దేవునికి శఠగోపం..! | Temples land occupying | Sakshi
Sakshi News home page

దేవునికి శఠగోపం..!

Jul 16 2014 3:07 AM | Updated on Oct 8 2018 5:04 PM

దేవునికి  శఠగోపం..! - Sakshi

దేవునికి శఠగోపం..!

జిల్లాలో 1,317 పెద్దా, చిన్నా దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఓ మోస్తరు ఆదాయమున్న ఆలయాలు 30పైనే. ఈ ఆలయాల పేరిట జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములున్నాయి.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో 1,317 పెద్దా, చిన్నా దేవాల యాలు ఉన్నాయి. వీటిలో ఓ మోస్తరు ఆదాయమున్న ఆలయాలు 30పైనే. ఈ ఆలయాల పేరిట జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములున్నాయి. చాలా చోట్ల దేవుడు, దేవాలయాల పేరిట భూమున్నా వాటి సమగ్ర వివరాలు మాత్రం దేవాదాయ శాఖ వద్ద లేవు. తాజాగా సేకరిస్తున్న లెక్కల ప్రకారం 18,783.15 ఎకరాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇనాందారులు, సేవకులు, ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లో సుమారు మూడువేల ఎకరాలకు పైగా దేవాలయ భూములున్నట్లు అంచనా వేస్తున్నారు. దేవాలయాల నిర్వహణ, సంరక్షణ కోసం పలువురు దాతలు భూదానం చేశారు. వీటిని సంరక్షించాల్సిన దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్రమబద్ధీకరణ పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ వస్తున్నారు.
 
 దేవాలయ భూముల్లో ఎన్నో ఏళ్లుగా తాము సాగుచేస్తున్నందున తమ పేరిట క్రమబద్ధీకరించాలంటూ ఆర్డీఓల వద్ద వినతులు పెండింగులో ఉండటమే ఇందుకు తార్కాణం. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కైన రెవెన్యూ అధికారులు సేత్వార్, ఖాస్రా పహణీ (1955-56) వంటి కీలకమైన రెవెన్యూ రికార్డులు మాయం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సర్వే, ల్యాండ్ రికార్డుల కార్యాలయంలో రికార్డుల కోసం దరఖాస్తు చేసినా ‘టార్న్‌డు కండీషన్( (చిరిగిపోయిన స్థితి)లో ఉండటం వల్ల సంబంధిత రికార్డులు ఇవ్వడం సాధ్యం కాదంటూ స్పష్టం చేస్తున్నారు. దేవాదాయ, రెవెన్యూ విభాగాల నడుమ సమన్వయ లోపం దేవాలయ భూముల పరిరక్షణకు శాపంగా మారింది.
 
 నిబంధనలకు పాతర
 నిబంధనల ప్రకారం దేవాలయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలతో పాటు సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేవాలయ భూముల కౌలు ద్వారా జిల్లాలో రూ.30లక్షల మేర వార్షికాదాయం వస్తోంది. అయితే దేవాలయ భూముల సంరక్షణ బాధ్యత గాలికొదిలేయడంతో ఆదాయం తగ్గి ఆలయాల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. ఎండోమెంట్ చట్టం ప్రకారం దేవాలయాల భూములు లీజుకు ఇవ్వాలన్నా, అమ్మకం జరపాలన్నా, ఇతరుల పేరిట మార్పిడి చేయాలన్నా ప్రభుత్వ అనుమతి అవసరం. నిబంధనలకు పాతర వేస్తూ రెవెన్యూ అధికారులు మాత్రం ఆలయ భూములను ప్రైవేటు పరం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములను సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ సిబ్బంది కొరతను సాకుగా చూపుతోంది. రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున దేవాదాయ ఇన్‌స్పెక్టర్ ఉండాలి. కానీ, ప్రస్తుతం జిల్లా అంతటికీ ఒక్కరే ఉన్నారు. 32మంది దేవాలయ ఎగ్జికూటివ్ అధికారులకు గాను పదిమంది మాత్రమే ఉన్నారు. దీంతో 64 మండలాలను క్లస్టర్లుగా విభజించి పది మంది ఈఓలు, ఎనిమిది మంది మేనేజర్లకు భూ సంరక్షణ బాధ్యత అప్పగించడం పరిస్థితికి అద్దం పడుతోంది. దేవాలయ భూముల లెక్క తేల్చాలంటూ సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశించడంతో ఎండోమెంట్ అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement