రైతులకు రాయితీపై ఇచ్చే వ్యవసాయ పరికరాల సరఫరాలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
ఒంగోలు టూటౌన్: రైతులకు రాయితీపై ఇచ్చే వ్యవసాయ పరికరాల సరఫరాలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి.. రబీ సీజన్ ప్రారంభమై రెండవ నెల కూడా గడుస్తోంది. అయినా అటు వ్యవసాయశాఖ మంత్రిగానీ.. ఇటు అధికారులు గానీ యంత్రీకరణ ఊసే ఎత్తడంలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నదాతకు అందిస్తున్నామంటూ ఊదరగొట్టుకోవడం తప్పితే..క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడంలేదు.
జిల్లాలో 5.50 లక్షలకు పైగా రైతులతో పాటు సన్న, చిన్నకారు రైతులున్నారు. కౌలు రైతులు 2 లక్షల వరకు ఉన్నారు. వీరంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఖరీఫ్‌లో ఏటా 2,23,643 హెక్టార్లు, రబీలోనూ అంతే స్థాయిలో సాగవుతోంది. ఏటా సరాసరి 3.28 లక్షలకు పైగా వరి సాగు చేస్తుం టారు. కొన్నేళ్లుగా కూలి రేట్లు పెరగటంతో పాటు కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. ఇంకా ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలతో వ్యవసాయం భారమవుతోంది.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వరినాట్లు వేసే యంత్రాలు, విత్తనాలు ఎదబెట్టే పరికరాలతో పాటు ట్రాక్టర్ పనిముట్లు రోజ్‌వేటర్లు, కంబైన్డ్ హార్వెస్టింగ్ పరికరాలు, త్రైవాన్ స్ప్రేయర్లు, మందులు పిచికారి చేసే యంత్రాలు ప్రభుత్వం 50 శాతం రాయితీపై రైతులకు పదేళ్లుగా ఇస్తూ వస్తోంది. ఆర్‌కేవీవై పథకం, ఏటా అమలు చేసే వ్యవసాయ యాంత్రీకరణ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనే మూడు రకాల పథకాల ద్వారా వ్యవసాయ పనిముట్లను రాయితీపై ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
ఈ యేడాది ఇంత వరకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ పోయినా కనీసం రబీకైనా వ్యవసాయ పరికరాలు రాయితీపై అందిస్తారేమోనని రైతులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం రూ.7 కోట్లు మంజూరైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ పరికరాల రేట్లు మాత్రం ఇంకా ప్రభుత్వం ఖరారు చేయలేదు.