పరీక్షలు సరే.. గడువేది? 

students not have a time for preparing for dsc exam in ap - Sakshi

అటు టెట్‌.. ఇటు డీఎస్సీతో అవస్థలు 

ప్రిపరేషన్‌కు సమయమే లేదని ఆందోళన 

టెట్‌పై టెర్ట్‌ అభ్యర్థులకు స్పష్టత కరువు 

కోచింగ్‌ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు 

సమయమివ్వాలని కోరుతున్న అభ్యర్థులు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ డీఎస్సీ రాసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు సంబంధించి ఈనెల 14న నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది. ఈనెల 18వ తేదీనుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం.. జనవరి 17 నుంచి 27వ తేదీవరకు ఆన్‌లైన్‌ (కంప్యూటరాధారితంగా)లో వీటిని నిర్వహించనున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం ఈసారి పరీక్షలకు అతి తక్కువ సమయం కేటాయించిందని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌కు ఈసారి సిలబస్‌ను కూడా ఇంతకు ముందుకన్నా పెంచారని, ఈ నేపథ్యంలో ప్రిపరేషన్‌కు ప్రస్తుతమిచ్చిన వ్యవధి సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ తరువాత కనిష్టంగా 45 రోజుల సమయం ఉండాలని, కానీ కేవలం 17 రోజులు మాత్రమే ఉండడంతో ప్రిపరేషన్‌ను పూర్తి చేయలేకపోతున్నామని వాపోతున్నారు. సమయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

150 మార్కులకే అయినా... 
టెట్‌ను ఈసారి ఆన్‌లైన్లో ఆబ్జెక్టివ్‌ తరహాలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తున్నారు. ఎలిమెంటరీ తరగతులకు పేపర్‌–1, ఆపై తరగతులకు పేపర్‌ –2 కింద వేర్వేరుగా సిలబస్‌లు ఇచ్చారు. ఒక్కో పేపర్లో ఇచ్చే ప్రశ్నలు 150 మాత్రమే అయినా వాటి సిలబస్‌ను చాలా ఎక్కువగా పొందుపరిచారని చెబుతున్నారు. పేపర్‌–1లో చైల్డ్‌ డెవలప్‌మెంట్, బోధనా పద్ధతులు, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌ ), మేథమెటిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ అనే అయిదు విభాగాల్లో 30 మార్కుల చొప్పున 150 మార్కులకు 150 ప్రశ్నలుంటాయి.  

పేపర్‌2లో చైల్డ్‌ డెవలప్‌మెంట్, బోధనా పద్ధతులు, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌)లలో 30 చొప్పున ప్రశ్నలు 30 మార్కులకు చొప్పున ఉంటాయి. ఇవి కాకుండా ఆయా ప్రత్యేక మెథడాలజీలకు సంబంధించి మేథమెటిక్స్, సోషల్‌స్టడీస్, ఇతర అంశాలకు 60 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఈ సిలబస్‌ ఎక్కు వగా ఉండడం, ప్రామాణిక పుస్తకాలు కూడా అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు.  

మళ్లీ టెట్‌ నిర్వహిస్తారా? 
టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించడానికి అవకాశముంది. అయితే ప్రభుత్వం గత మూడునాలుగేళ్లుగా టెట్‌ను నిర్వహించడం లేదు. దీంతో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు అనేక మంది టెట్‌ను రాయలేకపోయారు. మధ్యలో 2014లో టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ సమయంలో ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహించకుండా టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు కమ్‌ టీచర్‌ రిక్రూట్‌మెంటు టెస్టు (టెట్‌ కమ్‌ టెర్ట్‌)ను నిర్వహించింది. అప్పట్లో రెండింటికీ కలిపి ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించి ఇచ్చింది. టీచర్‌ ఎలిజిబులిటీ, రిక్రూట్‌మెంటు ప్రశ్నలను పార్టు–1, పార్టు–2 కింద వేర్వేరుగా చేసి ఇచ్చారు. ఇప్పుడు 2014 టెర్ట్‌ రాసిన వారిని టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు రాసిన వారిగా పరిగణిస్తారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. అప్ప ట్లో టెట్‌ను వేరేగా నిర్వహించనందున ఈ పరిస్థితి ఏర్పడింది. 

కోచింగ్‌సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు 
ప్రభుత్వం మూడున్నరేళ్ల తరువాత డీఎస్సీని ప్రకటించడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే టెట్‌ రాసిన వారితో పాటు కొత్తవారు కూడా టెట్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. టెట్‌కు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉన్నందున ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు వేలాది మంది అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అవనిగడ్డలోని కోచింగ్‌ సెంటర్లో అయితే ఖాళీలు లేవంటూ అభ్యర్థులను వెనక్కు పంపిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెట్‌తో సహీ డీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యేందుకు తమకు సరిపడా వ్యవధి ఇవ్వాలని, అదే సమయంలో 2014లో టెట్‌ కమ్‌ టీఆర్టీని రాసిన వారు మళ్లీ టెట్‌ రాయాలో వద్దో కూడా స్పష్టతనివ్వాలని అధికారులను కోరుతున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top