
రాజకీయ ప్రకటనలకు ధ్రువీకరణ తప్పనిసరి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు టీవీల్లోగాని, పేపర్లోగాని రాజకీయ ప్రకటనలు ఇవ్వాలంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని కమిటీ చైర్మన్ జేసీ కన్నబాబు తెలిపారు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు టీవీల్లోగాని, పేపర్లోగాని రాజకీయ ప్రకటనలు ఇవ్వాలంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని కమిటీ చైర్మన్ జేసీ కన్నబాబు తెలిపారు. రాజకీయ ప్రకటనల జారీపై శుక్రవారం ఆయన విధి విధానాలను వివరించారు. పోటీ చేసే అభ్యర్థి ఏ ప్రకటనైనా జారీ చేసేందుకు సర్టిఫికెట్ కోసం మూడు రోజుల ముందు ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ఎలక్ట్రానిక్ ఫారంలో ప్రతిపాదిత ప్రకటనను రెండు కాపీలతో పాటు అటెస్టెడ్ ట్రాన్స్‌స్క్రిప్ట్ సమర్పించాలని సూచించారు.
దరఖాస్తు ఫారంలో పొందు పరచాల్సిన వివరాలు..
ప్రకటన నిర్మాణ ఖర్చు, ప్రకటనల సంఖ్య, వాటికి అయ్యే చార్జీ, వేయబడే ప్రతిపాదిత రేటుతో పాటు టెలివిజన్ చానల్/ కేబుల్ నెట్‌వర్క్‌పై ప్రకటన ప్రతిపాదిత టెలికాస్ట్ సుమారు ఖర్చు వివరాలు ఉండాలి.
అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ప్రకటన వేస్తున్నారా అనేది కూడా చూపాలి.
రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కాకుండా ఏ ఇతర వ్యక్తి చేతనైనా ప్రకటన జారీ చేస్తే రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ప్రయోజనం కోసం కాదని, ఈ ప్రకటన ఏ రాజకీయ పార్టీ అభ్యర్థిచే స్పాన్సర్ చేయలేదని ఆ వ్యక్తి ప్రమాణ పత్రం సమర్పించాలి.
చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లింపులు చేసే స్టేట్‌మెంట్ ఇవ్వాలి.
ప్రకటన జారీకి సర్టిఫికెట్ కోసం చేసుకున్న దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే ముందు ప్రకటనలోని దేనినైన తొలగించమని, మార్పు చేయాలని ఆదేశాలు ఇచ్చే అధికారం కమిటీకి ఉంది. తొలగింపు, మార్పు చేయాలని ఆదేశించిన సమాచారం అందిప్పటి నుండి 24 గంటల్లోగా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఇతర ఏ వ్యక్తి అయిన వాటిని పాటించాలి. మార్పు చేసిన, తొలగించిన ప్రకటనకు సర్టిఫికెట్ కోసం తిరిగి దాఖలు చేయాలి.
జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఎంసీఎంసీ పనిచేస్తుంది. ప్రింట్ మాధ్యమంలో ప్రచురించిన చెల్లింపు వార్తలను, ఎలక్ట్రానిక్ మాధ్యమం, సినిమా థియేటర్‌లో ప్రదర్శించిన చెల్లింపు వార్తలు, రేడియో ద్వారా వినిపించిన చెల్లింపు వార్తలు, బల్క్ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపిన సందేశాలు, మొబైల్ నెట్‌వర్క్, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా పంపిన సందేశాలు, చర్చలు, ఇంటర్వ్యూలులను పరశీలించి చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ ప్రకటనలు, పెయిడ్ న్యూస్ విషయంలో ఎంసీఎంసీతో సహకరించాలని కమిటీ చైర్మన్ జేసీ కోరారు.