‘షార్’లో మోడీ | Prime Minister Narendra Modi lands in Sriharikota | Sakshi
Sakshi News home page

‘షార్’లో మోడీ

Jun 30 2014 1:28 AM | Updated on Aug 15 2018 2:20 PM

‘షార్’లో మోడీ - Sakshi

‘షార్’లో మోడీ

షార్ నుంచి సోమవారం ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం షార్‌కు చేరుకున్నారు.

* శ్రీహరికోటలో ప్రధానికి ఘన స్వాగతం పలికిన ఇస్రో శాస్త్రవేత్తలు, గవర్నర్, ఆంధ్రప్రదేశ్ సీఎం
* నేడు పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించనున్న ప్రధానమంత్రి
* రాకెట్‌లో ఐదు విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపనున్న ఇస్రో
 
సాక్షి, సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి సోమవారం ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం షార్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా వచ్చారు. వీరికి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్, షార్ డెరైక్టర్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్, ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

మోడీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు వస్తారని ముందుగా ప్రకటించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్, సీఎం మధ్యాహ్నం 3.30 గంటలకే రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో షార్‌కు చేరుకున్నారు. అయితే మోడీ గంట ఆలస్యంగా చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు షార్‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య భాస్కర్ అతిథి భవనానికి వెళ్లారు.

అక్కడ కొంతసేపు సేదతీరాక రాత్రి 7.15 గంటలకు మొదటి ప్రయోగవేదిక వద్దకెళ్లి పీఎస్‌ఎల్‌వీ సీ23 రాకెట్‌ను సందర్శించారు. అనంతరం రెండో ప్రయోగవేదికకు అనుసంధానంగా ఉన్న వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను పరిశీలించారు. రాకెట్ అనుసంధానం తదితర అంశాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి తమ ప్రభుత్వం మరింత చేయూతనిస్తుందని ప్రధాని మోడీ షార్ సందర్శన సందర్భంగా సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
 
మోడీకి ప్రజాప్రతినిధుల స్వాగతం
షార్ వద్ద ప్రధాని, కేంద్రమంత్రులకు స్వాగతం పలికిన వారిలో గవర్నర్, సీఎం, షార్ శాస్త్రవేత్తలతో పాటు.. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, మునిసిపల్ శాఖామంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్, నెల్లూరు శాసనమండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు పరసా వెంకటరత్నం, బల్లి దుర్గాప్రసాద్, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
 
అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తితో వచ్చా: మోడీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెండు రోజుల పర్యటన  నిమిత్తం ఆదివారం షార్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. తొలిరోజు ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. షార్ కేంద్రంలో ఆయనకు స్వాగతం పలికిన ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. అంతరిక్ష పరిశోధనలపై తనకు ఆసక్తి ఉందని, అందుకే ప్రత్యేకంగా వచ్చినట్లు ఈ సందర్భంగా వారికి తెలిపారు.

భవిష్యత్తులో తమ ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆయన రాకెట్ వివరాలను శాస్త్రవేత్తలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ప్రధానికి రాకెట్ ప్రయోగంపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement