సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి. రైతులు, శాస్త్రవేత్తలు సమన్వయంతోనే పనిచేస్తే వ్యవసాయంలో లాభాలు సాధ్యం.
బాపట్ల అర్బన్, న్యూస్‌లైన్ :‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి. రైతులు, శాస్త్రవేత్తలు సమన్వయంతోనే పనిచేస్తే వ్యవసాయంలో లాభాలు సాధ్యం. పంటలపై అవగాహన లేకనే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది’ అని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్ చెప్పారు. ఆదివారం బాపట్ల వ్యవసాయ కళాశాల కాన్ఫరెన్స్ హాలులో మొట్టమొదటిసారిగా అంతర విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ అనుబంధ సంస్థల డెరైక్టర్లు, శాస్త్రవేత్తలతో జరిగిన సదస్సులో ఐసీఏఆర్ డీజీ డాక్టర్ అయ్యప్పన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ సంస్థలు సమన్వయంతో పనిచేస్తే లాభాలు గడించవచ్చన్నారు.
పంటలపై అవగాహన లేకపోవడంతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని, రైతులు శాస్త్రవేత్తల సూచనల మేరకు వరి వంగడాలను సాగు చేస్తే కొంతమేర నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నాణ్యమైన వరి వంగడాలను రైతులు అధిక ఖర్చుతో పంటలు సాగుచేస్తున్నారని, వర్షాల కారణంగా పంటలు నీటమునుగుతున్నాయని తెలిపారు. రైతులు నష్టపోకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో కూడిన పంటలను పండించుకుంటే నష్టాలను అధిగమించవచ్చన్నారు. ఐసీఎఆర్ ఆధ్వర్యంలో అనంతరపురంలో రూ.300 కోట్లతో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, మొదట విడతగా రూ.70 కోట్లతో ఐసీఏఆర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
బాపట్ల వ్యవసాయ కళాశాల సమగ్రాాభివృద్ధి కోరుతూ కోటి రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుపాన్, వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు సంబంధించి చర్చించడంతోపాటు నష్టనివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యవసాయంలో ప్రస్తుత పరిణామంలో చోటుచేసుకున్న మార్పులు, ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులపై చర్చ సాగింది. సదస్సులో ఐసీఏఆర్ బోర్డు మెంబర్ డాక్టర్ నాగిరెడ్డి, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పద్మనాభరాజు, అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ బాలరామ్‌నాయక్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.సుబ్బయ్య, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ సంస్ధల డెరైక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.