నీరుగారుతున్న నిషేధం..

Plastic Usage in Vizianagaram - Sakshi

విచ్చలవిడిగా పాలిథిన్‌ కవర్ల వినియోగం

బహిరంగంగా విక్రయాలు పట్టించుకోని అధికారులు

విజయనగరం మున్సిపాలిటీ: నాజూగ్గా ఉందని... ఉచితంగా వస్తుందని... తేలికపాటిదని పాలిథిన్‌ కవర్ల వాడకానికి ప్రజలు అలవాటు పడిపోయారు. ఖాళీ చేతులతో వెళ్లడం... ఎలాంటి వస్తువునైనా పాలిథిన్‌ కవర్లలో తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులకు ప్లాస్టిక్‌ వాడకం కూడా ఒక కారణమని విద్యావంతులకు తెలుసు. అయినప్పటికీ దీని వాడకం ఆగడం లేదు.  

నిషేధం అమలులో ఉన్నప్పటికీ వినియోగం తగ్గడం లేదు. ఫలితంగా మనుషులతో పాటు మూగ జీవాలు సైతం మత్యువాతపడుతున్నాయి. పర్యావరణానికి పెను ప్రమాదంగా తయారైన పాలిథిన్‌ సంచుల వాడకాన్ని నిషేధిస్తూ 1986లో అప్పటి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం హడావుడి చేసిందని తూతూ మంత్రంగా అమలుపరిచి వదిలేశారు. దీంతో ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్‌ గ్లాసులు, కప్పులు, సంచులను వినియోగిస్తున్నారు. టీ దుకాణాలు, పెళ్లిళ్లు, విందుల్లో వీటి వినియోగం ఎక్కువ. 50 మైక్రాన్లకు మించి తయారు చేసిన గ్లాసులు, సంచుల్లో వేడి వస్తువులైన పాలు, టీ, కూరలు వేయడం వల్ల అందులో ప్లాస్టిక్‌ పొర కరిగి పదార్థాల్లో కలిసిపోయి శరీర అవయవాలు దెబ్బతింటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

తనిఖీలు అంతంతమాత్రమే..
విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉన్నప్పటికీ స్థానిక అధికారులు నామమాత్రపు జరిమానాలు విధించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో వ్యాపారులు పెద్దగా లెక్క చేయడం లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే జరిగే సమయంలో తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి ర్యాంకుల కోసం ఆరాటపడుతున్న  అధికారులు  పూర్తి స్థాయి నిషేధంపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

యథేచ్ఛగా విక్రయాలు..
వాస్తవానికి పాలిథిన్‌ సంచులు తయారు చేసే కంపెనీలపై చర్యలు తీసుకుంటే వినియోగాన్ని నివారించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కొనుగోలు చేసి విక్రయిస్తున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవడం వల్ల ఫలితం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేయకుండా ఉంటే వాటిని వాడే అవసరమే ఉండదని ప్రజలు భావిస్తున్నారు.

చట్టం ఏం చెబుతోంది...
పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించడం, వినియోగించడంపై 1986లో చట్టం చేశారు. 20 మైక్రానులు కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ సంచులను విక్రయించకూడదని నిబంధన విధించారు. ఈ తర్వాత దాన్ని సవరిస్తూ 50 మైక్రానులకు పెంచారు. నిషేధిత వస్తువులు తయారు చేసినా, అమ్మినా, వాడినా రూ.2,500 నుంచి రూ.అయిదు వేల వరకు జరిమానా విధించవచ్చు.

కమిటీలు ఏం చేస్తున్నాయి...
పాలిథిన్‌ సంచుల నిషేధం అమలు కమిటీలో కలెక్టరుతో పాటు 10 మంది అధికారులు ఉంటారు. నెలకోసారి ప్లాస్టిక్‌ నిషేధం అమలుపై చర్చించాలి. అయితే ఈ సమావేశాలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 2004 నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉన్నా ఏటా నమోదయ్యే కేసులు పదుల సంఖ్యలో ఉంటున్నాయి.

ప్రజలు చైతన్యం కావాలి...
పర్యావరణానికి పెద్ద శత్రువుగా మారిన ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించేందుకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా చైతన్యవంతులై వీటిని వినియోగించడం మానేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి.

నిషేధిత కవర్లు అమ్మకూడదు...
50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిషేధం అమలైన తర్వాత ఐదు కేసులు నమోదయ్యాయి. ఇటీవల  స్వచ్ఛ సర్వేక్షన్‌ సర్వే జరిగే సమయంలో విక్రయదారులు, ఉత్పత్తిదారులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులను హెచ్చరించాం.    – వెంకట్, మున్సిపల్‌ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top