ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా మూడు కౌన్సెలింగ్ కేంద్రాలకు గాను 39 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. జిల్లాలోని మూడు కేంద్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించగా కేవలం 39మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. విద్యార్థుల కోసం అధికారులు, సిబ్బంది ఎదురుచూడాల్సి వచ్చింది.
కడప ఎడ్యుకేషన్ : ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా మూడు కౌన్సెలింగ్ కేంద్రాలకు గాను 39 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ కేంద్రాలలోని అధికారులు, సిబ్బంది విద్యార్థుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహణ దాదాపు రెండు నెలలు ఆలస్యమైంది. దీంతో చాలామంది విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పలు కళాశాలల్లో చేరిపోయారు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రాలు విద్యార్థులు లేక వెలవెలబోయాయి.
జిల్లాలోని మూడు కేంద్రాల్లో...
1 నుంచి 5 వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి జిల్లాలోని మూడు కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కడప నగరంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 11 మంది విద్యార్థులు హాజరయ్యారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 17 మంది హాజరు కాగా ప్రొద్దుటూరులోని వైవీయూ ఇంజనీరింగ్ కళాశాలలో 11 మంది హాజరయ్యారు. శుక్రవారం నుంచి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 23 వరకు కొనసాగనుంది.