సయోధ్య యత్నమేదీ? | there is no reconciliation over BAC controversy? | Sakshi
Sakshi News home page

సయోధ్య యత్నమేదీ?

Jun 23 2014 1:36 AM | Updated on Aug 10 2018 8:08 PM

కాపురం చేసే కళ కాళ్లు తొక్కినప్పుడే తెలిసిపోయిందన్నట్టు ప్రధాన ప్రతిపక్షంతో టీడీపీ ప్రభుత్వం సయోధ్య ఎలా ఉండబోతోందో శాసనసభ తొలి సమావేశాల్లోనే తేటతెల్లమైంది.

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాపురం చేసే కళ కాళ్లు తొక్కినప్పుడే తెలిసిపోయిందన్నట్టు ప్రధాన ప్రతిపక్షంతో టీడీపీ ప్రభుత్వం సయోధ్య ఎలా ఉండబోతోందో శాసనసభ తొలి సమావేశాల్లోనే తేటతెల్లమైంది. శాసనసభ కార్యకలాపాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని ఏకపక్షంగా జరిపించుకోవడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విపక్ష ప్రాతినిధ్యమే లేకుండా బీఏసీ తొలి భేటీ జరిగి, సభ తదుపరి కార్యకలాపాల్ని ఏకపక్షంగా ఖరారు చేసిన తీరు పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. దీన్ని అత్యంత అరుదైన సందర్భంగా, శాసనవ్యవస్థల స్ఫూర్తికి విరుద్ధమైందిగా పేర్కొంటున్నారు. బీఏసీ కూర్పన్నది, ప్రశ్నించలేని స్పీకర్ విస్తృతాధికారాల పరిధిలోని అంశమే అయినా.. పాలకపక్షం చొరవ తీసుకొని సయోధ్యతో కూర్పు జరిపించడం ఆనవాయితీ.
 
 సభ కార్యకలాపాల నిర్వహణ అన్నది ప్రభుత్వ బాధ్యత కనుక, సలహా సంఘం కూర్పు విషయంలోనూ ప్రభుత్వం అంతే చొరవ, బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సిందన్న భావన వ్యక్తమౌతోంది. శనివారం జరిగిన పరిణామాల్లో ఆ చొరవే లోపించింది. ఫలితంగా విపక్ష ప్రాతినిధ్యమే లేకుండా పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన భారతీయ జనతా పార్టీ కలిసి స్పీకర్ సమక్షంలో సభా కార్యకలాపాల్ని నిర్ణయించినట్టయింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే వ్యతిరేకమైన పోకడ అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఒకే ప్రతిపక్ష పార్టీ ఉన్న చోట దామాషా నిష్పత్తిలో ప్రాతినిధ్యం కల్పించాలన్న వైఎస్సార్ సీపీ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందన్న అభిప్రాయం విజ్ఞుల నుంచి వ్యక్తమౌతోంది. పాలకపక్షం పలుమార్లు ప్రతిపాదనలు మారుస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సలహామండలిలో ప్రాతినిధ్యాన్ని కుదించే యత్నం సరైంది కాదన్నది పరిశీలకుల వాదన.


 విపక్షాల్ని కలుపుకుపోవటం ప్రభుత్వ కర్తవ్యం...


 ‘‘కేవలం సాంకేతికత ఆధారంగా వెళ్లడం కాకుండా, సంప్రదాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సభా వ్యవహారాల నిర్వహణలో సహకరించడం ప్రతిపక్షాల బాధ్యత అయినట్టే, విపక్షాల్ని కలుపుకొని పోవడం ప్రభుత్వ కర్తవ్యం’’ అని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఒకప్పుడు చక్కని పద్ధతి ఉండేది. పాలకపక్షం వైపు నుంచి సభానాయకుడి హోదాలో ముఖ్యమంత్రి, శాసనవ్యవహారాల మంత్రి, సభలో సయోధ్య కుదిర్చే చీఫ్ విప్ ఇలా ముగ్గురు మాత్రమే ఉండేవారు. ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు ఆ పార్టీ నుంచి మరొకరికి ప్రాతినిధ్యం ఇచ్చేవారు. దానికి తోడు ఇతర విపక్ష పార్టీలకూ ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉండేది కనుక పాలక - విపక్షాల మధ్య సమతూకం ఉండేది’’ అని సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి గుర్తుచేశారు.


 సంప్రదింపులు జరిపి ఉండాల్సింది...


 ఇప్పుడు బీఏసీలో పాలకపక్షం నుంచి సభానాయకుడిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనవ్యవహారాల మంత్రి, నీటిపారుదల మంత్రి, చీఫ్ విప్, సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన బీజేపీ ప్రతినిధి.. ఇలా పాలకపక్షం వైపు నుంచి ఆరుగురు అయ్యారు. ఒకే ఒక విపక్షపార్టీ వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరికే ప్రాతినిధ్యమంటే, 6:2 ఏ మాత్రం సమతూకం లేకుండా ఏకపక్షంగా ఉంటుందన్నదే ఇక్కడ కీలకాంశం. ‘‘ఇది సరైన నిష్పత్తి కాదు, మేం ప్రతిపాదించినట్టు మా పక్షాన నలుగురికి ప్రాతినిధ్యం కల్పించండని కోరి.. ప్రభుత్వం ససేమిరా అనడంతో విపక్ష పార్టీ నిరసించినపుడు.. చీఫ్ విప్ గానీ, శాసనవ్యవహారాల మంత్రి గానీ, చివరకు సభ కార్యదర్శి గానీ చొరవ తీసుకుని విపక్షంతో సంప్రదింపులు జరిపి ఉండాల్సింది’’ అని మాజీ స్పీకర్ ఒకరు అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత తలెత్తిన ఎన్నో కష్ట-నష్టాలు, లోపాలు, సమస్యల్నుంచి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోవడానికి అంతా కలిసిరావాలని పిలుపునిస్తున్న ఈ తరుణంలో కీలకమైన శాసనసభా వ్యవహారాల్లో పాలకపక్షపు ఒంటెద్దుపోకడ సమంజసం కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement