EAMCET counciling
-
కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్
నూనెపల్లె : ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు చేపట్టిన కౌన్సెలింగ్ శనివారం రెండవ రోజూ కొనసాగింది. స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు క్యాంప్ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బఃగా ఆయన మాట్లాడుతూ రెండవ రోజు కౌన్సెలింగ్‌లో 15001 నుండి 30 వేల ర్యాంకులు సాధించిన విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ఇందులో సర్టిఫికెట్ పరిశీలనకు మొత్తం 167 మంది హాజరు అయ్యారని, ఎస్సీ విద్యార్థులు 4, ఓసీ, బీసీ, మైనార్టీలు 163 మంది హాజరయ్యారు. ఆదివారం కౌన్సెలింగ్‌లో 30,001 నుండి 45 వేల ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఈ ర్యాంకు విద్యార్థులు హాజరు కావాలని చెప్పారు. కౌన్సెలింగ్‌లో సిస్టమ్ అధికారులుగా సుబ్బరాయుడు, మంజునాథ్, కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. సర్టిఫికెట్లు ముందుగా ఇవ్వొద్దు .. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి అయిన వెంటనే ఇంజనీరింగ్ లో కళాశాలలో చేరే విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఎంసెట్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను విద్యార్థులకు రెండు విడతల్లో ఉన్నత విద్యాశాఖ మండలి నిర్వహిస్తుందని తెలిపారు. అయితే గతంలో మొదటి విడతలతో కౌన్సెలింగ్ తర్వాతనే కళాశాలలు సర్టిఫికెట్లు, ఫీజులు వసూలు చేసేవారన్నారు. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు వెళ్లిన సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగేవన్నారు. వారి ఇబ్బందులను తొలిగించేందుకు రెండ విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతనే ఎంపిక చేసుకున్న కళాశాలల్లో సర్టిఫికెట్లు ఫీజులు చెల్లించవచ్చని చెప్పారు. కాగా రెండో కౌన్సెలింగ్‌కు వెళ్లే వారు మాత్రం సమీపంలోని ఆన్లైన్, వెబ్కేంద్రాల్లో కళాశాలలకు సూచన చేయాల్సి ఉంటుందని వివరించారు. కర్నూలులో కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభం కాగా రెండో రోజు శనివారం కూడా కొనసాగింది. బి.తాండ్రపాడులోని జి. పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 15001 నుంచి 30 వేల ర్యాంకు వరకు పిలువగా 227 మంది విద్యార్థులు తమ సరిఫికెట్లను పరీక్షించుకున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో 22,501 నుంచి 30 వేల ర్యాంకు వరకు పిలువగా 216 మంది హాజరైనట్లు ఆర్యూ వీసీ వై. నరసింహులు తెలిపారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ వెలవెల
ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. జిల్లాలోని మూడు కేంద్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించగా కేవలం 39మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. విద్యార్థుల కోసం అధికారులు, సిబ్బంది ఎదురుచూడాల్సి వచ్చింది. కడప ఎడ్యుకేషన్ : ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా మూడు కౌన్సెలింగ్ కేంద్రాలకు గాను 39 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ కేంద్రాలలోని అధికారులు, సిబ్బంది విద్యార్థుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహణ దాదాపు రెండు నెలలు ఆలస్యమైంది. దీంతో చాలామంది విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పలు కళాశాలల్లో చేరిపోయారు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రాలు విద్యార్థులు లేక వెలవెలబోయాయి. జిల్లాలోని మూడు కేంద్రాల్లో... 1 నుంచి 5 వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి జిల్లాలోని మూడు కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కడప నగరంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 11 మంది విద్యార్థులు హాజరయ్యారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 17 మంది హాజరు కాగా ప్రొద్దుటూరులోని వైవీయూ ఇంజనీరింగ్ కళాశాలలో 11 మంది హాజరయ్యారు. శుక్రవారం నుంచి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 23 వరకు కొనసాగనుంది. -
ఎంసెట్ కౌన్సెలింగ్ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఎంసెట్ కౌన్సెలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో గురువారం ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌లో భాగంగా తొలిరోజు 1 నుంచి 5000 ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా జిల్లాలోని నాలుగు కేంద్రాలకు 127 మంది విద్యార్థులు హాజరయ్యూరు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని కేంద్రానికి 10 మంది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రానికి 29 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి 38 మంది, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని కేంద్రానికి 50 మంది హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం దాదాపు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం రోజున మాత్రం హెల్ప్‌లైన్ కేంద్రాలకు ఒక్కొక్కరుగా తరలివచ్చారు. గురువారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ముందుగానే తెలిసినప్పటికీ ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కడ హాజరు కావాలనే విషయమై బుధవారం రాత్రి వరకూ స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ర్యాంకులవారీగా హాజరు కావాల్సిన హెల్ప్‌లైన్ కేంద్రాల జాబితాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం రాత్రి ఎంసెట్ వెబ్సైట్లో పొందుపర్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు షెడ్యూల్‌ను తెలుసుకోలేకపోయారు. గురువారం ఉదయం దినపత్రికల్లో చూశాక ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లారు. ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాగా మూరుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు 10.30 తర్వాతే హాజరవగలిగారు. తల్లిదండ్రులను వెంట పెట్టుకుని వచ్చిన విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనను నిర్ణీత సమయానికి పూర్తి చేసుకుని వెళ్లారు. నేటి షెడ్యూల్ శుక్రవారం 5001 నుంచి 10వేల ర్యాంకుల వరకు అభ్యర్థులను సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. గుజ్జనగుండ్లలోని కళాశాలలో 5,001 నుంచి 6,250 ర్యాంకు వరకు, నల్లపాడులోని కళాశాలలో 6,251 నుంచి 7,500 ర్యాంకు వరకు, సాంబశివపేటలోని మహిళా కళాశాలలో 7,501 నుంచి 8,750 ర్యాంకు వరకు, ఏఎన్‌యూలో 8,751 నుంచి 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులు హాజరుకావాలి.