గతమెంతో ఘనం..వర్తమానం దైన్యం..అన్నట్లు తయారైంది క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన విజయనగరంలో క్రీడామైదానాల పరిస్థితి.
విజయనగరం మున్సిపాలిటీ: గతమెంతో ఘనం..వర్తమానం దైన్యం..అన్నట్లు తయారైంది క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన విజయనగరంలో క్రీడామైదానాల పరిస్థితి. అందరికీ అందుబాటులో జిల్లాకేంద్ర నడిబొడ్డున గల రాజీవ్ క్రీడామైదానం ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 2014వ సంవత్సరంలో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ ధాటికి కొన్ని వనరులు పాడవగా..కేవలం నష్ట అంచనాలు రూపొందించడం మినహా అంతకుమించి ఒక్కడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా మైదానం నిర్వహణ భారం మోయలేమని బాధ్యతలను తీసుకోవడానికి క్రీడాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీ వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాంప్లెక్స్‌లోని మౌలిక సౌకర్యాలు మరుగునపడుతున్నాయి.
నిర్వహణకు నెలకు రూ20వేలు అవసరం
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు నిధులు కరువయ్యాయి. నెలవారీ దీని నిర్వహణకు సుమారు రూ.20 వేల వరకూ అవసరం ఉంటుంది. అయితే ఆ నిధులు ప్రత్యేకంగా ఎక్కడ నుంచీ వచ్చే అవకాశం లేకపోవడం వల్ల డీఎస్‌ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల వరకు జిల్లా స్థాయిలో జరిగే క్రీడాపోటీలను ఉడా అనుమతితో నిర్వహించి, అందుకు అయిన ఖర్చును పోటీల నిర్వాహకుల నుంచి వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. ఫలితంగా మైదానం ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. అలాగే ఇండోర్‌లోని ఉడెన్ గ్రౌండ్, వసతి గదులు, ప్రధాన ప్రవేశద్వారాలు, పార్కింగ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య లోపం నెలకొంది. రాత్రి , పగలు తేడా లేకుండా మైదానం ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి.
గతంలోనే సూచించినా ప్రయోజనం శూన్యం
మైదానం నిర్మాణ సమయంలోనే వాణిజ్య దుకాణాలు నిర్మించడం ద్వారా వాటిపై వచ్చే అద్దెతో నిర్వహణ చేయాలని ప్రతిపాదన వచ్చినా అప్పట్లో పట్టించుకోకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేడియం పడమర, ఉత్తర ప్రాంతాల్లో ప్రహరీ ఆనుకొని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తే వాటి ఆదాయంతో నిర్వహణ సమస్య తీరుతుందని పలువులు సూచించారు. అయితే ఆ ప్రతిపాదనను అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు తోసిపుచ్చడంతో పరిస్థితి దయనీయంగా మారింది.
నిర్వహణకు స్థిరాదాయ వనరులు కావాలి
రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహణకు స్థిరంగా ఆదాయం వచ్చే వనరులు కావాల్సి ఉందని డీఎస్‌డీఓ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. కాంప్లెక్స్ పరిసరాలలో వాణిజ్య భవనాలు నిర్మించే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. స్వతహాగా తమ శాఖకు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే బాధ్యతలను తీసుకోలేదని వివరించారు. భవన నిర్మాణానికి మున్సిపాలిటీ నిధులను వెచ్చిస్తే కాంప్లెక్స్ అభివృద్ధి సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు.