వాటాల్లోనే అనుసంధానం | TDP Delayed Connecting Godavari And Panna rivers | Sakshi
Sakshi News home page

వాటాల్లోనే అనుసంధానం

Apr 19 2019 1:24 PM | Updated on Apr 19 2019 1:24 PM

TDP Delayed Connecting Godavari And Panna rivers - Sakshi

నకరికల్లు వద్ద గోదావరి – పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు (ఫైల్‌)

గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియలో అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు సుమారు రూ.750 కోట్ల మొబలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చేసింది. కనీసం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎత్తిపోతలకు సంబంధించి మోటార్లు, పంపులు, పైపుల కొనుగోలు పేరిట ఇచ్చిన మొబలైజేషన్‌ అడ్వాన్సుల్లో ప్రభుత్వ పెద్దలు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య వాటాల పంపిణీకి తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, అమరావతి బ్యూరో: ‘గోదావరి–పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులను మే నాటికి పూర్తిచేస్తాం.. గ్రావిటీ ద్వారానే ఖరీఫ్‌లోనే నాగార్జున సాగర్‌ కుడి కాలువకు సాగునీటిని విడుదల చేస్తాం..’ అంటూ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మారాయి. అనుసంధానం పనులకు సంబంధించి ఇప్పటి వరకూ భూసేకరణే ప్రారంభం కాలేదు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు గత ఏడాది నవంబర్‌ 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకరికల్లు వద్దశంకుస్థాపన చేశారు. మే నెలాఖరుకు నకరికల్లు ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి ఎన్‌ఎస్పీ కాలువలకు నీరు ఇస్తామని చెప్పించి, మెగా, ఆర్‌వీఆర్‌ కాంట్రాక్టు ప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సన్మానాలు చేసి ప్రజలను మభ్యపెట్టారు, కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే మొబలైజేషన్‌ అడ్వాన్సులు దండుకొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు సైతం తమవాటాలను తీసుకొని కాంట్రాక్టర్లలకు, ప్రభుత్వానికి వంత పాడారు.

ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా...
గోదావరి–పెన్నా మొదటి దశ పనుల్లో భాగంగా నకరికల్లు వద్ద నాగార్జున సాగర్‌ కుడికాలువలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.6020.15 కోట్లతో ఐదు దశల్లో గోదావరి జలాలను ఎత్తి పోసేలా టెండర్లు ఖరారు చేశారు. హరిశ్చంద్రపురం, లింగాపురం, ఉయ్యందన, గంగిరెడ్డిపాలెం, నకరికల్లులో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని నిర్ణయించారు. తుళ్లూరు మం డలం హరిశ్చంద్రపురం నుంచి నకరికల్లు సమీపంలోని నాగార్జున సాగర్‌ కుడికాలువ 80 కిలోమీటర్‌ వద్దకు నీటిని పంపింగ్‌ చేయాలి. 148.68 మీటర్ల ఎత్తుకు నీటిని ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా లిఫ్ట్‌ చేయనున్నారు. ఇందులో 10.25 కిలోమీటర్ల మేర పైపులైను, 56.35 కిలోమీటర్ల మేర కాలువ పనులు పూర్తి చేయాల్సింది. 20 పంపులతో నీటిని ఎత్తిపోసేందుకు 577 మెగావాట్ల విద్యుత్‌ అవసరంని అంచనా వేశారు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానం ద్వారా జిల్లాలో 5.12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయాలన్నది లక్ష్యం. భూ సేకరణ ప్రా రంభంకాకుండానే కాంట్రాక్టర్లకు పది శాతం మొబలైజేషన్‌ అడ్వాన్సు కింద సుమారు రూ.750 కోట్లు మంజూరు చేశారు. ఎత్తిపోతల కథకానికి అవసరమైన పంపులు, మోటార్లు, పైపులు కొనుగోలు పేరిట వాటాలు దండుకోవడానికే ఈ నిధులు విడుదల చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విడుదలవని భూసేకరణ నోటిఫికేషన్‌
మే నెలాఖరుకు పనులు పూర్తి చేసి, ఖరీఫ్‌కు నీరు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా పనులు సాగటం లేదు. కనీసం ఇప్పటి వరకు భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 3,541 ఎకరాల భూమిని సేకరించాల్సింది. దీనిని మూడు నెలలోనే పూర్తి చేస్తామని ప్రాజెక్టు పనుల శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని ఏడు మండలాల పరిధిలో ఉన్న 30 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సింది. అయితే తుళ్లూరు, నకరికల్లు, రాజుపాలెం, క్రోసూరు మండలాల్లోని రైతులు భూసేకరణను వ్యతిరేకించారు. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. భూములు ఇచ్చేది లేదని పలు చోట్ల భూ సేకరణ సర్వే పనులను అడ్డుకొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు వెళ్లి ఆందోళన చేశారు. కాంట్రాక్టు పనులను అడ్డుకున్నారు. అధికారులు రూపొందించిన భూసేకరణ ప్రణాళికపై భూ యజమానుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించలేదు. తొలుత రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించాలి. సామాజిక అధ్యయనం చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం ఇంత వరకు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో గోదావరి–పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా నాగార్జున సాగర్‌ కుడి కాలువకు ఖరీఫ్‌లో నీరు ఎలా వస్తుందని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది కూడా నాగార్జున సాగర్‌ ఆయకట్టులో ఖరీఫ్‌ సాగుకు గండం తప్పదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement