టీడీపీ నేతల మైండ్‌గేమ్‌!

TDP Leaders Mind Game - Sakshi

వైఎస్సార్‌ సీపీ వార్డు మెంబర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు

పోతేపల్లి గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవంలో టీడీపీ  నేతల లీలలు

మచిలీపట్నం సబర్బన్‌ : మండల పరిధిలోని పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం టీడీపీ నేతల ‘పచ్చ’పాతం మరోమారు బహిర్గతం అయ్యింది. కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్‌ సీపీ పంచాయతీ వార్డు మెంబర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించుకోవడం గ్రామంలో అలజడి రేపింది. పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి వస్తే పార్టీ మారినట్లు తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని వార్డు మెంబర్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా ప్రచారం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఇతర టీడీపీ నేతల చర్యను వారు తప్పుబడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. గత పంచాయతీ ఎన్నికల్లో పోతేపల్లి గ్రామంలో టీడీపీ మట్టి కరిచింది. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌ సీపీకి చెందిన అభ్యర్థులే గెలుపొందారు. 10 వార్డులకు గానూ సర్పంచ్‌తో పాటు 7 వార్డు మెంబర్‌లు వైఎస్సార్‌ సీపీ అనుయాయులే విజయం సాధించారు. దీంతో కంగుతున్న టీడీపీ నేతలు గ్రామంలో పార్టీ పటిష్టత కోసం విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో దొడ్డిదారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఇదే తరహా కుట్ర చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బలవంతంగా కండువాలు కప్పి..  
గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనం స్థానంలో ఇటీవల కొత్తది నిర్మించారు. ఆ భవన ప్రారంభోత్సవానికి శనివారం మధ్యాహ్నం టీడీపీ నాయకులతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు గ్రామానికి చేరుకున్నారు. పంచాయతీ భవనం కావడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన పంచాయతీ వార్డు మెంబర్‌లు మాదిరెడ్డి లక్ష్మి, కాగిత లక్ష్మీవీరరాఘవమ్మ, మాదిరెడ్డి నాగరత్నం, పాలంకి సునీత, పాలంకి వరలక్ష్మి హాజరయ్యారు. మర్యాదపూర్వకంగా మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు. ముందస్తు వ్యూహంతోనే గ్రామానికి వచ్చిన టీడీపీ నేతలు వెంటనే కుట్రకు తెర తీశారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. అయితే, ఆ సమయంలో గ్రామస్తుల మధ్య ఏమీ మాట్లాడలేకపోయామని వార్డు మెంబర్లు తెలిపారు. తామంతా వైఎస్సార్‌ సీపీలోనే కొనసాగుతామని సభ అనంతరం వారు వెల్లడించారు. 

గతంలోనూ..
టీడీపీ గతంలోనూ ఇదే తరహా కుతంత్రాలకు పాల్పడింది. ఇటీవల పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. దీంతో కంగుతిన్న మంత్రి కొల్లు రవీంద్ర మండల పరిధిలోని ఎస్‌ఎన్‌ గొల్లపాలెంలో రోడ్డుపై ప్రయాణించే ట్రాక్టర్‌ డ్రైవర్‌లను, అటుగా సైకిల్‌పై వెళ్లే గ్రామస్తులను ఆపి టీడీపీ కండువాలు కప్పారు. అక్కడితో ఆగకుండా గ్రామంలో కొందరు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరినట్లు ఆయనే ప్రకటించుకున్నారు. ఈ కుటిల రాజకీయాన్ని అప్పట్లోనే ‘మంత్రి వర్యా.. ఇదేం పనయ్యా’ అనే కథనంతో ‘సాక్షి’ బహిర్గతం చేసింది. తాజాగా పోతేపల్లిలోనూ ఇదే తరహాలో టీడీపీ నాయకులు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. 

ప్రజా మన్ననలు పొందలేక దొడ్డిదారి రాజకీయాలు.. 

గడిచిన మూడున్నరేళ్లలో టీడీపీ నాయకులు రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ప్రజలకు రాక్షస పాలన ఎలా ఉంటుందో చవి చూపించారు. పాలనలో పారదర్శకత లోపించింది. ఎన్నికల హామీలు అమలు చేయలేదు. తాగునీరు, సాగు నీరు లేదు. రైతులను నట్టేట ముంచారు. గ్రామాల్లో ప్రతి పనికీ ఓ రేటు కట్టి జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజలను వేధిస్తున్నారు. దీంతో ప్రజలే తిరగబడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దొడ్డిదారి రాజకీయాలు ప్రారంభించారు. వారెన్ని కుట్రలు చేసినా ప్రజల మన్ననలు పొందలేరు. 
– పిప్పళ్ల నాగేంద్రప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు, పోతేపల్లి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top