సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలు అలుపెరుగకుండా సాగుతున్నాయి. నిరసనలు వినూత్నతను సంతరించుకుంటున్నాయి.
పోరాటం ఆగదు
Oct 21 2013 6:27 AM | Updated on Sep 27 2018 5:59 PM
సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలు అలుపెరుగకుండా సాగుతున్నాయి. నిరసనలు వినూత్నతను సంతరించుకుంటున్నాయి. హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు ఈ నెల 26న తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగ సభకు సీమాంధ్ర నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు, విద్యార్థులు, రైతులు తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఘంటా ప్రసాదరావు ఆదివారం ఏలూరులో పిలుపునిచ్చారు. ఉద్యమంలో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా మహిళలతో మానవహారం, గౌరీ పూజ, తెలంగాణ ఆడపడుచులకు అట్లతద్ది వాయినాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
అత్తిలి మండలం పాలూరులో తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య గడపగడపకు పాదయాత్ర చేశారు. సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేయాలని పాలూరులో చీర్ల రాధయ్య, బుట్టాయగూడెంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గొట్టుముక్కల భాస్కరరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేటి సత్యనారాయణ, రేపాకుల చంద్రం, గద్దె వీరకృష్ణ పిలుపునిచ్చారు.
ఏలూరులో 23, 24 డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. నాయకురాలు పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, మాజీ కార్పొరేటర్ కోలా భాస్కరరావు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నారా రామకృష్ణ దీక్షను ప్రారంభించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో చరిత్రహీనుడిగా మిగిలిపోయారని వారు విమర్శించారు. పాలకొల్లు కెనాల్‌రోడ్డులో నాయకుల దీక్షకు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ, ముచ్చర్ల శ్రీరామ్ సంఘీభావం తెలిపారు. తాడేపల్లిగూడెంలో దీక్షలు 73వ రోజుకు చేరాయి. 20 మంది పార్టీ అభిమానులు దీక్షలో కూర్చున్నారు. వీరవాసరంలో దీక్షలు 62వ రోజుకు చేరుకున్నాయి. భీమవరంలో పార్టీ నాయకులు ఒంటికాలిపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇక్కడ దీక్షలు కొనసాగుతున్నాయి. నరసాపురంలో దీక్షలు 60వ రోజుకు చేరాయి. జంగారెడ్డిగూడెంలో పార్టీ శ్రేణుల దీక్షకు నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు సంఘీభావం తెలిపారు.
సమైక్య శంఖారావం సభలో పాల్గొనేందుకు దెందులూరు నియోజకవర్గం నుంచి అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ సమన్వయకర్తలు కొఠారు రామచంద్రరావు, అశోక్‌గౌడ్, పీవీ రావు తెలిపారు. వారి కోసం 16 బస్సులు సిద్ధం చేశామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement