ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు తారస్థాయికి చేరుతున్నాయి
సాక్షి నెట్‌వర్క్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు తారస్థాయికి చేరుతున్నాయి. విభజన ప్రక్రియపై ముందడుగు వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోస్తా, రాయలసీమ జిల్లాల ప్రజ తెగేసి చెబుతోంది. వరుసగా 53వరోజు జనం శనివారం వివిధరూపాల్లో రాష్ట్ర విభజనయత్నాలపై తమ ఆందోళనలను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్‌జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నగరాలు, పట్టణాల్లో శనివారం సాయంత్రం6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇళ్ళల్లో స్వచ్ఛందంగా కరెంట్ వినియోగం నిలిపివేశారు.
విద్యార్థుల భారీ ర్యాలీ
కృష్ణా: విజయవాడలో విద్యార్థులు సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కురుమద్దాలిలో విద్యార్థులు రహదారిపై రాస్తారోకో చేశారు. గుడివాడ నెహ్రుచౌక్ సెంటర్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు.
మున్సిపల్ ఉద్యోగుల 2కే రన్
గుంటూరు: తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. సమైక్యనినాదాలు చేస్తూ రోడ్డుపై క్రీడావిన్యాసాలు చేపట్టారు.
ఒంగోలు గిత్తలతో ప్రదర్శన
ప్రకాశం: ఒంగోలు గిత్తలతో పశు సంవర్ధకశాఖ ఉద్యోగులు ఒంగోలు నగరంలో ప్రదర్శన చేపట్టారు. యర్రగొండపాలెంలో ృపాధ్యాయులు బూట్ పాలిష్ చేసిన నిరసన తెలిపారు. గిద్దలూరులో ముదిరాజ్ సామాజిక వర్గ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.
బస్సులు, ట్రాక్టర్లు, జేసీబీలతో ర్యాలీ
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: నగరంలో సమైక్యవాదులు స్కూలు బస్సులు, ట్రాక్టర్లు, జేసీబీలతో ర్యాలీ నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఉద్యోగులు మినీబైపాస్ నుంచి ఇరిగేషన్ కార్యాలయం వరకు వెనకకు నడిచి వినూత్న నిరసన చేపట్టారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
విశాఖ: అనకాపల్లిలో మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీగా బయల్దేరి నిరసన వ్యక్తంచేశారు. జీకేవీధిలో సమైక్యవాదులు పచ్చగడ్డి తిని నిరసన వ్యక్తం చేయగా, చోడవరంలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నడుస్తూ ప్రదర్శన చేపట్టారు.
జేఏసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన
తూర్పుగోదావరి: కాకినాడలో జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం సహా జేఏసీ నేతలు కాకినాడలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్ధిస్తూ ఐ.పోలవరం మండలం మురమళ్ల నుంచి తిరుపతికి 15మంది సైకిల్ మెకానిక్‌లు శనివారం సైకిల్ యాత్ర ప్రారంభించారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల దీక్ష
పశ్చిమగోదావరి: కొవ్వూరులో శనివారం ఒక్కరోజే వెయ్యి మందికిపైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సామూహిక దీక్షలో కూర్చున్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన గూడెంగర్జనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్, ‘జనచైతన్య’ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు
తాటిపూడి జలాశయంలో జలదీక్ష
విజయనగరం: గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలో పలువురు సమైక్యవాదులు జలదీక్ష చేశారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్‌లో గంటసేపు మానవహారం నిర్వహించారు.
బూట్లు తుడిచి జెడ్పీ ఉద్యోగుల నిరసన
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు కూరగాయలు అమ్మి నిరసన తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చిన వారి బూట్లను తుడిచారు. ఇచ్చాపురంలో ఎన్జీవోలు కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నడిచారు.
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
అనంతపురం: అనంతపురం నగరంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గుంతకల్లులో జేఏసీ ఆధ్వర్యంలో హంద్రీ-నీవా కాలువలో జలదీక్ష చేపట్టారు. కాలువలో శీర్షాసనం వేశారు.
