‘విలీనం’ రద్దు | Orders canceled in the merger section of the municipality of Greater | Sakshi
Sakshi News home page

‘విలీనం’ రద్దు

Jan 7 2014 11:36 PM | Updated on Mar 28 2018 10:59 AM

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో 36 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పురపాలక శాఖ మంగళవారం ప్రకటించింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో 36 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ గతంలో జారీ చేసిన  నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పురపాలక శాఖ మంగళవారం ప్రకటించింది. నగరీకరణ, పరిపాలనా సౌలభ్యం పేరుతో శివార్లలోని 36 పంచాయతీలను గ్రేటర్‌లో కల పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్ 26న జీఓను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విలీన గ్రామాల ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారని, ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని పిటిషన్లు దాఖలు చేశారు.
 
 వీటిని పరిశీలించిన న్యాయస్థానం విలీన ప్రక్రియ చట్టప్రకారం జరగలేదని, నిర్ధేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విలీన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. మరోవైపు శివారు పంచాయతీలను గ్రేటర్‌లో కలిపే అంశాన్ని స్థానిక ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులు తప్పుబట్టడంతో మెట్టు దిగిన సర్కారు.. వీటిని నగర పంచాయతీ/మున్సిపాలిటీలుగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు లైన్‌క్లియర్ చేసిన పురపాలకశాఖ.. గతంలో గ్రేటర్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
 
 దీంతో గండిపేట, కోకాపేట, వట్టినాగులపల్లి, నెక్నాపూర్, పుప్పాల్‌గూడ, ఖానాపూర్, హైదర్షాకోట్, మంచిరేవుల, నార్సింగి, బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, హిమాయత్‌సాగర్, పీరంచెరువు, జవహర్‌నగర్, శంషాబాద్, కొత్వాల్‌గూడ, సాతంరాయి, ప్రగతినగర్, కొంపల్లి, దూలపల్లి, నిజాంపేట్, బాచుపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల, ఫీర్జాదిగూడ, పర్వతాపూర్, మేడిపల్లి, నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, జిల్లెలగూడ, పహాడీషరీఫ్, జల్‌పల్లి, మీర్‌పేట, కొత్తపేట, కాల్వంచ(కుంట్లూరు అనుబంధ గ్రామం)ను విలీనం చేస్తూ కిందటేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ  మంగళవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement