతోంది.
చరిత్ర సృష్టించిన వైఎస్‌ జగన్‌
2009 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన పాలెం శ్రీకాంత్‌రెడ్డిపై లక్షా 78 వేల 846 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహానేత వైఎస్‌ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి ఆ పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డీఎల్‌ రవీంద్రారెడ్డిపై 5 లక్షల 45 వేల 671 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి దేశంలోనే చరిత్ర సృష్టించారు.     

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top