అమలాపురం భూ కుంభకోణంలో టీడీపీ వారు ఉన్న విషయాన్ని తాము రుజువు చేస్తామని, లేకపోతే రాజకీయ సన్యాసం ...
అమలాపురం భూ బాగోతంపై వైఎస్సార్‌సీపీ నేత వీసం రామకృష్ణ సవాల్
ఈ అక్రమాలను జగన్ దృష్టికి తీసుకెళ్తాం
భూస్కాంపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలి
నక్కపల్లి: అమలాపురం భూ కుంభకోణంలో టీడీపీ వారు ఉన్న విషయాన్ని తాము రుజువు చేస్తామని, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని, టీడీపీ వారు లేరని నిరూపిస్తే ఆ పార్టీ నాయకులు సన్యాసం తీసుకుంటారా అని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ సవాల్ విసిరారు. బాధ్యులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ విలువైన ప్రభుత్వ భూములకు అక్రమంగా రికార్డులు తారుమారు చేసి కోట్లాది రూపాయల పరిహారం స్వాహా చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు బహిర్గతమైందన్నారు. ఈ వ్యవహారం పత్రికల్లో వచ్చినప్పటికీ ఇంతవరకు జిల్లా యంత్రాంగం స్పందించి ప్రత్యేకాధికారిని నియమించి విచారణ జరిపించకపోవడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారాన్ని ఉపయోగించి టీడీపీ కార్యకర్తలు ఈ భూములను తమపేరున రాయించుకున్నారని చెప్పారు. అధికారులపై చర్యలు తీసుకుంటే ఈ బాగోతం వెనుక ఉన్న పెద్ద లెవరనేది బయటకు తెలిసిపోతుందనే భయంతో ఎవరిపైనా చర్యలు తీసుకోవడంలేదన్నారు.
ఈ కుంభకోణంలో నిందితులను రక్షించేందుకు కొంతమంది అధికారపార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతల ఒత్తిడితో జరిగిందని, అధికారులను బెదిరించి ఈ అక్రమాలు చేయించారని పేర్కొన్నారు. నక్కపల్లిలో భూసేకరణ ప్రక్రియ మరో అమరావతిలా తయారైందని, ఇక్కడ భూములను కూడా అడ్డగోలుగా కొట్టేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారని విమర్శించారు. ఈ ్యవహారంపై తక్షణమే కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టకపోతే పార్టీ తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ బాగోతంలో తెలుగుదేశం పార్టీ వారు ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీడీపీ నాయకులు ప్రక టించారని, కీలక వ్యక్తులు ఆ పార్టీ వారేనని, మాజీ సర్పంచ్‌లు, జన్మభూమి కమిటీ సభ్యుల పేరునే రికార్డులు మార్చారని తెలిపారు. దీనికి ఆ పారీ ్టనాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమలాపురంలో జరిగిన భూ బాగోతంపై ఈనెల 18న నియోజకవర్గ పర్యటనకు రానున్న జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఒక్క అమలాపురంలోనే కాదు.. మిగిలిన గ్రామాల్లో కూడా అధికారులు, అధికార పార్టీ నాయకులు ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారని త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు.