విత్త మంత్రి సీత కన్ను

Political And Economic Experts Commenting On The Union Budget - Sakshi

కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు భరోసా కరువు

ఆర్థిక లోటుతో కొనసాగిల్సిందే..

విభజన హామీ నెరవేరితేనే జిల్లా ప్రకాశవంతం

పారిశ్రామిక పురోగతికి ఊతమివ్వని కేంద్రం

నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయింపు లేదు

కంటి తుడుపుగా రహదారుల అనుసంధానం

ఆదాయ పరిమితి రూ.5 లక్షలతో వేతన జీవులకు ఊరట

రైల్వే ప్రాజెక్టులకు ఊసే లేదు

పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో రోజుకు రూ.75 లక్షలుపైనే భారం

ఆశలపై నీళ్లు చిలకరించిన నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌

సాక్షి, ఒంగోలు సిటీ: కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. పెండింగ్‌ ప్రాజెక్టులు ఇతర అంశాలకు ఆర్ధిక ఊరట కలుగుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి. ఆశలపై  ఒక్క సారిగా నీళ్లు చిలకరించినట్లయింది. కేంద్ర బడ్జెట్‌ ద్వారా జిల్లాలోని ప్రతిపాదిత నీటిపారుదల, రవాణా ప్రాజెక్టులకు ఊతమిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. విభజన హామీ ప్రస్తావనతో పాటు ఇతర అంశాల ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్ధాయి బడ్జెట్‌ను శుక్రవారం కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టారు. తెలుగువారి ఆడపడుచుగా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు.

ఆర్ధిక లోటు జిల్లా అభివృద్ధిని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక అవకతవకల ఫలితాన్ని ఈ ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయ్యింది. వివిధ రకాల లావాదేవీలను నిర్వహించడానికి కొన్ని సందర్భాల్లో కష్టతరమవుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కేంద్రానికి విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌  ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఉంటుందని భావించినా నయాపైసా కేటాయింపు 

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆశాభంగం కలిగించింది. సామాన్యులకు ఈ బడ్జెట్‌ వల్ల ఒరిగిందేమీ లేకపోగా వివిధ రూపాల్లో ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి. ప్రజల సగటు ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం.. అదనపు భారాన్ని పరోక్షంగా మోపింది. రానున్న రోజుల్లో సామాన్యుడి కొనుగోలు శక్తి ఇంకా తగ్గిపోతుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. ప్రతి కుటుంబం కప్పం కట్టాల్సిందేనని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బడ్జెట్‌లోని అంశాలు గుదిబండలు కానున్నాయని చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లోని అంశాలు జిల్లాపై ఎంత మేర ప్రభావం చూపనున్నాయో ఓసారి పరిశీలిద్దాం..

ఐటీ రిటర్నులు ఇవ్వాల్సిందే..
పన్ను చెల్లింపు విధానంలో పారదర్శకతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి లావాదేవీ బ్యాంకుకు అనుసంధానం కానుంది. రూ.2.5 లక్షల లావాదేవీలు దాటిన వారు రిటర్నులు వేయాల్సిందే. రానున్న రోజుల్లో ఆధార్‌ కార్డు ఆధారంగా రిటర్నులు వేసే వెసులుబాటు కల్పించారు. బ్యాంకుల్లో నోట్ల చలామణిని తగ్గించనున్నారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించనున్నారు. నోట్ల చలామణి రానున్న రోజుల్లో బాగా తగ్గుతుంది. కొత్తగా రూ.20 కాయిన్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర లావాదేవీలే అధికంగా ఉండనున్నాయి. రూ.5 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉన్నా లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్యులు సైతం ఇక వారి లావాదేవీలను అనుసరించి కప్పం కట్టాల్సిందే.

మెరుగైన రవాణా
జిల్లాలోని గ్రామాలు, పట్టణాలకు రహదారుల వ్యవస్థను అనుసంధానం చేసి మెరుగైన రవాణా అందుబాటులో తీసుకురావడానికి సాగర్‌మాల, భారత్‌మాల కార్యక్రమాలను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. సాగర్‌మాల రెండో దశ కింద జిల్లాలో రూ.25 కోట్లతో రహదారి అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. జిల్లాలో మూడొంతుల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. సాగర్‌మాల ప్రాజెక్టు కింద పరిమితంగానే నిధులు విడుదల కానున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనం బహు స్వల్పమే.

ప్రతి ఇంటికీ జలశక్తి సాధ్యమేనా?
జిల్లాలో 750 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఒంగోలులోనూ ఐదు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ తాగునీటి సమస్యతీవ్రంగా ఉంది. వెలుగొండ నీరు విడుదలైతేనే తాగునీటికి ఇబ్బందులు ఉండవంటున్నారు. 2020కి జలశక్తి పథకం కింద ప్రతి ఇంటికీ రక్షిత నీరు అందిస్తామన్న ప్రతిపాదన కార్యాచరణకు నోచుకుంటుందా అనే సంశయం నెలకొంది. ఇప్పటికే రూ.68 కోట్ల తాగునీటి తోలకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జలజీవన్‌ మిషన్‌ జిల్లాలో సాధ్యపడేది కాదంటున్నారు.

ఖేల్‌ ఇండియా.. నేతి బీరే
క్రీడల అభివృద్ధి నేతిబీర చందంగానే ఉంది. జిల్లాలో ఎందరో నైపుణ్యం గల క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లేక రాణించలేకపోయారు. ఎందరో మాణిక్యాలు మట్టిలో కలిశాయి. క్రీడా దిగ్గజాలు జిల్లా కీర్తిని ప్రపంచ దేశాల్లో ఎగరవేయడానికి తగిన వనరులు లేక జిల్లా వరకే పరిమితమయ్యారు. ఖేల్‌ ఇండియా ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం ఏదో మొక్కుబడి కార్యక్రమమే అంటున్నారు. ఖేల్‌ ఇండియా విధి విధానాలపై బడ్జెట్‌లో సవిరణ లేకపోవడం గమనార్హం. ఒంగోలులో మినీ స్టేడియం నిర్మాణమే నత్తకు మేనత్తలా కొనసాగుతోంది.

జలమార్గం రవాణాకు ప్రాధాన్యం
నదీ జలాలను వినియోగించుకుని జల రవాణాను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ కాలుష్యంతో పాటు రవాణా వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు. జిల్లాలో బకింగ్‌హాం కాలువ జల రవాణా వ్యవస్థ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. రూ.1,400 కోట్లతో ఈ కాలువను ఆధునీకరిస్తే కాకినాడ నుంచి చెన్నై పోర్టు వరకు జల రవాణా మెరుగవుతుంది. పాలకులు ప్రయత్నిస్తే జిల్లాకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

ఒకే గ్రిడ్‌ ద్వారా విద్యుత్‌
జిల్లాలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే యూనిట్లు ఉన్నాయి. దర్శి ప్రాంతంలో హైడల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ గ్రిడ్‌కు కలుస్తోంది. రాష్ట్రంలో రెండు గ్రిడ్‌లు ఉన్నాయి. ఇక నుంచి దేశవ్యాప్తంగా ఒన్‌ ఇండియా ఒన్‌ గ్రిడ్‌ పథకం కింద.. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఒకే గ్రిడ్‌కు కలిపే విధానం అమలులోకి తీసుకురానున్నారు. విద్యుత్‌ పంపిణీ ఒకే గ్రిడ్‌ ద్వారా జరిగే విధానంతో విద్యుత్‌ కొరత అధిగమించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం వివిధ సంస్థల ద్వారా రోజుకు సుమారు 50 మెగావాట్ల వరకు ఉత్పత్తి జరుగుతోంది.

జన్‌ధన్‌ ఖాతాలపై రూ.5 వేల ఓడీ 
జిల్లాలో 5,62,423 మంది పొదుపు గ్రూపుల మహిళలు ఉన్నారు. వీరిలో జన్‌ధన్‌ ఖాతాలు ఉంటే వారికి రూ.5 వేల ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఇవ్వనున్నారు. బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 3.5 లక్షల మందికి జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నాయి. రూ.5 వేల బ్యాంకు ఓడీని అవసరాలకు తగినట్లుగా వాడుకుని తిరిగి చెల్లించే వెసులుబాటు కలగనుంది.

పాలకు మార్కెట్‌.. పశువుకు దాణా
జిల్లాలో మెగా పశుగ్రాస క్షేత్రాలు ఉన్నాయి. వీటి నుంచి 30 వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. 1,509 ఎకరాల్లో గ్రాసం పండిస్తున్నారు. వీటితోపాటు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, సైలేజి గడ్డి, టీఎంఆర్, కాన్సట్రేట్‌ ఫీడ్, ఫాడర్‌ సీడ్‌ కార్యక్రమాలు అమలులో ఉన్నా సక్రమంగా నిధులు లేక పశుగ్రాసం తగినంత దొరకడం లేదు. ఈ బడ్జెట్‌ ద్వారా పాడిపరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పశువులకు దాణా అందుబాటులో ఉంచడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచి రైతుకు లాభం చేకూర్చడానికి మార్కెట్‌ వసతికి ప్రణాళికాబద్ధంగా పని చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. 

పొదుపు గ్రూపులకు ‘ముద్ర’ రుణం
జిల్లాలో 57,586 పొదుపు గ్రూపులు ఉన్నాయి. వీటికి ఈ బడ్జెట్‌లో ముద్ర రుణాలు ఇవ్వడానికి వెసులుబాటు కల్పించారు. గ్రూపుకు రూ.లక్ష లెక్కన ముద్ర రుణం పొందే వీలుంది. రుణ రికవరీల్లో నూరు శాతంగా ఉన్న గ్రూపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాంకర్లకు మార్గదర్శకాలు రానున్నాయి.

మహిళల్లో ఔత్సాహికులకు రుణాలు
పరిశ్రమల ద్వారా అభివృద్ధి చెందాలనుకునే ఔత్సాహిక మహిళలకు పరిశ్రమల స్థాపనకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి తగిన ప్రొత్సాహం ఇవ్వనున్నాయి. జిల్లాలో 5,800 వరకు చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను మహిళలే నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడానికి బడ్జెట్‌లో ఆయా బ్యాంకులకు ఆర్థిక మద్దతు ఇవ్వనుంది. స్టాండప్‌ ఇండియా వంటి పథకాల ద్వారా హామీ లేని రుణం రూ.కోటి వరకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు బ్యాంకు బ్రాంచ్‌లకు లబ్ధిదారుల ఎంపికకు వార్షిక లక్ష్యాలను ఇవ్వనున్నారు. 

ఎల్‌ఈడీ.. ఎందుకు ప్రతిపాదించినట్లో?
బడ్జెట్‌లో 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఇవ్వడానికి ప్రతిపాదించారు. అన్ని ఇళ్లకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని బడ్జెట్‌లో పెట్టారు. జిల్లాలో 16 లక్షల గృహ విద్యుత్‌ వినియోగదారులకు ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశారు. తెల్ల రేషన్‌ కార్డుదారులు 9,90,528 మంది ఉంటే గ్యాస్‌ కనెక్షన్లు 8,83,867 మంది కలిగి ఉన్నారు. 74,013 మందికి స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా పంపిణీకి చర్యలు తీసుకోగా 73,219 మంది తీసుకున్నారు. దీనదయాల్‌ పథకం కింద అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. అన్ని ఇళ్లకు కరెంట్‌ కనెక్షన్లు, గ్యాస్‌ కనెక్షన్లు, ఎల్‌ఈడీ బల్బుల ప్రతిపాదన జిల్లాకు అంతగా ప్రయోజనం చేకూరే అంశం కాదని నిపుణులు చెబుతున్నారు.

ప్రజా రవాణాలో బహుళ ప్రయోజన కార్డులు
ప్రయాణాల్లో వేగం పుంజుకుంది. ఇక నుంచి బస్సు, విమానం, రైలు ఇలా ప్రజారవాణా వ్యవస్థల్లో గమ్యస్థానాలకు చేరుకోవడానికి బహుళ ప్రయోజన కార్డులను ప్రవేశపెట్టనుంది. ఇక ప్రజా రవాణా సులభతరం కానుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే ఒకే కార్డులో నమోదు చేసుకుని ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. జిల్లాలో పండుగలు, ఇతర ముఖ్యమైన దినాలు, విశేష దినాల్లో రద్దీ వల్ల ప్రయాణల్లో ప్రయాసపడుతున్నారు. ఇకపై ఒకే కార్డులో బహుళ ప్రయోజనం పొందే వెసులుబాటు కలగనుంది. 

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌
జిల్లాలో 1,028 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా పంచాయతీలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. డిజిటల్‌ ఇండియా నేపథ్యంలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం విస్తరించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఇంటర్నెట్‌ లేని గ్రామాలకు ఈ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోనున్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ అన్ని గ్రామాలకు విస్తరించనున్నారు. వీటికి సంబంధించి యూనిట్లను నెలకొల్పడానికి స్థలాల ఎంపికకు చర్యలు తీసుకుంటారు. 

ఆశాజనకంగా లేని బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా లేదు. కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి, దేశ ఆర్థికాభివృద్ధికి, దేశ భద్రతకు పెద్ద పీట వేసినా రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించి నిరాశపరిచారు. కొన్ని అంశాలు ఆహ్వానించదగ్గవే అయినా విభజన లోటుతో అల్లాడుతున్న రాష్ట్రానికి అన్యాయం చేశారు. విభజన సమయంలో సహాయం చేస్తానన్న హామీని నిలబెట్టుకోలేదు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోల ఏర్పాటుపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ప్రత్యేక హోదా సాధన విషయంలో పార్లమెంట్‌లో సభ్యులందరం కలిసి కేంద్రంతో తప్పక పోరాడతాం.
      – మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ 

రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం జరగలేదు
కేంద్ర బడ్జెట్‌ వల్ల రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం జరగలేదు. విభజన హామీల ప్రస్తావనే లేదు. ఒకటి రెండు అంశాల్లో సామాన్యులకు మేలు చేసినట్లే చేసి పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిచారు. సామాన్యులపై వివిధ రూపాల్లో భారాలు మోపారు. విభజన హామీలపై కేంద్రం బడ్జెట్‌లో ఏమాత్రం ప్రస్తావించలేదు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల మంజూరు ఊసేలేదు. ప్రధాని మోదీ పునరాలోచించి నవ్యాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 
       – బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top