నంద్యాలలో అధికార పార్టీ అడ్డదారి

నంద్యాలలో అధికార పార్టీ అడ్డదారి - Sakshi


►నంద్యాలలో గెలుపు కోసం టీడీపీ అక్రమాలు

►ఓటరు నమోదుకు కొత్తగా 16 వేల దరఖాస్తులు

►పక్క నియోజకవర్గాల వారితో ఇక్కడ దరఖాస్తు..

►మొత్తం వ్యవహారాన్ని నడిపించిన ఓ మంత్రి



కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో అడ్డదారిలో గెలుపొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుండటంతో.. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు ఆయుధాన్ని బోగస్‌ ఓట్లతో దారి మళ్లించే కుయుక్తులకు పాల్పడుతోంది. పక్క నియోజకవర్గాల వారిని నంద్యాల నియోజకవర్గం ఓటర్లుగా చేర్పించే పన్నాగానికి తెరతీసింది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఏకంగా 16 వేల కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు వచ్చాయంటే ఏ స్థాయిలో అక్రమాలకు అధికార పార్టీ తెరలేపిందో ఇట్టే అర్థమవుతోంది. పైగా ఇలా దరఖాస్తు చేసుకున్న బోగస్‌ ఓట్లన్నింటినీ ఓకే చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. స్వయంగా ఒక మంత్రి ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ అధికారులతో గ్రీన్‌సిగ్నల్‌ ఇప్పించేందుకు యత్నిస్తుండటం గమనార్హం.



బోగస్‌ ఓట్లను ఓకే చేయాలంటూ ఒతిళ్లు..

కర్నూలు జిల్లాలో ఓటర్ల వివరాలను 2017 జనవరి 1వ తేదీన ప్రచురించారు. అదే సమయంలో కొత్త ఓటర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. దీంతో అధికార పార్టీ వేలసంఖ్యలో బోగస్‌ ఓటర్ల నమోదుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. నాలుగు రోజుల క్రితం వరకు సుమారు 11 వేల మేరకు ఉన్న ఈ దరఖాస్తుల సంఖ్య.. 27వ తేదీ నాటికి ఏకంగా 16 వేలకు పెరిగిపోయింది.


ప్రజాక్షేత్రంలో నిజాయితీగా గెలవలేమనే ఉద్దేశంతో ఈ విధంగా అడ్డదారిలో గెలుపొందేందుకు అధికారపార్టీ కుయుక్తులు పన్నుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో చివరిరోజు 28వ తేదీ కూడా వేల సంఖ్యలోనే బోగస్‌ ఓట్లను అధికార పార్టీ చేర్పించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పక్క నియోజకవర్గాల్లోని వారిని కొత్త ఓటర్లుగా చేర్పించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ బోగస్‌ ఓట్లను సరైన ఓట్లుగానే ఓకే చేయాలంటూ మంత్రిస్థాయి నుంచి అధికారులకు ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం.



ఎన్నికల సంఘం నిఘా!

కర్నూలు జిల్లాలో ఈ నెలాఖరుతో ఈ ప్రక్రియ ముగియనుండగా.. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు కలిపి రానంతస్థాయిలో కేవలం నంద్యాల నియోజకవర్గం నుంచే ఓటర్ల నమోదు ఉండటం అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒత్తిళ్లకు గురై వీటన్నిటినీ ఇష్టానుసారంగా ఓకే చేసేస్తే తమ ఉద్యోగాలకు ఇబ్బందులు తప్పవని అధికారులు మధనపడుతున్నారు.


కాగా బోగస్‌ ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేయడం, భారీగా కొత్త ఓటర్లకు దరఖాస్తులు రావడంతో ఎన్నికల సంఘం నిఘా వేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పక్కన ఉన్న నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాలతో సరిచేసి చూడాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top