పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సోమవారం ముహూర్తం ఖరారు కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సాక్షి, నెల్లూరు : పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సోమవారం ముహూర్తం ఖరారు కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 583 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి తో పాటు జెడ్పీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ వివరాలను ఇప్పటికే ప్రకటించారు. వరుసగా ఎన్నికల షెడ్యూళ్లు వస్తుండడంతో రాజకీయ నేతలు బిజీ అయిపోయా రు. అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ లెక్కలు గడుతున్నారు.
ఒక్కో ఎంపీటీసీ పరిధిలో ఒకటి నుంచి మూడు పంచాయతీలు కూడా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక నేతలకు తలనొప్పిగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓ పార్టీకి నాయకులే కరువవగా, మరోపార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఎలాగోలా అభ్యర్థులను నిలిపి పరువుదక్కించుకునే ప్రయత్నంలో వేట సాగిస్తున్నారు. ఆర్థికంగా బలవంతులను బరిలో దించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పల్లెల్లో ఎక్కడ చూసినా రాజకీయ చర్చలే జరుగుతున్నాయి. మరోవైపు సోమవారం నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో ముఖ్య నేతలు అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా గడుపుతున్నారు. పోటీ చేయాలని ఆసక్తి ఉన్న వారు ఆయా నేతల ఇళ్ల వద్ద క్యూ కడుతున్నారు.
కొలిక్కిరాని ఓటర్ల జాబితా
సార్వత్రిక, మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికలకు షెడ్యూల్ మీద షెడ్యూల్ విడుదలవుతున్నా తుది ఓటర్ల జాబితాల రూపకల్పన ఇంకా ఓ కొలిక్కిరాలేదు. జనవరి 31 నాటికి జిల్లాలో 21 లక్షల 83 వేల 42 మంది ఓటర్లున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 28 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తాజాగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలోనూ వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ గ్రామస్థాయిలో వీఆర్వోలు ధ్రువీకరించాల్సి ఉంది. ఆ తరువాత ఓటరు జాబితాలు ప్రచురించారు. ఈ ఆలస్యంతో మండల స్థాయిలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికలకు ఆటంకం లేకపోయినా ఎంపీటీసీలకు మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో ఒకటి నుంచి మూడు పంచాయతీల వరకు ఉండడంతో ఓటరు జాబితాలను గ్రామాల వారీగా విభజించాల్సి ఉంది.