క్షణమొక యుగం

Political Leaders Tension on Election Results - Sakshi

అధికార పార్టీ అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఓటరు నాడి తెలుసుకునేందుకు తంటాలు

కుప్పంలో చంద్రబాబు మెజారిటీపై సర్వేలు

సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎంతో ఉత్కంఠగా సాగాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతలు పూర్తయిన తరువాతనే ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారిలో ఆందోళన ఎక్కువ అవుతోంది. టీడీపీ అభ్యర్థుల ఓటమి తప్పదనే ప్రచారం ఉండడంతో సర్వేలు సైతం చేయించుకుంటున్నారు. ఓటరు మహాశయుడి తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోడానికి నానా తంటాలు పడుతున్నారు.

ఈవీఎంలలో తీర్పు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొదటి విడత లోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మార్చి 18న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదేరోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిం చింది. మార్చి 25 వరకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన పార్టీలు వైఎస్సార్‌సీపీ, టీడీపీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అసెంబ్లీతో పాటే పార్లమెంటు స్థానాలకు కూడా నామినేషన్లను ఎన్నికల కమిషన్‌ తీసుకుంది. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన నుంచి పవన్‌కల్యాణ్‌ తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో జిల్లావ్యాప్తంగా 81.09 శాతం ఓటింగ్‌ నమోదైంది. అత్యధికంగా గంగాధర నెల్లూరులో 86.45, అత్యల్పంగా తిరుపతిలో 66.05 తిరుపతిలో నమోదైంది.

నిద్ర కరువు
 ఫలితాల కోసం 40 రోజులకు పైగా వేచి చూడాల్సి రావడంతో అభ్యర్థులకే కాదు వారి అనుచరులకూ నిద్ర కరువైంది. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. కనీసం ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా వెలువడకూడదని నిబంధనలు ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. పార్టీపరంగా చూస్తే తమ కార్యకర్తలతో అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ ఓట్లు పడ్డాయో.. ఎక్కడ పడలేదో లెక్కలు తీసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల నుంచి అభ్యర్థులు ఒక్కొక్కరూ ఒక్కో రకం ఫలితాలు చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది.

సర్వేల మీద సర్వేలు
పోలింగ్‌ సరళిని గమనించిన తర్వాత ఓటమి తప్పదని టీడీపీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. అయినా ఎక్కడో ఆశ మెదులుతోంది. దీంతో బూత్‌లవారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డా యో ఫోన్లు, ఇంటింటి సర్వేలు చేయించుకుంటున్నారు. కుప్పంలో మెజారిటీ గణనీయంగా తగ్గుతుందనే వార్తలు వస్తుండడంతో ఆ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు సర్వే నిర్వహించా రు. ఎవరికి ఓటేశారు? ఎందుకు వేశారు? అంటూ ఆ నియోజకవర్గంలోని ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. రోజుకు కనీసం మూడుమార్లు ఫోన్లు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మదనపల్లి, పీలేరు, నగరి నియోజకవర్గాలోని టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే సర్వేలు చేయించుకున్నారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి ఇప్పటికే తన అనుయాయుల వద్ద ఓటమి అంగీకరించారని తెలుస్తోంది.

విహారయాత్రలకు సిద్ధం
పోటీ తీవ్రంగా ఉన్న కొందరు అభ్యర్థులు ఉత్కంఠ తగ్గించుకునేందుకు విహారయాత్రలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు వారాలు శీతల విడిది ప్రాంతాలు, అవసరం అయితే విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే వారు ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై ఆందోళన మాత్రం వెంటాడుతూనే ఉంటుందనేది సత్యం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top