తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతరం పెల్లుబికిన నిరసనలతో జిల్లాలో పాలన పడకేసింది. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు మొదలుకొని కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు గెజిటెడ్ స్థాయి అధికారులు కూడా సమైక్యాంధ్రను కొనసాగించాలని విధులకు గైర్హాజరై ఆందోళన బాట పట్టారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతరం పెల్లుబికిన నిరసనలతో జిల్లాలో పాలన పడకేసింది. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు మొదలుకొని కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు గెజిటెడ్ స్థాయి అధికారులు కూడా సమైక్యాంధ్రను కొనసాగించాలని విధులకు గైర్హాజరై ఆందోళన బాట పట్టారు. ఈ కారణంగా పది రోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సోమవారం నుంచి 72 పౌరసేవలు నిలిపివేయనున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. జులై 30న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ఏకగ్రీవ తీర్మానం చేయగా, 31వ తేదీ నుంచే జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఉద్యోగ జేఏసీతో పాటు విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీలు యూపీఏ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చాయి. ఈ నెల 1వ తేదీ నుంచి పరిస్థితి పూర్తిగా చేయిదాటింది. జిల్లా కలెక్టరేట్, జెడ్‌పీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంతో పాటు ట్రెజరీ, పంచాయతీ, విద్యుత్ శాఖ కార్యాలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి. ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత విధులకు హాజరై ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడం.. డివిజన్, మండల స్థాయిల్లోని అధికారులతో సెట్‌లలో, సెల్‌ఫోన్‌ల లో మాట్లాడుతూ అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
బ్యాంకు లావాదేవీలకు బ్రేక్
ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో ఏ ఒక్క బ్యాంకు పనిచేయడం లేదు. కలెక్టరేట్‌లోని ట్రెజరీ బ్యాంకుతో పాటు బ్యాంకు ప్రధాన కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో పదిరోజుల్లో దాదాపు రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు స్తంభించినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాన బ్యాంకులు ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రా బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఏటీఎంలు కూడా చాలా చోట్ల మూతపడ్డాయి. ఎస్‌బీఐ ఏటీఎంలలో మాత్రమే నగదు నిల్వలు కొంతవరకు ఉండగా, మిగతా ఏటీఎంలు నిండుకున్నాయి. ట్రెజరీ సేవలు కూడా లేకపోవడంతో ప్రభుత్వ లావాదేవీలు చాలావరకు ఆగిపోయాయి.