అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల లెక్కింపునకు తీవ్ర కసరత్తు చేసిన రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి తుది నివేదికను రూపొందించారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల లెక్కింపునకు తీవ్ర కసరత్తు చేసిన రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి తుది నివేదికను రూపొందించారు. స్వయంగా దరఖాస్తు చేసిన వాటితో పాటు ఆన్‌లైన్ ద్వారా వచ్చినవి, మహిళలు, పురుషుల వారీగా వివరాలను క్రోడీకరించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు. ఓటర్ల సవరణ-2014 కార్యక్రమాన్ని పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం నవంబరు 18వ తేదీన ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఆరోజు నుంచి మొదలు ఈనెల 23వ తేదీ వరకు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆదివారాలలో స్పెషల్ క్యాంపెయిన్ డేలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల్లోనే ప్రజల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించారు. అలాగే ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇలా చివరి రోజు వరకు జిల్లాలో ఓటు నమోదు కోసం 1,50,166 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఆన్‌లైన్ ద్వారా 89,566 వచ్చాయి.
ఇక తహశీల్దార్ కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇందులో పురుషులు 29,108, మహిళలు 31,493 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యంతరాలకు సంబంధించిన ఫారం-7ను ఫీల్డ్ ద్వారా 3834 మంది పురుషులు, 3,795 మంది మహిళలు సమర్పించారు. ఆన్‌లైన్ ద్వారా 2032 దరఖాస్తులు వచ్చాయి. ఇలా మొత్తం 9661 దరఖాస్తులు అందాయి. ఇక సవరణలకు సంబంధించిన ఫారం-8కు ఫీల్డ్ ద్వారా 3614 మంది పురుషులు, 3516 మంది మహిళలు దరఖాస్తులు సమర్పించారు. ఆన్‌లైన్ ద్వారా 20,528 అందాయి. ఇలా మొత్తం 27,658 దరఖాస్తులు వచ్చాయి. చిరునామా మార్పులకు సంబంధించి మొత్తం 7747 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో ఫీల్డ్ ద్వారా 2825 మంది పురుషులు, 2631 మంది మహిళలు సమర్పించారు. ఆన్‌లైన్ ద్వారా 2291 ఫారం-8ఏలు వచ్చాయి.
25 నుంచి నమోదుకు అవకాశం
ఈనెల 23వ తేదీతో ఓటు నమోదు కార్యక్రమం ముగిసింది. ఇంకా ఎవరైనా ఓటర్లుగా నమోదు చేసుకోకుండా మిగిలిపోయి ఉంటే నిరుత్సాహ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు నుంచి మళ్లీ నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు ఓటు నమోదు కోసం అధికారులకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది.