
60 ఏళ్లుగా కలిసున్నాం... : వైఎస్ జగన్
60 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్న తెలుగు ప్రజలను ఇవాళ విడదీసి పొమ్మంటుంటే ఆ బాధ తమకు మాత్రమే తెలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పొమ్మంటే ఆ బాధ మాకే తెలుస్తుంది ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో జగన్
సాక్షి, హైదరాబాద్: 60 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్న తెలుగు ప్రజలను ఇవాళ విడదీసి పొమ్మంటుంటే ఆ బాధ తమకు మాత్రమే తెలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో దీక్ష సందర్భంగా ఎన్డీటీవీ గ్రూప్ ఎడిటర్ బర్ఖా దత్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘రాజీవ్‌గాంధీని పెళ్లాడి 30 ఏళ్లుగా భారత్‌లో ఉంటున్న సోనియాను దేశం వదలి పొమ్మంటే ఎలా ఉంటుంది? భారత్‌లో నివసిస్తున్న విదేశీయులంతా ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని పార్లమెంటులో ఒక చట్టం చేస్తే, అప్పుడు సోనియా ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తే ఆమెకెలా ఉంటుంది?’’ అని ప్రశ్నించారు. ఇప్పుడున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌ిసీ) కాదని, అది ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్‌గా మారిందని ఘాటుగా విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలు సబబేనా అని బర్ఖా ప్రశ్నించగా, ‘భారతీయులైతే ఇక్కడి సమాఖ్య వ్యవస్థను అర్థం చేసుకునే వారు, ఇక్కడి ప్రజల మనోభావాలేమిటో తెలుసుకునేవారు’ అని జగన్ బదులిచ్చారు. ‘రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ను విభజించబూనారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్ల కోసం ఆ ప్రాంతంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది కాంగ్రెసే’ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారికే ప్రధాని పదవికి మద్దతిస్తామన్న జగన్ ప్రకటనను బర్ఖా గుర్తు చేశారు. అది నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుందా అని పదే పదే ప్రశ్నించారు. దానికి బదులుగా, ‘మా ఎజెండా ఒకే ఒకటి. అది మా రాష్ట్రం సమైక్యంగా ఉండటం. మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎవరు కృషి చేస్తే వారికే ఎన్నికల తరవాత మా మద్దతుంటుంది. అందుకు మోడీ కి ఎలాంటి మినహాయింపు లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన సహకరిస్తే ఆయనకే మా మద్దతు’ అని జగన్ స్పష్టం చేశారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి కాంగ్రెస్ పథకం ప్రకారమే జరిగిందన్నారు. ‘‘సభ్యులను సస్పెండ్ చేయకుండా సభ సజావుగా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ పదేపదే చెప్పింది. అందుకే సభలో గందరగోళం సృష్టించి, ఆ సాకుతో సీమాంధ్ర ఎంపీలందరినీ బయటకు పంపి బిల్లు ఆమోదించుకోవాలన్నది కాంగ్రెస్ కుట్ర’’ అన్నారు.