
సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో దిగ్విజయంగా సాగుతోంది. ప్రజలు వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతోన్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జనమే బలంగా.. జగమంత కుటుంబంలో తానూ ఒక సభ్యుడిగా వైఎస్ జగన్ ముందుకు సాగిపోతున్నారు. ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు తమ సమస్యల్ని పాదయాత్రలో ఉన్న జననేత ఎదుట ఏకరుపెట్టారు. అర్హత ఉన్నా ఉద్యోగాలు రావడం లేదని, చదువుకుని ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని గిరిజన నిరుద్యోగులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. రిజర్వేషన్లు ఉన్నా కాదని, గిరిజనేతరులతో పోస్టులు భర్తీ చేస్తున్నారని వైఎస్ జగన్‌కు తెలిపారు.
డీఎడ్ విద్యార్థులు కూడా వైఎస్ జగన్‌ను కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాబు వస్తే జాబొస్తుందని చెప్పి..ఒక ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వయో వృద్ధులు తమకు పింఛన్ రావడం లేదని, ఎలాగైనా పింఛన్లు ఇప్పించాలని వేడుకున్నారు. స్కూళ్లలో అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యల్ని తీర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.