రైతుల దీక్ష
కర్నూలు: నంద్యాలలో 101మంది రైతులు స్థానిక కేసీ కెనాల్ కార్యాలయం దగ్గర రిలే దీక్షలో కూర్చున్నారు. ఎమ్మిగనూరులో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల సైకిళ్లతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అధ్యాపకుల భిక్షాటన
వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో ప్రైవేటు వృత్తి కళాశాలల అధ్యాపకులు భిక్షాటన చేశారు. జమ్మలమడుగులో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ర్యాలీ చేశారు.
సమైక్యాంధ్ర కోసం ఆత్మార్పణం
చికిత్స పొందుతూ అబ్దుల్లా ఖాన్ మృతి
రాష్ట్ర విభజన నిర్ణయంతో కలతచెంది ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన కర్నూలు నగరానికి చెందిన యువకుడు షేక్ అబ్దుల్లా ఖాన్ (30) ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం సాయంత్రం కర్నూలు ఆసుపత్రిలో కన్నుమూశాడు.ఈనెల 17న మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పెట్రోల్ బాటిల్‌తో స్థానికంగా ఉన్న ఓ హోటల్‌పై అంతస్తు పెకైక్కి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకునేలోపే పెట్రోల్‌పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని ప్రభుత్వ సర్వజన వైద్యశాలో చేర్పించగా శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ప.గో.జిల్లా భీమవరానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఏడీసీ చీకట్ల నరసింహమూర్తి (65) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హోరెత్తిన సమైక్య నాదం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడటం మినహా మరో ప్రత్యామ్నాయమే లేదంటూ సీమాంధ్ర ప్రజ వివిధరూపాల్లో గర్జించింది. గుండెగర్జన, ఆత్మకూరు అరుపు, గూడెం గర్జన..... ఇలా వివిధ పేర్లతో శనివారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన సభలు, సమావేశాలకు యువకులు, మహిళలు లక్షలాదిగా తరలివచ్చి సమైక్యనినాదాలు హోరెత్తించారు. తెలుగుతల్లిని ముక్కలు చేయొద్దంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో విద్యార్థుల గర్జన, ఆత్మకూరులో చేపట్టిన ‘ఆత్మకూరు అరుపు’ మహాసభలకు జనం పోటెత్తారు. ఏజేసీ పెంచలరెడ్డి, డీఆర్‌ఓ రామిరెడ్డి, డీఈఓ మువ్వా రామలింగం తదితర ఉన్నతాధికారులు ఆత్మకూరు సభలో పాల్గొని నెల్లూరు జిల్లాలో ఉద్యమానికి ఊపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో జరిగిన విద్యార్థి గర్జనకు ఐదువేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో నిర్వహించిన గూడె ం గుండె గర్జనలో 20వేల మందికి పైగా సమైక్యవాదులు పాల్గొని జై సమైక్యాంధ్ర నినాదాలను మార్మోగించారు.
ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకరరావు మాట్లాడుతూ తెలుగు ప్రజలు తమ వాడి, వేడిని ఢిల్లీలో ఉన్న వేర్పాటు శక్తులకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహిళా గర్జన నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని పాత బస్టాండు సర్కిల్‌లో విద్యార్థి గర్జన, ఆత్మకూరులో వెద్య సిబ్బంది ఆధ్వర్యంలో నల్లమల సమైక్యాంధ్ర ఉద్యమ గర్జన, డోన్‌లో వాల్మీకుల సమైక్య శంఖారావం పేరిట నిర్వహించిన సభలు విజయవంతమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో విద్యార్థి గర్జన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి, మెయిన్‌రోడ్డుపై బైఠాయించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో విద్యార్థులు సమైక్య గర్జన చేపట్టారు. చిత్తూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన జనగర్జనకు వేలాది మంది ప్రజలు హాజరై సమైక్య నినాదాలను హోరెత్తించారు.